Earbuds vs wired earphones: మొబైల్ ఫోన్ చేతిలో .. ఉందంటే చాలు, చాలా మంది చెవులకు ఇయర్ బడ్స్ లేదా ఇయర్ ఫోన్స్ తగిలించేసుకుంటున్నారు. పాటలు వినడం, కాల్స్ మాట్లాడడం, రీల్స్ చూడడం డైలీ లైఫ్ స్టైల్‌లో భాగం అయిపోయింది. అయితే సౌకర్యంగా ఉంటుందని రోజంతా వీటిని చెవుల్లోనే.. పెట్టుకోవడం వల్ల వినికిడి శక్తిపై తీవ్రమైన ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ సేఫా? లేక సాధారణ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ మంచివా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. వీటికి పంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఎక్కడ చూసినా బ్లూటూత్ ఇయర్‌బడ్స్ ట్రెండ్ నడుస్తోంది. వైర్స్ బెడద ఉండదు.. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. కానీ వీటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇయర్ బడ్స్‌ని నేరుగా చెవి రంధ్రంలో బిగించి పెడతాం. దీని వల్ల చెవిలోని గాలి ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. చెవిలో చెమట పట్టి బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి ఇది అనుకూల వాతావరణం కల్పిస్తుంది. దీని వల్ల చెవి లో దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అంతే కాకుండా.. బ్లూటూత్ రేడియేషన్ ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒకప్పుడు విరివిగా వాడిన వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇప్పటీకీ చాలా వరకు సురక్షితమైనవిగా పరిగణించవచ్చు. ఇవి చెవి లోపలికి గట్టిగా చోటు చేసుకునేలా ఉండవు. రేడియేషన్ భయం అసలు ఉండదు. అయితే వైర్లు చిక్కుకుపోవడం, వాటిని తీసుకెళ్లడం కాస్త అసౌకర్యంగా అనిపించొచ్చు. కానీ చెవి ఆరోగ్యానికి మాత్రం వైర్డ్ ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ ఇయర్ బడ్స్ కంటే చాలా మెరుగైనవి.
Also Read: ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్
సమయం ముఖ్యం: మీరు ఏ రకమైన ఇయర్ ఫోన్స్ వాడినా సరే, రోజులో గంటల తరబడి నిరంతరం వాడ కూడదు. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల చెవి లోని సున్నితమైన భాగాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
వాల్యూమ్ పరిమితి: సౌండ్ వాల్యూమ్ ఎప్పుడూ 60 శాతానికి మించకుండా చూసుకోవాలి. హై వాల్యూమ్‌లో వినడం వల్ల చెవిలోని నరాలు శాశ్వతంగా దెబ్బతిని చెవుడు వచ్చే ప్రమాదం ఉంది.
వ్యక్తిగత పరిశుభ్రత: చాలా మంది ఇయర్ బడ్స్‌ని ఇతరులకు ఇస్తారు. అలా చేయడం ద్వారా ఒకరి చెవిలోని ఇన్ఫెక్షన్ మరొకరికి ఈజీగా సోకుతుంది.వీటిని ఎప్పటి కప్పుడు ఆల్కహాల్ స్వాబ్స్‌తో శుభ్రం చేసుకోవాలి.
ట్రెండ్‌ని ఫాలో అవ్వడంలో తప్పు లేదు.. కానీ దాని కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరి కాదు. వీలైనంత వరకు ఇయర్ బడ్స్ వాడకాన్ని తగ్గించండి. ప్రయాణాల్లో లేదా అత్యవసర సమయా ల్లో మాత్రమే తక్కువగా వాడండి. సాధ్యమైనంత వరకు స్పీకర్ ఆన్ చేసి వినడం లేదా వైర్డ్ ఇయర్ ఫోన్స్‌ని.. ఉపయోగించడం మీ చెవుల ఆరోగ్యానికి ఎంతో మంచిది!