ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంలో ‘మేడే కాల్’ అనేది సాంకేతికంగా కీలక అంశంగా మారింది. సహజంగా విమానం లేదా హెలికాప్టర్ ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అయిన అంశాలు కీలకంగా మారతాయి. బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తే ప్రమాద కారణాలను తెలుసుకోవచ్చని అంటారు. అయితే ఈసారి ‘మేడే కాల్’ అనేది బాగా వినపడుతోంది. అసలు ‘మేడే కాల్’ అంటే ఏంటి..? దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు.
డిస్ట్రెస్ కాల్
విమానాలు, లేదా నౌకలు అనుకోని ప్రమాదాలకు లోనైనప్పుడు వాటిని నడుపుతున్న పైలట్ లేదా కెప్టెన్ ‘మేడే కాల్’ ఇవ్వడం రివాజు. దీన్ని డిస్ట్రెస్ కాల్ అంటారు. అంటే తమ బాధను వ్యక్తం చేసేందుకు చేసే కాల్. ఇది ఫ్రెంచ్ పదం మైడెర్ నుంచి వచ్చింది. ‘సాయం చేయండి’ అంటూ తమ బాధని వ్యక్తం చేయడాన్ని మేడే కాల్ అంటారు. మేడే, మేడే, మేడే అంటూ మూడుసార్లు పైలట్ చెబుతారు. అంటే వారు ఏదైనా ఎమర్జెన్సీలో ఉన్నారని గ్రౌండ్ స్టేషన్ అర్థం చేసుకుంటుంది. వెంటనే రాడార్ సాయంతో దాని లొకేషన్ ట్రేస్ చేసి, అత్యవసర సాయం చేయడానికి ప్రయత్నిస్తారు సిబ్బంది. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే పైలట్ మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత మరికొన్ని సెకన్లకే విమానం కుప్పకూలింది. మధ్యాహ్నం 1గంట 39 నిమిషాలకు విమానం టేకాఫ్ కాగా.. కొన్ని క్షణాల్లోనే అది కుప్పకూలిపోయింది.
మేడే కాల్ అనే పదం 1920ల ప్రారంభం నుంచి వాడటం మొదలు పెట్టారు. లండన్ లోని క్రోయ్‌డాన్ విమానాశ్రయంలో రేడియో అధికారి అయిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్‌ఫోర్డ్ “నాకు సహాయం చేయి” అనే అర్థం వచ్చేలా ఫ్రెంచ్ పదం అయిన “మైడర్” ను వాడారు. అలా అది మేడే కాల్ అయింది. 1927 నాటికి, అంతర్జాతీయ రేడియోటెలిగ్రాఫ్ కన్వెన్షన్ అధికారికంగా “మేడే కాల్”ని ప్రపంచవ్యాప్తంగా విమానాలు, నౌకలకు ప్రామాణిక వాయిస్ డిస్ట్రెస్ కాల్‌గా స్వీకరించింది.
ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు..
విమానంలో ఇంజిన్ వైఫల్యం చెందింది అని భావించినప్పుడు, వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయినా, నిర్మాణాత్మక లోపాలు తలెత్తినా, అగ్ని ప్రమాదం జరిగినా, విమానంలో ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమని భావించినా మేడేకాల్ చేస్తారు. తక్కువ ప్రమాదం ఉండే సమయంలో పాన్-పాన్ కాల్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.
ATC రెస్పాన్స్ ఏంటి..?
మేడే కాల్ వస్తే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. వెంటనే అలర్ట్ అవుతుంది. అత్యవసరం కాని అన్ని రేడియో కమ్యూనికేషన్లను వెంటనే నిలిపివేస్తారు. మేడే కాల్ ఇచ్చిన విమానానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తారు. సమీపంలోని విమానాశ్రయాలు, ఇతర విమానాలతో సమన్వయం చేసుకుని సత్వర రక్షణ చర్యలు ప్రారంభిస్తారు. కానీ తాజా ప్రమాదంలో మేడే కాల్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే జరగరాని ఘోరం జరిగింది. మేడే కాల్ తర్వాత కొన్ని క్షణాలకే విమానం కుప్పకూలింది.
తప్పుడు మేడేకాల్స్..
ట్రైన్ లో అవసరం లేకపోయినా చైన్ లాగితే ఎలా జరిమానా విధిస్తారో.. ఎయిర్ క్రాఫ్ట్స్ లో తప్పుడు మేడే కాల్స్ ఇచ్చినా దానికి కఠిన శిక్షలు ఉంటాయి. తప్పుడు మేడే కాల్స్ చేయడం చాలా దేశాల్లో క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. జరిమానాలు, జైలు శిక్ష ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పైలట్లు మేడే కాల్ ఇవ్వరు. వారు వేగంగా స్పందించక ముందే ప్రమాదాలు జరిగిపోతుంటాయి. తాజా ప్రమాదంలో మాత్రం పైలట్లు అలర్ట్ అయ్యారు. వారికి ప్రమాదం జరుగుతుందనే సంకేతాలు రాగానే మేడేకాల్ ఇచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది.