బ్రేక్ ఫాస్ట్ అంటే గుర్తొచ్చేది మొదట దోశ. బియ్యం, మినప్పప్పుతో చేసే ఈ క్రిస్పీ దోశ అనేక రకాలు ఉంటుంది. బంగాళాదుంప కూరతో నింపిన దోశను… చట్నీలను, సాంబార్ తో వడ్డిస్తుంటే ఆ రుచే వేరు. అలాగే సాదా దోశల్లో దీనిలో బంగాళదుంప కూర ఉండదు. అయినా కూడా కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతుంది. ఇక మరింత క్రిస్పీగా ఉండే పేపర్ దోశ నోట్లో పెడితేనే కరిగిపోతుంది.
మంగళూరుకు చెందిన ప్రసిద్ధి చెందిన నీర్ దోశ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా సులువుగా తినేస్తారు. ఇక డయాబెటిస్ పేషెంట్లు, ఆరోగ్యం కోసం ఆలోచించే వారికి రాగి దోశలు రెడీగా ఉంటాయి. ఇలా దోశను అనేక రకాలుగా చేయొచ్చు. కొంతమంది అల్పాహారంలోనే కాదు రాత్రి భోజనంలో కూడా దోశనే తింటారు. దీంతో అనేక రకాల చట్నీలు చేసుకొని తింటే రుచి అదిరిపోతుంది.
ఇక హైదరాబాదులోని మాదాపూర్ చుట్టుపక్కల ఉన్న ఉద్యోగులు విద్యార్థులు ఎక్కడ మంచి దోశ దొరుకుతుందా? అని వెతుకుతున్నారా… దోశ ప్రేమికులకు మాదాపూర్ లో మంచి డెస్టినేషన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్లారంటే టేస్టీ దోశను ప్రతి రోజూ తినవచ్చు.
రామ్ కి బండి
ఇది మాదాపూర్ లోని హైటెక్ సిటీకి మెట్రో స్టేషన్‌కి సమీపంలో ఉంది. అర్ధరాత్రి వెళ్లినా కూడా మీకు ఇక్కడ దోశ దొరుకుతుంది. రామ్ కి బండి అనేక అవుట్ లెట్లు హైదరాబాదులో ఉన్నాయి. తెల్లవారుజామున 3 గంటల వరకు తెరిచే ఉంటాయి. ఇక్కడ దోశ క్రిస్పీగా రుచిగా ఉంటుంది. అన్నట్టు వీటిలో సగ్గుబియ్యం కూడా వేసి చేస్తారు. కాబట్టి మెత్తగా కూడా వస్తుంది. ఇక రామ్ కి బండి దగ్గర మీరు కచ్చితంగా తినాల్సినవి… తీన్మార్ దోశ, షెజ్వాన్ దోశ, తవా ఇడ్లీ. రామ్ కి బండి అనేది షాప్ కాదు.. ఒక ఫుడ్ ట్రక్ సెటప్. కాబట్టి ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఒక దోశకు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
దోశ ప్లేస్
ఇది అయ్యప్ప సొసైటీ మెయిన్ రోడ్ దగ్గర సిజిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఉంది. ఈ ఫుడ్ ట్రక్ లైట్లతో ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఇక్కడ మీరు పనీర్ దోశను కచ్చితంగా రుచి చూడాల్సిందే. దీనిపైన జీడిపప్పులు, కాటేజ్ చీజ్ వేసి ఇస్తారు. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.
తాజా కిచెన్
ఈ తాజా కిచెన్ అయ్యప్ప సొసైటీ కి దగ్గరలోనే ఉంది. 100 ఫీట్ రింగ్ రోడ్డుకు దగ్గరలో కనిపిస్తుంది. ఇది హోటల్ లాగా లోపల కూర్చుని తినే సెటప్ కాదు బయటే తినాలి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. తాజా కిచెన్ కి వెళ్లినవారు మసాలా దోశ, చౌ చౌ బాత్, గారెలు కచ్చితంగా ప్రయత్నించండి. ఇవి విద్యార్థులకు అందుబాటు ధరలోనే లభిస్తాయి.
శ్రీ కన్య కంఫర్ట్
మాదాపూర్ లోనే ఉన్న మరొక అద్భుతమైన హోటల్ శ్రీ కన్య కంఫర్ట్. మీరు దీన్నుంచి ఆర్డర్ జొమాటో నుంచి కూడా పెట్టుకోవచ్చు. క్లాసిక్ రుచులను అందించడంలో శ్రీ కన్య కంఫర్ట్ ముందుంటుంది. దోశ ప్రేమికులకు ఇది బెస్ట్ ప్లేస్. ఇక్కడ మీరు నెయ్యి దోశ, మసాలా దోశ కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇక్కడ కేవలం అల్పాహారాలు మాత్రమే కాదు.. అనేక రకాల భోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబంతో వచ్చి తినేందుకు ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు.
అత్తారింటి దోశ
మాదాపూర్‌లోని స్ట్రీట్ ఫుడ్ దారిలో ఈ అత్తారింటి దోశ ఉంటుంది. అర్ధరాత్రి వరకు ఇక్కడ మీకు దోశలు దొరుకుతూనే ఉంటాయి. అత్తారింటి దోశ తినాలనుకుంటే బైక్ మీద వెళ్లడం మంచిది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ట్రాఫిక్, జనాల రద్దీ ఎక్కువగా ఉంటే పార్కింగ్ ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ మీరు దోశ తినాలంటే 80 రూపాయల నుంచి 150 రూపాయలు దాకా ఖర్చు చేయాల్సి వస్తుంది.
మాదాపూర్ లో ఫుడ్ ట్రక్ లు అధికంగా ఉంటాయి.ఇక్కడ అల్పాహారాలు, మధ్యాహ్న భోజనాలు అమ్ముతూ ఉంటారు. కూర్చొని కుటుంబంతో తినాలి అనిపిస్తే శ్రీ కన్య కంఫర్ట్ కు వెళ్లడం మంచిది. లేదా ఇంటికి హోటల్ నుంచి తెప్పించుకోవాలనుకుంటే జొమాటో, స్విగ్గీ నుంచి తెప్పించుకోవచ్చు. ఈ దోశ షాపులన్నీ దాదాపు అన్ని ఆన్లైన్ ఆర్డర్ అందిస్తున్నాయి. మీరు సాంప్రదాయ దోశనే తినాలనుకుంటే తాజా కిచెన్, శ్రీ కన్య కంఫర్టస్ కు వెళ్ళండి. అలా కాకుండా ఫ్యూజన్, కొత్త రకం దోశలను పేస్ట్ చేయాలనుకుంటే రామ్ కి బండి, దోశ ప్లేష్ వంటి వాటికి వెళ్లడం ఉత్తమం.