World’s Laziest Countries: ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతికత పెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గిపోతోంది. రోజూ నడిచే అడుగుల ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ శారీరక శ్రమ కలిగిన దేశాల జాబితాను రూపొందించగా అందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశాలేవో? మన భారతదేశం ఎక్కడ ఉందో? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బద్దకస్తు దేశాల నివేదిక ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ శారీరక శ్రమ కలిగిన దేశంగా ఇండోనేషియా మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రజలు రోజుకు సగటున 3,513 అడుగులు మాత్రమే నడుస్తున్నారు. అధ్యయనంలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇక్కడే అత్యంత తక్కువ సగటు నమోదవ్వడం గమనార్హం.
రోజుకు సగటున కేవలం 3,807 అడుగులు మాత్రమే నడుస్తూ సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. అక్కడ ఉండే విపరీతమైన వేడి, ఎడారి వాతావరణం కారణంగా ప్రజలు ఎక్కువగా ఇళ్లలోనే ఉండటానికి ఇష్టపడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
మలేషియా సగటున 3,963 అడుగులతో మూడో స్థానంలో ఉంది. కౌలాలంపూర్, పెనాంగ్ వంటి నగరాల్లో వాహనాల వాడకం విపరీతంగా పెరగడం, నిరంతరం ఉండే ట్రాఫిక్ జామ్‌ల వల్ల అక్కడి ప్రజలు కాలినడకన వెళ్లడం కష్టంగా మారుతోంది.
రోజుకు 4,008 అడుగులతో ఫిలిప్పీన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. సరైన అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థలు లేకపోవడం వల్ల ప్రజలు నడవలేకపోతున్నారని విశ్లేషకులు చెప్తున్నారు.
దక్షిణాఫ్రికా ప్రజలు రోజుకు సగటున 4,105 అడుగులు మాత్రమే వేస్తున్నారు. శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ఇక్కడ శారీరక శ్రమ బాగా తగ్గిపోయిందని నివేదిక తెలిపింది.
రోజుకు సగటున 4,315 అడుగులతో ఈజిప్ట్ ఆరో స్థానంలో నిలిచింది. తీవ్రమైన ఎండలు, అధిక ట్రాఫిక్ వల్ల అక్కడి ప్రజలు నడవడానికి అస్సలు మొగ్గు చూపడం లేదట.
బ్రెజిల్ ప్రజలు రోజుకు సగటున 4,289 అడుగులు నడుస్తూ ఏడో స్థానంలో నిలిచారు. ఇక్కడి సామాజిక-ఆర్థిక వ్యత్యాసాలు ప్రజల శారీరక శ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Also Read: స్వర్గం లాంటి దేశంలో.. పదే పదే విపత్తులు ఎందుకు? నేపాల్ వినాశనానికి దారితీస్తున్న అంశాలివే!
మన దేశంలో ప్రజలు రోజుకు సగటున 4,297 అడుగులు నడుస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో పెరిగిన వాహన వినియోగం, మారుతున్న జీవనశైలే శారీరక శ్రమ తగ్గడానికి కారణమని నివేదిక పేర్కొంది.
Also Read: Airtel ఆల్ రౌండర్ ప్లాన్.. 3 నెలల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5G, ఫ్రీగా 20+ ఓటీటీలు!