TTD warning: తిరుమల వెళ్లాలంటే డ్రెస్ కోడ్ పాటించాలి, మొబైల్ మ్యూట్ లో పెట్టాలి అనేవి చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు మరో ముఖ్యమైన నియమాన్ని తిరుమల దేవస్థానం జారీ చేసింది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కనిపిస్తున్నాయి, వాటిని చూస్తే ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయన్నది భక్తుల వాదన. టీటీడీ సైతం ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. అసలు ఏం జరిగింది? భక్తులుగా మనం ఎలా ప్రవర్తించాలనేది తప్పక తెలుసుకుందాం. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా నడుచుకుందాం. అందుకు ఈ కథనం పూర్తిగా చదవండి.
తిరుమల పవిత్రతకు భంగం.. ఎక్కడినుంచి మొదలైంది?
ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ వ్లాగర్లు, షార్ట్ వీడియో కంటెంట్ క్రియేటర్లు తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో మొబైల్ కెమెరాలతో వీడియోలు తీస్తున్నారు. కొంతమంది వెకిలి చేష్టలు చేస్తున్నారు, డాన్సులు చేస్తున్న వీడియోలు, కామెడీ తరహాలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీటీడీ సీరియస్ గా తీసుకుంది.
అంతే కాదు.. కొందరు ఆలయ ప్రధాన గోపురం ముందు నిలబడి కామెడీ స్కిట్లు చేస్తూ రికార్డింగ్ చేస్తున్నారు. భక్తుల రద్దీ మధ్యలో వీరి వీడియో తీయడాన్ని చూసి, ఇతర భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని టీటీడీ గుర్తించి, అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది.
టీటీడీ హెచ్చరికలు.. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు!
తిరుమల శ్రీవారి ఆలయం ముందు , మాడ వీధుల్లో ఇటీవల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర, అసభ్యకర చర్యలు అనుచితంగా పేర్కొంది.
Also Read: Indian Railways alert: ప్రయాణికులకు అలర్ట్.. రైల్వే రద్దు చేసిన రైళ్ల పూర్తి లిస్ట్ ఇదే!
భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని, తిరుమల క్షేత్రం భక్తి, ఆరాధనలకు నిలయమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరింది టీటీడీ. తిరుమలలో కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి. శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని టీటీడీ ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే కొందరు వీడియోలపై విచారణ మొదలయ్యింది. ఆధారాలు లభించిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్లు. భక్తుల పుణ్యభూమిని ఈ తరహాలో చూపించరదని టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది.
భక్తులు పాటించాల్సిన ప్రాథమిక నిబంధనలు
భక్తులంతా దేవస్థానానికి వచ్చే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా తిరుమలలో.. మొబైల్ ఫోన్ ఉపయోగాన్ని మితంగా వాడాలి. ఆలయ ప్రధాన ప్రాంగణంలో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం పూర్తిగా నిషిద్ధం. భక్తి భావంతో కూడిన దుస్తులు ధరించాలి. గౌరవంగా ప్రవర్తించాలి. హాస్యం, వినోదం, డ్రామా వంటివి వీడియోలు చిత్రీకరించకుండా ఉండాలి. ఇతర భక్తులకు అంతరాయం కలిగించకూడదు. స్వామివారిని దర్శించుకునే సమయంలో శ్రద్ధగా, శాంతంగా ఉండాలి. తిరుమల పవిత్రతను మనమే కాపాడాలి.
తిరుమల శ్రీవారి ఆలయం ప్రపంచవ్యాప్తంగా భక్తుల హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ ఆలయ విశిష్టత దాని సంప్రదాయాలు, నిబంధనలు, భక్తుల నిబద్ధత వల్లే నిలబడుతోంది. అలాంటి స్థలాన్ని కేవలం సోషల్ మీడియా ఫేమ్ కోసం అపవిత్రం చేయడం బాధాకరంగా టీటీడీ ప్రకటన జారీ చేసింది.
భక్తి అనేది చప్పట్లతో కాదు.. మౌనంగా వేరొక లోకంలోకి మనల్ని తీసుకెళ్లే అనుభూతి. శ్రీవారి దర్శనం కూడా అంతే. శబ్దాలు, ఫ్లాష్ లైట్లు, డైలాగ్లు అక్కర్లేదు అక్కడ. స్వామిని చూసి భక్తితత్వంతో మనం గోవిందా అంటూ పఠించినా అదే పుణ్యం. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ భక్తితో, మర్యాదతో ఉండాలి. వీడియోలు, రీల్స్ తీసే ప్రయత్నం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.. భక్తిగా ఉండండి, తిరుమల గౌరవాన్ని కాపాడండి.