Tirumala temple miracles: తిరుమల శ్రీవారి ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎందుకో మనం కోరుకున్న కోరికలన్నీ మరిచిపోతాం. ఊహించని అనుభూతి మనల్ని చుట్టుముడుతుంది. అంతటి కోరికలతో వెళ్లిన మనం, స్వామి వారి ఎదుట నిల్చుంటే ఏమీ గుర్తుండదు.. ఏదో కొత్త లోకంలోకి వచ్చిన భావన కలుగుతుంది. ఈ అద్భుత అనుభూతికి కారణమేంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
తిరుమల శ్రీవారి ఆలయం భక్తుల భయాన్ని పోగొట్టి, వారి కోర్కెలను తీర్చే దివ్య స్థలం మాత్రమే కాదు.. అది మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ఏకాగ్రతను ప్రసాదించే గొప్ప పవిత్ర ఆశ్రయం. ఎంతో మంది భక్తులు సంవత్సరాల తరబడి చేయాల్సిన మొక్కులు, కోరికలు తీసుకెళ్లి స్వామివారి సన్నిధిలో ఉంచుతారు. కానీ అక్కడి వరకూ వెళ్లి, బంగారు వాకిలిలోకి అడుగు పెట్టగానే.. క్యూలో పడిన కష్టాలు, ప్రయాణంలోని తొందరలు, మన కోరికల జాబితాను మనమే మరచిపోతాయి. ఎందుకిలా జరుగుతోంది?
ఈ ప్రశ్నకు వివరణగా శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవీ రమణ దీక్షితులు చెబుతున్న విషయం ఆధ్యాత్మికంగా, శాస్త్రపరంగా ఎంతో అర్థవంతంగా ఉందని చెప్పవచ్చు. ఆలయంలోకి ప్రవేశించిన సమయం నుంచి, స్వామి వారి దర్శనం అయ్యే వరకు భక్తులు ఒక ప్రత్యేక శక్తివలయంలోకి ప్రవేశిస్తారని పండితుల మాట. ఆలయంలో ముఖ్యమైన మంత్ర పఠనాలతో, సంప్రోక్షణ శుద్ధులతో అక్కడ సకల దేవతామూర్తులూ శక్తివంతంగా కొలువై ఉంటారని, వారి దివ్య శక్తులు ఆలయ ప్రాంగణంలో నిత్యం ప్రవహిస్తాయని వేదగ్రంథాలు చెబుతున్నాయని వారు వివరించారు.
రమణ దీక్షితుల చెప్పిన వివరాల మేరకు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ప్రవేశించి, బంగారు వాకిలి దాటి గంటా మండపం వరకు వచ్చే వరకూ భక్తులు ఆ దివ్య శక్తి వలయంలో అడుగులు వేస్తారన్నారు. అదే కారణంగా వారి మనసు ఏకాగ్రత పొందుతుందని, అహంకారం, కోర్కెలు, భావోద్వేగాలు అన్నీ తగ్గిపోతాయని ఆయన చెబుతున్నారు. ఈ అనుభూతే తదేక భావన అంటే పరమాత్మలో మనస్సు ఏకీభవించడమే.
ఇక శ్రీవారి దర్శనం సమయంలో మనం కనులార చూసే ఆ దివ్య స్వరూపం.. ధృవబేరం మన మనసును పూర్తిగా ఆకర్షిస్తుందని భక్తులు చెబుతుంటారు. ఆ క్షణం భగవంతుడితో మానవుడి మధ్య ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంలో మన కోరికలన్నీ వెనుకపడతాయి. ఆ క్షణం మిగిలేది కేవలం భక్తి, కృతజ్ఞత, ఆనందం మాత్రమే.
ఇదే కాక, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తించిన ఆ దేవదేవుని మహిమలు కూడా మన హృదయాన్ని తాకుతాయి. ‘పన్నగశయనుడిని చూడగనే పాపాలన్నీ పారిపోతాయని అంటూ అన్నమయ్య కీర్తనల్లో స్వామి వారి దర్శన ఫలితాన్ని వర్ణించారు. అదే అనుభూతిని ప్రతి భక్తుడు అనుభవిస్తుంటారు.
తిరుమల యాత్రలో భాగంగా పుష్కరిణి స్నానం, వరాహ స్వామి దర్శనం తర్వాత భక్తులు స్వామి వారి దర్శనానికి వెళ్తారు. బంగారు వాకిలిని దాటి గంటా మండపంలోకి అడుగుపెడుతారో లేదో, ఆ శాంతత, ఆ ప్రభావం మనసును పట్టు వేస్తుంది. కోరుకోవాలనిపించి వచ్చాం కానీ.. ఇప్పుడు కోరుకోవాలన్న నైతిక బలం కూడా లేకుండా పోయిందనే స్థితికి వస్తారు భక్తులు.
ఇది ఒక్కరిదీ కాదు. తిరుమలకు వచ్చే భక్తులలో సుమారుగా 99 శాతం మందికి ఇలానే అనిపిస్తుందని చెబుతున్నారు అర్చకులు. ఇది ఆ స్థల మహత్యం.. స్వామివారి ఆరాధ్య స్వరూపం, ఆలయ ఆధ్యాత్మిక శక్తులు కలిపి కలిగించే అద్భుత అనుభవం.
శ్రీవారి సన్నిధిలో జరిగిన ప్రతి క్షణం, మనసులో నిలిచిపోతుంది. కానీ కోరికలు మాత్రం మరిచిపోతాయి. ఎందుకంటే, ఆ క్షణంలో మన హృదయం కోరికలను పక్కన పెట్టి, ఆ పరమాత్మను మాత్రమే ఆలింగనం చేస్తుంది. అదే నిజమైన భక్తి, అదే దైవ సన్నిధిలో మన ఆత్మ ఆనందమైన నిర్వాణ స్థితిగా ఉంటుందని వేద పండితుల మాట.