Mini Tibet: భారతదేశంలోని హిమాలయాల ఒడిలో ఉన్న లడఖ్, దాని అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ప్రత్యేకమైన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని ‘మినీ టిబెట్ ఆఫ్ ఇండియా’ (Mini Tibet of India) అని పిలుస్తారు. ఇందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
లడఖ్‌ను మినీ టిబెట్ అని ఎందుకు పిలుస్తారు?
బౌద్ధ సంస్కృతి, మఠాలు: లడఖ్, టిబెట్ మాదిరిగానే, వజ్రయాన బౌద్ధమతానికి ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ అనేక ప్రాచీన బౌద్ధ మఠాలు ఉన్నాయి. అవి టిబెటన్ శైలి నిర్మాణాన్ని, కళను ప్రతిబింబిస్తాయి. హేమిస్, థిక్సే, లామయూరు వంటి మఠాలు టిబెటన్ బౌద్ధమత సంప్రదాయాలను, ఆచారాలను సజీవంగా ఉంచుతాయి. ఈ మఠాలలో ప్రార్థన చక్రాలు, థాంకా పెయింటింగ్‌లు, బుద్ధుని విగ్రహాలు టిబెటన్ ప్రభావానికి నిదర్శనం.
జనాభా, జీవనశైలి: లడఖ్ ప్రజలు.. ముఖ్యంగా లేహ్, పరిసర ప్రాంతాల వారు, టిబెటన్ల వలె పోలికలు కలిగి ఉంటారు. వారి భాష, దుస్తులు, ఆహారం, జీవనశైలి టిబెటన్ సంస్కృతిని గుర్తుకు తెస్తాయి. టిబెట్ నుంచి వలస వచ్చిన వారితో పాటు, స్థానిక లడఖీలు కూడా టిబెటన్ బౌద్ధ సంప్రదాయాలను పాటిస్తారు.
భూభాగం, వాతావరణం:
లడఖ్ భూభాగం టిబెట్ పీఠభూమిని పోలి ఉంటుంది . అంతే కాకుండా ఎత్తైన పర్వతాలు, ఎడారులు, లోతైన లోయలు , స్వచ్ఛమైన ఆకాశం. ఇరువైపులా హిమాలయ పర్వత శ్రేణులు, కారకోరం శ్రేణి ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం కూడా టిబెట్‌లోని కొన్ని ప్రాంతాలను పోలి ఉంటుంది.
ఆధ్యాత్మిక వాతావరణం:
లడఖ్‌లో ఎక్కడికెళ్లినా జెండాలు, మణి రాళ్లు , స్థూపాలు కనిపిస్తాయి. ఇవి టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తాయి. ప్రతి మఠంలోనూ లామాలు, బౌద్ధ సన్యాసులు నిరంతరం ప్రార్థనలు చేస్తూ.. ప్రజలకు మార్గనిర్దేశం చేస్తుంటారు.
ఈ కారణాలన్నింటి వల్ల లడఖ్‌ను భారతదేశపు ‘మినీ టిబెట్’ లేదా ‘లిటిల్ టిబెట్’ అని పిలుస్తారు.
లడఖ్‌లో చూడాల్సిన ప్రదేశాలు:
లడఖ్‌లో పర్యాటకులను ఆకట్టుకునే అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి:
లేహ్ నగరం : లడఖ్ రాజధాని. ఇది అనేక ఆకర్షణలకు కేంద్రం. లేహ్ ప్యాలెస్ , శాంతి స్తూపం, లేహ్ మార్కెట్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.
ప్యాంగాంగ్ త్సో సరస్సు : ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఉప్పునీటి సరస్సు దాని రంగులు మారే నీటితో అద్భుతంగా ఉంటుంది. ఈ సరస్సు కొంత భాగం భారత్‌లో.. మిగిలిన భాగం టిబెట్‌లో ఉంది.
నుబ్రా వ్యాలీ : “పువ్వుల లోయ” గా పిలువబడే ఈ ప్రాంతం. దిస్క్రిట్ మఠం, హుండర్ గ్రామంలోని డబుల్-హంప్డ్ ఒంటెలు, మంత్రముగ్దులను చేసే ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి.
ఖర్దుంగ్ లా పాస్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ చేయదగిన మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతుంది . ఇక్కడి నుంచి హిమాలయ శ్రేణుల అద్భుతంగా కనిపిస్తాయి.
హేమిస్ మొనాస్టరీ : లడఖ్‌లో అతిపెద్ద, సంపన్నమైన బౌద్ధ మఠం ఇది. ఇక్కడ ఏటా జరిగే హేమిస్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది.
Also Read: ఇండియాలోనే మినీ లండన్.. ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ !
థిక్సే మొనాస్టరీ: లేహ్ ప్యాలెస్‌ను పోలి ఉండే ఈ మఠం. అందమైన నిర్మాణ శైలికి, మైత్రేయ బుద్ధుని భారీ విగ్రహానికి ప్రసిద్ధి.
లామయూరు మొనాస్టరీ: “మూన్ ల్యాండ్” అని పిలువబడే ఈ మఠం చుట్టూ ఉండే చంద్రుని ఉపరితలాన్ని పోలిన వింత భూభాగం ప్రత్యేక ఆకర్షణ.
గురుద్వారా పత్తర్ సాహిబ్ : లేహ్ నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న ఈ గురుద్వారా సిక్కు యాత్రికులకు పవిత్ర స్థలం.
జన్స్కార్ వ్యాలీ: సాహస ప్రియులకు ఇది స్వర్గధామం. ఇక్కడ ఛాదర్ ట్రెక్ (ఫ్రోజెన్ రివర్ ట్రెక్, రివర్ రాఫ్టింగ్ వంటివి చాలా ప్రసిద్ధి.