Trump Meet Kim Jong| అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టక ముందే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే భారీగా పెరిగిపోతున్న ప్రభుత్వ అప్పులు ఖర్చులను తగ్గించేందుకు ఎలన్ మస్క్ అధ్యక్షతన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎఫీషియిన్సీని సృష్టించి.. ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వాధికారులను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు ప్రపంచంలోని యుద్ధాలు ఆపేందుకు ముందుచూపుతో ఉత్తర కొరియా వైపు దృష్టిసారిస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికా, ఉత్తర కొరియా మధ్య గత ఏడు దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగుతోంది. 1945 సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక.. అప్పటివరకు జపాన్ ఆధీనంలో ఉన్న కొరియాలో ఆధిపత్య పోరు మొదలై అదికాస్త సివిల్ వార్ అంతర్యుద్ధంగా మారింది. అయితే ఈ యుద్ధంలో రష్యా, చైనా ఒకవైపు, అమెరికా, యూరోప్ దేశాలు మరోవైపు నిలబడడంతో 1950 నుంచి 1953 వరకు కొరియా యుద్దం జరిగింది. దీంతో రష్యా మద్దతుతో ఉత్తర కొరియాలో ప్రభుత్వం ఏర్పడగా.. దక్షిణ కొరియాలో అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడింది. 1953లో యుద్ధం ముగియకపోయినా కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. దీంతో అధికారికంగా చూస్తే.. ఇప్పటికీ ఆ యుద్ధం జరుగుతున్నట్లే లెక్క. దీంతో దక్షిణ కొరియావైపు నిలబడ్డ అమెరికాను ఉత్తర కొరియా ఎప్పుడూ తన శత్రువులా చూస్తుంది.
పైగా ఉత్తర కొరియాపై అమెరికా ఎన్నో ఆంక్షలు కూడా విధించింది. దీంతో ఉత్తర కొరియా ఎప్పుడూ యుద్ధం కోసం సిద్ధమవుతూ ఉంటుంది. అయితే 2016లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించారు. అందుకే 2018, 2019 సంవత్సరంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుని హోదాలో మూడు సార్లు కిమ్ జాంగ్ తో భేటీ అయ్యారు. అంతేకాదు కొరియా సరిహద్దుల్లో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. కానీ ఈ భేటీల వల్ల ఇరు దేశాల సంబంధాలలో పెద్దగా మార్పులు వచ్చిందేమీ లేదు. ఎందుకంటే ఉత్తర కొరియా అణుబాంబుల ప్రయత్నాలు మానేయాలని ట్రంప్ కోరారు. కానీ అలా చేయాలంటే ముందు తమ దేశంపై విధించిన ఆంక్షలు తొలగించాలని కిమ్ జాంగ్ డిమాండ్ చేశారు. కానీ ట్రంప్ అందుకు ఒప్పుకోలేదు. అలా 2020లో ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక ఇరు దేశాల మధ్య మైత్రి ప్రయత్నాలు అటకెక్కాయి. ఎందుకంటే 2020లో వచ్చిన కొత్త ప్రెసిడెంట్ ఉత్తర కొరియాతో దోస్తీ కోసం ప్రయత్నించలేదు.
Also Read: ప్రియురాలి కోసం యుద్ధానికి వెళ్లిన పరాయి దేశం యువకుడు.. శత్రు సైన్యం చేతికి చిక్కి ఏడుస్తూ..
కానీ ఇప్పుడు మళ్లీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20, 2024న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో మరోసారి అమెరికా, ఉత్తర కొరియా మధ్య పెరిగిపోతున్న వైర సంబంధాలను స్నేహం దిశగా తీసుకెళ్లడానికి ట్రప్ బృందం యోచిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తెలిపింది.
ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తన చివరి అధ్యక్ష పదవికాలంలో యుద్ధాలు ఆపుతానని పదే పదే చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ముందుగా రష్యాకు మద్దతునిస్తున్న ఉత్తర కొరియాకు అడ్డుకట్ట వేయాలని ప్లాన్ వేశారు. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాకు మద్దతుగా కిమ్ జాంగ్ 10000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులును పంపారు. పైగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉక్రెయిన్ దూర శ్రేణి క్షిపణులు ఉపయోగించేందుకు అనుమతలిచ్చారు. దీంతో యుద్ధంతో ఆ క్షిపణలు ప్రయోగించగా.. రష్యా అణు ఆయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉత్తర్ కొరియాతో చర్చలు జరపాలని ట్రంప్ సలహాదారులు భావిస్తున్నారు. కానీ ఈ చర్చల్లో ఇతర దేశాల సాయం తీసుకోవడం కంటే ట్రంప్ నేరుగా కిమ్ జాంగ్ తో కలిసి శాంతి ప్రస్తావన చేయడం మంచిదని ఆయన బృందం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఉత్తర కొరియా ప్రభుత్వం ట్రంప్ అధ్యక్షుడు కాగానే ఆయనకు శుభాకాంక్షలు తెలుపలేదు. ఈ నెల ప్రారంభంలోనే అమెరికా ప్రపంచంలో యుద్ధాల జరిపించేందుకు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని కిమ్ జాంగ్ అన్నారు.