Vande Bharat Stunning Journey: కాశ్మీర్ అందాలను ఆస్వాదించాలనుకునే వారికి వందే భారత్ రైలు ప్రయాణం సరికొత్త అనుభూతిని అందిస్తోంది. మంచుతో కప్పుకున్న పర్వతాలు, పచ్చని లోయలు, అద్భుతమైన రైల్వే నిర్మాణాల మధ్య సాగే ఈ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన అయిన అంజి ఖాడ్ వంతెనను వందే భారత్ ఎక్స్ ప్రెస్ దాటుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూసిన కొందరు భారత్ లోనే ఉన్నామా? లేక జపాన్‌లో ఉన్నామా? అనేంత అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందే భారత్ రైలు సొరంగం గుండా ప్రయాణిస్తూ బయటకు వస్తుంది. కొన్ని క్షణాల్లోనే దేశంలోని ప్రత్యేకమైన రైల్వే నిర్మాణాల్లో ఒకటైన అంజి ఖాడ్ వంతెనపైకి చేరుకుంటుంది. వంతెనకు ఇరువైపులా కనిపించే లోతైన లోయలు, చుట్టూ పచ్చని పర్వతాలు ఈ ప్రయాణాన్ని మరింత అందంగా మార్చాయి. రైలులోని ప్రయాణికులు సైతం ఈ అద్భుతమైన దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో వీడియోలుగా షూట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో బోలెడు వ్యూస్ సాధించింది. ముఖ్యంగా రైల్వే వంతెన నిర్మాణం, చుట్టూ కనిపించే ప్రకృతి అందాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ దృశ్యాలు చూస్తుంటే జపాన్‌లో ఉన్న అనుభూతి కలుగుతోందని వ్యాఖ్యానించారు. మరికొందరు దేశంలో ఇలాంటి అద్భుతమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రావడం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అయితే, కొందరు మాత్రం డ్రైవర్ క్యాబిన్‌లోకి ప్రయాణికులను అనుమతించి వీడియోలు తీయించడం సరైనది కాదని కామెంట్స్ చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అంజి ఖాడ్ వంతెన భారతీయ రైల్వే చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది దేశంలో నిర్మించిన తొలి కేబుల్-స్టేడ్ రైల్వే బ్రిడ్జి. లోయల మధ్య నిర్మించిన ఈ వంతెన కాశ్మీర్ రైల్వే లింకేజీని మరింత బలోపేతం చేసింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టులో ఇది ముఖ్యమైన భాగం. కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే మార్గం ద్వారా లింక్ చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించింది.
జమ్మూ తావి నుంచి బయలుదేరే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఉధంపూర్, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, బనిహాల్, అనంతనాగ్ మీదుగా శ్రీనగర్ చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో ప్రకృతి అందాలతో పాటు ఎన్నో ప్రత్యేకమైన రైల్వే నిర్మాణాలను చూడవచ్చు. మరోవైపు, కాశ్మీర్ లోని తీవ్రమైన చలిని దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను ప్రత్యేకంగా రూపొందించారు. మంచు, తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా కోచ్‌లను తీర్చిదిద్దారు. సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ డోర్లు, అత్యవసర సమాచార వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Read Also: ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ట్రయల్ రన్ ఎప్పుడంటే?