Vande Bharat Trial in Western Ghats: దేశంలో మరో అందమైన మార్గంలో వందేభారత్ పరుగులు తీయబోతోంది. బెంగళూరు నుంచి మంగళూరుకు ప్రతిపాదించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు సంబంధించిన కీలకమైన ట్రయల్ రన్ ఆగస్టు 11 నుంచి ప్రారంభం కానుంది. పశ్చిమ కనుమల్లోని సకలేష్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ మార్గంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మార్గం సొరంగాలు, వంతెనలు, కొండలు, లోయలతో పాటు అందమైన ప్రకృతి దృశ్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది.
బెంగళూరు-మంగళూరు మధ్య వందే భారత్ రైలును నడపాలనే ప్రతిపాదన కొంతకాలంగా చర్చలో ఉంది. అయితే, ఈ మార్గంలోని సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితుల కారణంగా రైలును నడపడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా సకలేష్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్ మధ్య ఉన్న ఘాట్ సెక్షన్ లో రైలు నిర్వహణ, స్పీడ్ కంట్రోల్, బ్రేకింగ్ వంటి అంశాలు చాలా కీలకం. ఈ కారణంగానే ట్రయల్ రన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. సౌత్ వెస్టర్న్ రైల్వే అధికారులు ఈ పరీక్షల కోసం కొన్ని మార్పులు చేసిన ఎనిమిది కోచ్‌ల వందే భారత్ రైలును ఉపయోగించనున్నారు. ఇందులో ఆటో ఎమర్జెన్సీ బ్రేక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. రైలు దిగువ వైపు ప్రయాణిస్తున్న సమయంలో పరిమిత వేగాన్ని మించితే, ఈ వ్యవస్థ అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గా బ్రేకులు వేయడానికి సహాయపడుతుంది.
ట్రయల్ సమయంలో రైల్వే అధికారులు పలు అంశాలను పరిశీలించనున్నారు. రైలు బ్రేకులు ఎంత సమర్థంగా పని చేస్తున్నాయి? ఘాట్ రూట్ లో సిబ్బంది మెయింటెనెన్స్ ఎలా ఉంది? రైలు తిరిగి ప్రయాణానికి సిద్ధం కావడానికి ఎంత సమయం పడుతోంది? మొత్తం రైలు నియంత్రణ ఎలా ఉంది? అనే విషయాలను పరిశీలించనున్నారు. ఈ పరీక్షల ఆధారంగా అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నారు.
సకలేష్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్ మధ్య సుమారు 55 కిలోమీటర్ల మేర ఉన్న మార్గం దేశంలోని కష్టతరమైన రైల్వే సెక్షన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ మార్గంలో దాదాపు 57 సొరంగాలు, 250కి పైగా వంతెనలు, పలు మలుపులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిటారుగా ఉండే వాలులు కూడా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో కొండచరియలు విరిగిపడటం, రాళ్లు రైల్వే ట్రాక్‌పైకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ మార్గంలో రైలును సురక్షితంగా నడపడానికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
ఇదిలా ఉంటే, సకలేష్‌పూర్-సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్ విద్యుదీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దాదాపు రూ.93.5 కోట్ల వ్యయంతో సుమారు రెండేళ్లలో ఈ పనులను పూర్తి చేసినట్లు సమాచారం. విద్యుదీకరణ పూర్తవడంతో ఎలక్ట్రిక్ రైళ్లను ఈ మార్గంలో నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
బెంగళూరు-మంగళూరు వందే భారత్ సేవ ప్రారంభమైతే ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణంతో పాటు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశం కూడా లభించనుంది. పశ్చిమ కనుమల మీదుగా వెళ్లే ఈ మార్గంలో పచ్చని కొండలు, దట్టమైన అడవులు, లోయలు, వర్షాకాలంలో కనిపించే జలపాతాలు, పొగమంచుతో కప్పబడిన ప్రాంతాలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. అయితే ఆగస్టు 11న జరిగే ట్రయల్ రన్‌తోనే వందే భారత్ సర్వీస్ వెంటనే ప్రారంభమవుతుందని చెప్పలేం. ట్రయల్‌లో వచ్చిన ఫలితాలను రైల్వే అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భద్రత, బ్రేకింగ్ వ్యవస్థ, ఘాట్ మార్గంలో రైలు నియంత్రణ వంటి అంశాలపై పూర్తి స్థాయిలో సంతృప్తి వచ్చిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Read Also: సప్త జ్యోతిర్లింగ దర్శనానికి రైల్వే ప్రత్యేక యాత్ర..11 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాల దర్శనం!