Tirumala ticket booking: తిరుమల శ్రీవారి క్షేత్రం అంటే భక్తుల హృదయాల్లో స్థిరమైన నమ్మకం, అపారమైన భక్తి, ఎన్నో ఆశలు, కోరికలు తీరు నిలయంగా ప్రసిద్ధి గాంచింది. అందుకే రోజూ వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి రాకపోకలు సాగిస్తారు. శ్రీవారి దర్శనం కోసం ఎన్నో గంటలు క్యూలైన్లలో నిలబడటం, టికెట్ల కోసం అర్థరాత్రి నుంచే వేచి ఉండటం ఇవన్నీ తరచూ చూసే దృశ్యాలు. ఈ క్రమంలో భక్తులకి మరింత సౌలభ్యంగా దర్శనం జరగాలనే ఉద్దేశంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టికెట్ల కోసం తిరుగుతూ కష్టపడాల్సిన అవసరం లేకుండా, కొత్తగా శ్రీవాణి దర్శన టికెట్ కేంద్రం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
☀ ఇకపైన శ్రీవారి దర్శనం మరింత సులభం!
తిరుమల అన్నమయ్య భవన్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ కొత్త టికెట్ కౌంటర్‌ను మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామలారావు కలిసి ప్రారంభించారు. రూ.60 లక్షల వ్యయంతో ఆధునికంగా నిర్మించిన ఈ కేంద్రం ద్వారా టికెట్ల కోసం పడే కష్టాలను తగ్గించేందుకు టీటీడీ ముందడుగు వేసింది. ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిలబడే భక్తులకు ఇది నిజంగా ఉపశమనం. టీటీడీ చైర్మన్ నాయుడు మాట్లాడుతూ.. భక్తులు చాలా కాలంగా టికెట్ల కోసం గంటల కొద్దీ వేచిచూస్తున్నారు. ఇకపై ఈ కొత్త కౌంటర్లతో ఆ సమస్య తగ్గుతుంది. ఇకపై మరింత వేగంగా టికెట్లు జారీ చేస్తామని తెలిపారు.
☀ SRIVANI ట్రస్ట్.. సేవతో దర్శనం
SRIVANI (Sri Venkateswara Alaya Nirmana Trust) ట్రస్ట్ ద్వారా భక్తులు ఆలయ నిర్మాణాలకు విరాళాలు ఇచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఈ విరాళానికి ప్రతిఫలంగా ప్రత్యేక దర్శన టికెట్లను పొందవచ్చు. అయితే ఈ టికెట్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో టికెట్ పొందడం కష్టతరమవుతోంది. ఈ కష్టాలను తగ్గించడానికే కొత్త టికెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
☀ ఎంక్వైరీ కార్యాలయాల అప్‌గ్రేడ్.. మరింత సమాచారం, మరింత సాయం
ఈ కార్యక్రమంలో భాగంగా హై లెవల్ కాటేజీలు (HVC), అన్నప్రసాదం కాంప్లెక్స్ (ANC) ప్రాంతాల్లోని సబ్-ఇంక్వైరీ కేంద్రాలను కూడా ఆధునికంగా మార్చారు. భక్తులకు అవసరమైన సమాచారం మరింత వేగంగా అందేలా ఈ కేంద్రాలు మోడర్న్ టెక్నాలజీతో పనిచేయనున్నాయి. టీటీడీ అధికారులు స్వయంగా ఈ కేంద్రాలను తనిఖీ చేసి, భక్తుల అవసరాలకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు.
Also Read: Train cancellation list: ప్రయాణికులకు బిగ్ షాక్.. 26 రైళ్లు రద్దు.. మీ ట్రైన్ ఉందేమో చెక్ చేసుకోండి!
☀ అసలెందుకు ఈ చర్య?
తిరుమలలో రోజూ లక్షలాది మంది భక్తులు సందర్శించే సమయంలో, టికెట్ల కోసం పడే తిప్పలు ఒక్కసారి గుర్తిస్తే టీటీడీ ఈ చర్య ఎంత అవసరమో తెలుస్తుంది. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త కేంద్రం, భక్తుల కోసం సేవల పరంగా మరో మెట్టు ఎక్కింది. ఇక భక్తులు గడగడలాడే క్యూలైన్లలో ఉండాల్సిన అవసరం లేకుండా వేగంగా, సౌలభ్యంగా దర్శనం కలిసేలా టీటీడీ చర్యలు చేపట్టింది.
తిరుమల యాత్ర భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదే. అలాంటి యాత్రలో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులకే పరిష్కారం దొరికితే ఆ అనుభవం మరింత మధురమవుతుంది. ఇప్పుడు ప్రారంభమైన SRIVANI దర్శన టికెట్ కేంద్రం కూడా అలాంటి ఒక్క అవకాశం. తిరుమలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ముందే ప్లాన్ చేసుకుని, ఈ కొత్త టికెట్ కేంద్రం ద్వారా టికెట్టు పొందండి.. అలా వెళ్లి ఇలా శ్రీవారి దర్శనం చేసుకోండి!