Railway Ballast: సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు కిటికీలోంచి బయటకు చూస్తే పట్టాల కింద, పక్కల వేలకొద్దీ నల్లటి రాళ్లు కనిపిస్తాయి. రైలు వెళ్తున్నప్పుడు వాటిని మనం పెద్దగా పట్టించుకోం. ఏదో పట్టాల కింద రాళ్లు పోసి ఉంటారులే అని అనుకుంటాం. కానీ నిజానికి అవి సాధారణ రాళ్లు కావు. రైల్వే ఇంజనీరింగ్‌లో వీటికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. వీటినే ‘బ్యాలాస్ట్’ (Ballast) అని పిలుస్తారు.
రైలు బరువును తట్టుకోవడం, పట్టాలు కదలకుండా స్థిరంగా ఉంచడం, రైలు ప్రయాణంలో వచ్చే ప్రకంపనలను తగ్గించడం, వర్షపు నీరు నిలవకుండా చూడటం వంటి ఎన్నో పనులను ఈ రాళ్లు చేస్తాయి. ఈ నేపథ్యంలో పట్టాల కింద ఇలాంటి రాళ్లనే ఎందుకు వేస్తారు? వాటి వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
వందల టన్నుల బరువుండే ప్యాసింజర్ లేదా గూడ్స్ రైళ్లు వెళ్తున్నప్పుడు పట్టాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ రాళ్లు పట్టాల కింద ఒక బలమైన పునాదిలా పనిచేస్తాయి. ఒకవేళ ఇవి లేకపోతే రైలు వెళ్లేటప్పుడు పట్టాలు పక్కకు జరిగిపోయి పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
Also Read: సోలో ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ 4 ప్రదేశాలు సేఫ్ & బడ్జెట్ ఫ్రెండ్లీ!
వేగంగా వెళ్లే రైలు వల్ల తీవ్రమైన ప్రకంపనలు, షాక్‌లు పుట్టుకొస్తాయి. ఈ చిన్న రాళ్లు ఒక పెద్ద కుషన్‌లా పనిచేసి, ఆ ప్రకంపనలను నేలకు చేరకుండా తమలోనే ఇంకిపోయేలా చేస్తాయి. దీనివల్ల పట్టాలు త్వరగా అరిగిపోకుండా చాలా కాలం మన్నికగా ఉంటాయి.
వర్షం పడినప్పుడు నీరు పట్టాల చుట్టూ చేరితే నేల లూజ్ అయిపోతుంది. కానీ ఈ రాళ్ల మధ్య ఉండే ఖాళీల వల్ల వర్షపు నీరు క్షణాల్లో కిందకు ఇంకిపోతుంది. వర్షాల వల్ల పట్టాల కింద నేల కొట్టుకుపోకుండా, ట్రాక్ మునిగిపోకుండా ఇది ఎంతగానో కాపాడుతుంది.
నది ఒడ్డున దొరికే నునుపైన గులకరాళ్లను ఇక్కడ వాడరు. ఎందుకంటే అవి దొర్లిపోతాయి. అందుకే కోణాలుగా ఉండే ముళ్ల రాళ్లను వాడతారు. ఇవి ఒకదానికొకటి గట్టిగా లాక్ అయిపోవడం వల్ల రైలు వెళ్తున్నప్పుడు అసలు కదలకుండా ట్రాక్‌ను గట్టిగా పట్టి ఉంచుతాయి.
పట్టాల కింద పిచ్చి మొక్కలు, రావి చెట్లు పెరిగితే రైలు మార్గానికి తీవ్రంగా అంతరాయం కలుగుతుంది. రాళ్ల మందపాటి పొర వల్ల నేలకు ఎండ సరిగా తగలక పిచ్చి మొక్కలు మొలకెత్తవు. దీనివల్ల రైల్వే శాఖకు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గి, ప్రయాణం సురక్షితంగా సాగుతుంది.
Also Read: సముద్రం నుంచి చారిత్రక కట్టడాల వరకు.. హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో వెళ్లగలిగే ప్రదేశాలు!