రైళ్లలో తరచుగా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ ప్రయాణీకులకు చిక్క పలువురు దొంగలు వీపు విమానం మోత మోగించుకున్న సందర్భాలున్నాయి. తాజాగా కదులుతున్న రైల్లో ఓ ప్రయాణీకుడి నుంచి సెల్ ఫోన్ దొంగిలిస్తూ ఓ దొంగ ప్రయాణీకులకు చిక్కాడు. ప్రయాణీకులంతా కలిసి అతడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక, కాసేపు డోర్ దగ్గర వేలాడుతూ ప్రయాణించాడు. రైలు కాస్త స్లో కావడంతో పొదల్లోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు సదరు దొంగ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఏం ఉందంటే?
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే, ఓ వ్యక్తి రైలు లోపల ప్రయాణీకులలో ఓ మోబైల్ కొట్టేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. ప్రయాణీకులు అతడిని పట్టుకుని విపరీతంగా కొట్టినట్లు తెలుస్తుంది. అతడి నోటి నుంచి రక్తం వస్తున్నట్లు కనిపిస్తున్నది. దెబ్బల నుంచి తప్పించుకునేందుకు సదరు వ్యక్తి రైలు డోర్ దగ్గర వేలాడుతూ ప్రయాణించాడు. అయినప్పటికీ, లోపలి నుంచి బెల్ట్ తీసుకుని అతడిని కొడుతూనే ఉన్నారు. ఆ దెబ్బలను తట్టుకుంటూ, అలాగే వేలాడుతూ వెళ్లాడు. కొద్ది కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత రైలు వేగం తగ్గినప్పుడు పొదల్లోకి దూకి ప్రాణాలను కాపడుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అతడు ఎలా ఉన్నాడు అనే విషయం ఎవరికీ తెలియదు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ఈ తతంగాన్ని అంతా రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో కాసేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. సదరు వ్యక్తి దొంగతనం చేసినప్పటికీ, అమానుషంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ పడిపోయిన తర్వాత గాయాలతో బయటపడ్డాడా? చనిపోయాడా? అని ఆరా తీస్తున్నారు. ప్రయాణీకులు దొంగను కొట్టిన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. “అతడు దొంగతన చేయడానికి గత కారణాలను తెలుసుకుని ఉంటే ఇలా వ్యవహరించే వారు కాదేమో?” అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. “అతడు తప్పు చేసి ఉండవచ్చు. కానీ, రైలుకు వేళాడుతూ ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటున్న వ్యక్తి పట్ల అంత దారుణంగా వ్యవహరించం తప్పు” అని మరికొంత మంది అంటున్నారు. “మనుషులు ఎంత క్రూరంగా ఉంటారో ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది. అతడు దొంగతనం చేస్తే పట్టుకుని పోలీసులకు అప్పగించాలి. కానీ, మానవత్వం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటు” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “దొంగతనం చేసినందుకు అతడికి శిక్ష పడాలి. కానీ, ప్రయాణీకులు అతడి పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉంది” అని మరికొంత మంది అభిప్రాయపడ్డారు. అటు ఈ ఘటనపై రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దొంగ ఎలా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
चोरी करना ग़लत है…और उसकी सज़ा भी तय है।
लेकिन ट्रेन में पकड़े गए एक चोर को, जब वो डरकर भागा और दरवाज़े के बाहर लटक गया, तब उसे बचाने की जगह लोग अंदर से पीटते रहे… जैसे उसकी मौत का इंतज़ार कर रहे हों।😡 pic.twitter.com/xvUymFCnoT— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) July 25, 2025
Read Also: నీటితో నడిచే రైలు.. ప్రయోగం సక్సెస్.. పరుగులు తీసే తొలి మార్గం ఇదే!