Kovvur Train Derailment: కొవ్వూరు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ-విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి. ఒడిశా నుంచి విజయవాడ వైపు ఎరువుల లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 8 బోగీలు కొవ్వూరు స్టేషన్ సమీపంలోని నాలుగో లైన్‌పై ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్‌తో పాటు సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం..
ప్రమాదం జరిగిన సమయంలో కొవ్వూరు స్టేషన్‌కు చేరుకున్న విశాఖపట్నం–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రెండో ప్లాట్‌ఫామ్‌పైనే నిలిపివేశారు. భద్రతా కారణ దృష్ట్యా విజయవాడ వైపు వెళ్లాల్సిన పలు రైళ్లను నర్సీపట్నం, తుని, అన్నవరం, రాజమండ్రి, నిడదవోలు తదితర స్టేషన్లలో నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ప్రస్తుతం పండుగలు, వరుస సెలవుల కాలం కావడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగి, వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పలు రైళ్లు రద్దు, మరికొన్ని రీషెడ్యూల్
ఈ ప్రమాద ప్రభావంతో విశాఖ–విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12717) ను అధికారులు ఈరోజు రద్దు చేశారు. అలాగే తిరుగు ప్రయాణంలో విజయవాడ–విశాఖ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718) ను రేపు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు విశాఖ వందేభారత్ (20708), ఉదయ్ ఎక్స్‌ప్రెస్ (22876) సహా మొత్తం 9 రైళ్ల వేళలను రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
శరవేగంగా పునరుద్ధరణ పనులు
ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ప్రత్యేక క్రేన్లు, భారీ యంత్రాల సహాయంతో పట్టాలు తప్పిన బోగీలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దెబ్బతిన్న ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థను వీలైనంత త్వరగా బాగు చేసి మార్గాన్ని పునరుద్ధరించేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139 లేదా NTES యాప్ ద్వారా తాజా సమాచారాన్ని సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: తెగిపడిన పోతిరెడ్డిపాడు గేట్.. జలపోరు మళ్లీ షురూ!