Ajith : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) సినిమాల కంటే ఎక్కువగా తనకు ఇష్టమైన కార్ రేసింగ్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే రిస్క్ ఎక్కువగా ఉండే స్పోర్ట్స్ లో కార్ రేసింగ్ కూడా ఒకటి. అయినప్పటికీ అజిత్ దీన్ని తన కొత్త కెరీర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. తాజాగా ఆయన ఈ కార్ రేసింగ్ లో మరోసారి ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది.
మరోసారి కార్ రేసింగ్ లో ప్రమాదం
అజిత్ (Ajith Kumar) కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాదు… కార్ రేస్, రైఫిల్ షూటింగ్ వంటి క్రీడల్లోనూ తన ప్రతిభను నిరూపించుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే అజిత్ దుబాయ్ లో జరిగిన అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొని, టాప్ 3లో ఒకరిగా నిలిచి, గెలిచివడంతో ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. అజిత్ గెలుపుపై పలువురు స్టార్స్ కూడా స్పందించారు. అయితే అంతకు ముందు దుబాయ్ లో కార్ రేసింగ్ ట్రైనింగ్ లో పాల్గొని, అజిత్ ప్రమాదం బారిన పడ్డారు. అప్పట్లో ఆయనకి ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు.
తాజాగా మరోసారి అజిత్ (Ajith Kumar) కార్ రేస్ శిక్షణలో ఘోర ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తోంది. ఈసారి కూడా అదృష్టవశాత్తూ ఆయన గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు అనే వార్తతో అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అజిత్ ఇప్పుడు పోర్చుగల్ లో జరగనున్న కార్ రేస్ పోటీలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన అక్కడ కార్ రేస్ శిక్షణలో పాల్గొంటుండగా, అజిత్ నడుపుతున్న కారు అదుపుతప్పి యాక్సిడెంట్ కు గురైందని తెలుస్తోంది. కానీ అజిత్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ అజిత్ తనకు ఇష్టమైన ఈ కార్ రేస్ స్పోర్ట్స్ నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. దీంతో అజిత్ అభిమానులు ఆయన ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక దెబ్బతిన్న కారును సరిచేయడంలో తన బృందం చేసిన అవిశ్రాంత కృషికి అజిత్ కృతజ్ఞతలు తెలిపారు.
ఒకవైపు కార్ రేసింగ్, మరో వైపు సినిమాలు
అజిత్ (Ajith Kumar) లేకుండానే ఆయన హీరోగా నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా ‘విదామూయార్చి’ (Vidaamuyarchi) అనే మూవీతో అజిత్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 6న ఈ మూవీ తెలుగులో ‘పట్టుదల’ (Pattudala) పేరుతో రిలీజ్ అయింది. అయితే తెలుగులో ఈ మూవీకి పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం అజిత్ స్టార్ పవర్ కారణంగా ఈ మూవీ మంచి కలెక్షన్లే రాబట్టింది. త్వరలోనే అజిత్ హీరోగా నటించిన మరో కొత్త చిత్రం ‘గుడ్ బాడ్ అగ్లీ’ (Good Bad Ugly) రిలీజ్ కాబోతోంది. 2025 ఏప్రిల్ 10 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే అజిత్ డబ్బింగ్ సైతం పూర్తి చేశారు. ఇక ఆయన కొత్త మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది.