Vande Bharat train speed: దేశం మొత్తం ప్రయాణానికి సంబంధించి వేగాన్ని కోరుకుంటోంది. ఆ వేగాన్ని అందించే కొత్త రైల్వే విప్లవం పేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్. 2019లో ప్రారంభమైన ఈ రైళ్లు ఇప్పుడు 140 సర్వీసులతో దేశ వ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. కంఫర్ట్, వేగం, సమయపాలన.. ఇవన్నీ కలిపి వందే భారత్‌ను ఒక ప్రత్యేకమైన అనుభవంగా మలిచాయి. కానీ, ఈ స్పీడ్ రైళ్ల అసలు కథను, వాటి వెనుక ఉన్న ట్రాక్‌ల సామర్థ్యాన్ని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ లెక్కలు తెలిస్తే ఔరా అనేస్తారు.
గత కొన్నేళ్లలో వందే భారత్ రైళ్ల సగటు వేగం తగ్గిందనే వార్త రైల్వే చర్చల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ ఫౌజియా ఖాన్ ఈ విషయం గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను నేరుగా ప్రశ్నించారు. 2020-21లో ఈ రైళ్ల సగటు వేగం 84.48 కిమీ/గంట, కానీ 2023-24లో అది 76.25 కిమీ/గంటకు పడిపోయింది. ఎందుకు ఇలా? అంటూ ఎంపీ ప్రశ్నించగా, మంత్రి వైష్ణవ్ చెబుతున్న సమాధానం నిజంగా ఆసక్తికరం. అసలు మంత్రి ఏం చెప్పారంటే..
మంత్రి చేసిన ప్రకటన మేరకు.. వందే భారత్ రైళ్ల డిజైన్ స్పీడ్ 180 కిమీ/గంట, ఆపరేటింగ్ స్పీడ్ 160 కిమీ/గంట ఉన్నా, ట్రాక్‌ల పరిస్థితి, మధ్యలో ఉండే స్టాపులు, సెక్షన్‌లలో జరుగుతున్న మెయింటెనెన్స్ పనులు ఈ వేగాన్ని తగ్గిస్తున్నాయి. అయితే ప్రభుత్వం రైళ్ల స్పీడ్ పెంచేందుకు తగిన చర్యలు తీసుకుందని తెలిపారు. గత 10 ఏళ్లలో ట్రాక్‌ల అప్‌గ్రేడేషన్ కోసం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. వెడల్పైన కాంక్రీట్ స్లీపర్లు, హెచ్ బీమ్ స్లీపర్లు, లాంగ్ రైల్ ప్యానెల్స్, ఆధునిక ట్రాక్ మెయింటెనెన్స్ యంత్రాలు.. ఇవన్నీ వేగాన్ని పెంచేందుకు వినియోగిస్తున్నారు. ఈ మార్పుల ఫలితమే ట్రాక్ స్పీడ్ సామర్థ్యంలో పెరుగుదలగా మంత్రి చెప్పారు.
2014లో భారత రైల్వే ట్రాక్‌లలో ఎక్కువ భాగం 110 కిమీ/గంట కంటే తక్కువ వేగానికి మాత్రమే అనుకూలంగా ఉండేది. మొత్తం 79,342 కిలోమీటర్ల ట్రాక్‌లలో 47,897 కిలోమీటర్లు (60.4%) ఈ తక్కువ వేగం కేటగిరీలో ఉండేవి. కానీ 2025 నాటికి ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 22,862 కిలోమీటర్లు (21.6%) మాత్రమే మిగిలింది.
దీని బదులుగా, 110-130 కిమీ/గంట వేగం అందించే ట్రాక్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి.
2014లో వీటి పొడవు 26,409 కిమీ (33.3%) ఉండగా, 2025లో అవి 59,800 కిమీ (56.6%)కు చేరుకున్నాయి. అలాగే, అత్యంత వేగం (130 కిమీ/గంట పైగా) అందించే ట్రాక్‌లు కూడా 5,036 కిమీ (6.3%) నుంచి 23,010 కిమీ (21.8%)కు పెరిగాయి. మొత్తం రైల్వే ట్రాక్ పొడవు 2014లో 79,342 కిమీ ఉండగా, 2025 నాటికి అది 1,05,672 కిమీ ఉందని లెక్క. దీనిని బట్టి ఇండియన్ రైల్వేలో ట్రాక్ ల నిర్మాణం ఓ వండర్ గా చెప్పవచ్చు.
వందే భారత్ రైళ్ల సగటు వేగం ఇప్పుడు తగ్గినా, భవిష్యత్తులో దానిని 160 కిమీ/గంటకు దగ్గరగా పెంచేందుకు ట్రాక్‌ల అప్‌గ్రేడేషన్ ప్రధాన ఆయుధంగా మారబోతోంది. ఉదాహరణకు, ఢిల్లీ – వారణాసి వంటి ప్రధాన మార్గాల్లో ప్రయాణ సమయం 30 నుండి 40 శాతం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా కేవలం వేగం గురించి కాదు. ప్రయాణికులు పొందే అనుభవం కూడా అసాధారణం. ఎర్గోనామిక్ సీట్లు, ఆన్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆధునిక ఫుడ్ సర్వీస్.. ఇవన్నీ వందే భారత్‌ను ఒక లగ్జరీ అనుభవంగా మార్చాయి. పండుగ సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు, అదనపు సర్వీసులు కూడా రాబోతున్నాయి.
ఈ కథలో అసలు హీరో ఎవరో తెలుసా? ట్రాక్‌నే హీరో. వేగం పెంచే మార్గం, సౌకర్యం ఇచ్చే మార్గం అదే. వందే భారత్ రైళ్లు వేగం పెరగాలంటే ట్రాక్ అప్‌గ్రేడేషన్ తప్పనిసరి.
ఇంకొన్ని సంవత్సరాల్లో రైల్వే మార్పు గమ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాక్‌లు వేగవంతమవుతున్నాయి, రైళ్లు పరిగెడుతున్నాయి, దేశం మారుతోంది. వందే భారత్ ఈ కొత్త దిశలో ముందువరుసలో నిలబడి, కాలానికి స్పీడ్ తో సమాధానం చెప్పే రోజులు రానున్నాయి.