Big Tv Originals: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఇండియన్ రైల్వే ఒకటి. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. ఇక రైలు ప్రయాణీకుల సౌకర్యం కోసం ప్రతి కోచ్ లో టాయిలెట్లు ఉంటాయి. వాటిలో నీటి సౌకర్యం ఉంటుంది. ఒకవేళ రైల్వే టాయిలెట్లలో నీళ్లు లేకపోతే ఏం చేయాలి? దీని గురించి ఏదైనా చట్టం ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రైళ్లలో నీటికి సంబంధించి చట్టంలో ఏం ఉంది?
భారతీయ రైళ్లలోని టాయిలెట్లలో ఎల్లప్పుడూ నీరు ఉండాలనే చట్టం ప్రత్యేకంగా ఏం లేదు. పారిశుధ్య సమస్య రాకుండా ఉండేందుకు భారత రైల్వే కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం.. రైళ్లలో నీటి సరఫరాతో కూడిన శుభ్రమైన టాయిలెట్లు ఉండాలి. రైళ్లలోని నీటి ట్యాంకులను ఆయా స్టేషన్లలో క్రమం తప్పకుండా నింపాలి. రైల్వే సిబ్బంది ప్రయాణీకులకు నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. భారతీయ రైల్వే చట్టం 1989 ప్రకారం అధికారులు రైలు పరిశుభ్రతను కాపాడటంతో పాటు ప్రయాణీకులకు ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని సూచిస్తుంది. అలాగని రైల్లో నీళ్లు లేకపోతే ప్రయాణీకులకు డబ్బులు చెల్లించాలనే రూల్ ఏమీ లేదు.
రైలు టాయిలెట్లలో నీళ్లు అయిపోతాయా?
రైలు ప్రయాణానికి సరిపడ నీటి నిల్వ అనేది ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో నీళ్లు అనేవి అయిపోయే అవకాశం ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో నీళ్లు అయిపోతాయో ఇప్పుడు చూద్దాం..
సుదూర ప్రయాణం: రైలు ప్రయాణానికి సరిపడ నీటిని నింపినప్పటికీ సుదూర ప్రయాణాల నేపథ్యంలో కొన్నిసార్లు అయిపోతాయి.
అధిక వినియోగం: టాయిలెట్లను ఉపయోగించే ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల నీరు త్వరగా అయిపోతుంది.
సాంకేతిక సమస్యలు: లీకేజీ, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా నీళ్లు అయిపోయే అవకాశం ఉంటుంది.
నిర్లక్ష్యం: కొన్నిసార్లు, రైల్వే సిబ్బంది నీటి ట్యాంకులను సరిగ్గా నింపకపోవడం వల్ల నీళ్లు త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది.
నీళ్లు రాకపోతే ప్రయాణీకులు ఏం చేయాలి?
ఒకవేళ మీరు ప్రయాణిస్తున్న కోచ్ లో నీళ్లు లేకపోతే, ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
రైలు సిబ్బందికి తెలియజేయండి – TTE (టికెట్ ఎగ్జామినర్) లేదంటే కోచ్ అటెండెంట్ తో మాట్లాడి విషయం చెప్పాలి.
రైల్ మదద్ యాప్‌ను ఉపయోగించండి – మీ సమస్య త్వరగా పరిష్కారం కావాలంటే రైల్ మదద్ ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయవచ్చు.
రైల్వే హెల్ప్ లైన్ 139కి కాల్ చేయండి – మీ సమస్యను 24/7 హెల్ప్ లైన్ 139కి చేసి చెప్పవచ్చు.
ఇండియన్ రైల్వేకు ట్వీట్ చేయండి – ట్విట్టర్ లో (@RailwaySeva)కు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టడం వల్ల కూడా వేగంగా మీ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది
రైల్లో నీళ్లు అయిపోతే రైల్వే సంస్థ ఏం చేస్తుంది?
రైళ్లలో నీటిని అందుబాటులో ఉంచేందుకు పలు రకాల చర్యలు తీసుకుంటున్నది. సుదీర్ఘ ప్రయాణం చేసే రైళ్లకు పలు చోట్ల వాటర్ రీఫిల్ చేయిస్తుంది. తక్కువ నీటిని ఉపయోగించే బయో టాయిలెట్లు, వాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తుంది. నీటి లెవెల్స్ ను తరచుగా చెక్ చేసేందుకు సిబ్బందిని నియమించింది. నీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడానికి రైలు మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది.
Read Also: ఆ టికెట్లను ఆన్‌లైన్‌లోనూ క్యాన్సిల్ చేసుకోవచ్చు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్