Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నెట్ వర్క్ కాగా, ఆసియాలో రెండో అతిపెద్ద నెట్ వర్క్. దేశ వ్యాప్తంగా రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తారు. సాధారణంగా రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల మీద రకరకాల రంగుల్లో గీతలు ఉంటాయి. తెలుగు, పసుపు, బూడిద, ఆకుపచ్చ, ఎరుపు, నీలం చారలు కనిపిస్తాయి. చాలా మందికి ఈ రంగుల చారలు ఎందుకు అంటించారో తెలియదు. అయితే, ఒక్కో రంగు గీతలు ఒక్కో విషయాన్ని వెల్లడిస్తాయి. ఇంతకీ అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కోచ్ రకాన్ని సూచించేలా రంగుల చారలు
ఆయా బోగీల మీద వేసే రంగుల చారలు కోచ్ రకాన్ని సూచిస్తాయి. కోచ్ చివరి విండో మీద ఆయా రంగుల్లో గీతలు ఉంటాయి. ఇంతకీ ఆయా రంగుల వెనుకున్న అర్థం ఏంటో చూద్దాం..
⦿ తెలుగు రంగు గీతలు
బ్లూ కలర్ కోచ్ ల మీద వైట్ కలర్ చారలు కనిపిస్తే, అది జనరల్ కోచ్ అని అర్థం. ఈ కోచ్ లు సాధారణంగా రైలు వెనుక భాగంలో ఉంటాయి. కన్ఫర్మ్ సీటు దొరకని వాళ్లు ఈ కోచ్ లో వెళ్లే అవకాశం ఉంటుంది.
⦿ ఆకుపచ్చ రంగు గీతలు
రైలు బోగీ మీద ఆకుపచ్చ గీతలు కనిపిస్తే, దాన్ని మహిళలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు అర్థం. ఈ బోగీలోకి పురుషులు ఎక్కకూడదు. ఒకవేళ వెళ్తే పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
⦿ పసుపు రంగు గీతలు
కోచ్ బయట పసుపు పచ్చ రంగులో గీతలు ఉంటే, దాన్ని వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు ప్రయాణించడం కోసం కేటాయించిన కోచ్ గా అర్థం చేసుకోవాలి. ఈ కోచ్ లో వికలాంగులు, రోగుల కోసం ప్రత్యేక టాయిలెట్ సౌకర్యం ఉంటుంది.
⦿ఎరుపు రంగు గీతలు
సాధారణంగా లోకల్ రైళ్లలో ఎరుపు రంగు చారలు ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ గా అర్థం చేసుకోవాలి.
⦿లేత నీలం రంగు గీతలు
బోగీ మీద లేత నీలం రంగు గీతలు ఉంటే దాన్ని స్లీపర్ క్లాస్ గా గుర్తించాలి.
⦿ బూడిద రంగు గీతలు
బోగీ మీద బూడిద రంగు చారలు ఉంటే అదనపు ఫస్ట్ క్లాస్ కోచ్ గా భావించాల్సి ఉంటుంది.
ఇక భారతీయ రైళ్లలో చాలా రంగుల బోగీలు ఉంటాయి. ఎక్కువగా బ్లూ కోచ్ లు ఉంటాయి. ఈ కోచ్ లను ICF బోగీలు అంటారు. వీటిని గంటకు 70 నుంచి 140 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ఈ కోచ్‌లు మెయిల్ ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఉంటాయి. రాజధాని ఎక్స్ ప్రెస్ లాటి AC రైళ్లకు ఎరుపు-రంగు కోచ్‌లను అమర్చుతారు. గరీబ్ రథ్ లో ఆకుపచ్చ బోగీలను ఉపయోగిస్తారు. శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లకు లేత నీలిరంగు బోగీలను ఉపయోగిస్తారు. భారత్ లో చాలా మంది నిరక్షరాస్యులు ఉన్న నేపథ్యంలో కోచ్ ల గురించి ఈజీగా తెలుసుకునేలా అధికారులు ఆయా రంగుల చారలను ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?