Indian Railways: భారతీయ రైల్వేలో రోజు రోజుకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సేవలను విస్తరిస్తున్నది. ప్రయాణీకుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో కొత్త రైళ్లను పరిచయం చేస్తున్నది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 130కి పైగా వందేభారత్ రైళ్లు తమ సర్వీసులను కొనసాగిస్తున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కబోతున్నాయి. ఇప్పటికే ఈ రైలు సంబంధించి ట్రయల్ రన్స్ కొనసాగుతున్నాయి. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వీడియోను ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వీలైనంత త్వరగా ఈ రైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేసంస్థ ప్రయత్నిస్తున్నది.
డిమాండ్ ఉన్న రూట్లలో సీటింగ్ కెపాసిటీ పెంపు
ఓవైపు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తూనే, మరోవైపు ప్రయాణీకుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లో సీటింగ్ కెపాసిటీ పెంచుతున్నారు రైల్వే అధికారులు. తాజాగా సదరన్ రైల్వే కూడా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలో సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. తమ పరిధిలో నడుస్తున్న రెండు రైళ్లకు సంబంధించిన సీట్లను పెంచనున్నట్లు తెలిపారు. రైల్వే బోర్డు ఆదేశాలను అనుగుణంగా జనవరి రెండో వారం నుంచి సీటింగ్ కెపాసిటీ పెంపు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సీటింగ్ కెపాసిటీ పెంచే వందే భారత్ రైళ్లు ఇవే!
సదరన్ రైల్వే రెండు వందేభారత్ రైళ్లలో సీట్ల సంఖ్య పెంచాలని భావిస్తున్నది. వాటిలో ఒకటి తిరువనంతపురం సెట్రల్-కాసరగోడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కాగా, మరొకటి తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్. తిరువనంతపురం సెంట్రల్- కాసరగోడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్(20634/20633) జనవరి 10 నుంచి 20 కార్ల కాన్ఫిగరేషన్ తో అందుబాటులోకి రానుంది. వీటిలో 3+2 సీటింగ్ లే అవుట్ తో కూడిన 18 చైర్ కార్లు ఉంటాయి. మరో రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు ఉండనున్నాయి. వీటిలో 2+2 లే అవుట్ తో పాటు అదనపు లెగ్ రూమ్ ఉంటుంది. ప్రస్తుతం ఈ రైలు 16 కోచ్ లతో నడుస్తున్నది. ఈ రూట్ లో ప్రయాణీకుల నుంచి మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో మరో నాలుగు కోచ్ లను పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Read Also: సంక్రాంతికి వెళ్తున్నారా? మీ కోసం మరో గుడ్ న్యూస్!
అటు తిరునెల్వేలి- చెన్నై ఎగ్మోర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్(20666/20665) జనవరి 11 నుండి 16 కార్ల కాన్ఫిగరేషన్ తో అందుబాటులోకి రానుంది. ఈ రైలులో విలాసవంతమైన సీటింగ్ తో కూడిన రెండు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ రైలు 8 కోచ్ లతో నడుస్తున్నది. ప్రయాణీకుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ సంఖ్యను డబుల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్ ఉన్న రూట్లలో గత కొద్ది రోజులుగా రైల్వే అధికారులు వందేభారత్ రైళ్లలో కోచ్ ల సంఖ్య పెంచుతున్నారు.
Read Also: 2025లో ఎంట్రీ ఇవ్వబోతున్న హైస్పీడ్ లగ్జరీ రైళ్లు ఇవే.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!