The Airport Chaplain OTT: ఎయిర్‌పోర్ట్‌లో విమానాలు, లగేజీ, సెక్యూరిటీ మాత్రమే కాదు… అక్కడ పని చేసే ప్రతి వ్యక్తి వెనుక ఓ కథ ఉంటుంది. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి రూల్స్‌ను సైతం పక్కన పెట్టే ఓ చాప్లిన్… అతని పద్ధతిని అస్సలు అంగీకరించని కొత్త బాస్… వీరిద్దరి మధ్య జరిగే ఆసక్తికరమైన పోరాటమే ‘The Airport Chaplain’. మరి ఈ సిరీస్‌లో ఏం జరుగుతుంది ? ఏ ఓటీటీలో చూడొచ్చు ? తెలుగులో ఉందా? తెలుసుకుందాం.
కథ మొత్తం ఓ రద్దీ ఎయిర్‌పోర్ట్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ టోబియాస్ వాలెస్‌గా హ్యూగో వీవింగ్ కనిపిస్తాడు. అతను ఎయిర్‌పోర్ట్ చాప్లిన్. కానీ కేవలం ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం మాత్రమే అతని పని కాదు. ప్రయాణికులకు ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందిస్తాడు. పోయిన లగేజీ నుంచి కుటుంబ గొడవల వరకు… ఎవరికైనా కష్టం వస్తే టోబియాస్ అక్కడ ఉంటాడు. అవసరమైతే ఎయిర్‌పోర్ట్ రూల్స్‌ను కూడా పక్కన పెట్టి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు.
అయితే కొత్త టెర్మినల్ మేనేజర్ మీరా అన్సారీగా షబానా అజీజ్ వచ్చిన తర్వాత టోబియాస్‌కు ఇబ్బందులు మొదలవుతాయి. ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిదీ సిస్టమ్ ప్రకారమే జరగాలని మీరా భావిస్తుంది. టోబియాస్ మాత్రం మనిషి సమస్య ముందు రూల్స్ అంత ముఖ్యమైనవి కావని నమ్ముతాడు. ఇద్దరి మధ్య మొదలైన ఈ విభేదాలు క్రమంగా పెద్ద గొడవగా మారతాయి. ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో రోజుకో కొత్త సమస్య ఎదురవుతుంది. ప్రార్థనా గదిలో పాస్‌పోర్ట్, ఫోన్ లేకుండా మౌనంగా కూర్చున్న యువతి… షాంపూ బాటిళ్లలో తేనె దాచుకుని వెళ్లే వ్యక్తి… తప్పిపోయిన లగేజీ… కుటుంబ కలహాలు… ఇలా ప్రతి ఎపిసోడ్ కొత్త మనుషుల కథను పరిచయం చేస్తుంది.
ఈ సమస్యలను పరిష్కరిస్తున్న కొద్దీ టోబియాస్ అసలు స్వభావం కూడా బయట పడుతుంది. ఇతరుల జీవితాల్లో అతను చేస్తున్న జోక్యం నిజంగా సహాయమా? లేక హద్దులు దాటడమా? అన్నది ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు టోబియాస్‌ను ఎయిర్‌పోర్ట్ నుంచి తప్పించాలని మీరా ప్రయత్నిస్తుంది. కానీ అక్కడి చాలామందికి అతనే నమ్మకమైన వ్యక్తిగా మారడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది. చివరికి టోబియాస్ గతం ఏంటి అన్నది తెలిసిందా ? అతని ప్రవర్తన వెనుక ఉన్న కారణాలు ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.
మొత్తం 8 ఎపిసోడ్‌లతో రూపొందిన ఆస్ట్రేలియన్ డ్రామా సిరీస్ ఇది. హ్యూగో వీవింగ్, షబానా అజీజ్, క్లాడియా కార్వన్ కీలక పాత్రల్లో నటించారు. ఎలిస్ మెక్‌క్రీడీ, జూడ్ ట్రాయ్ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 26 నుంచి ఆస్ట్రేలియాలో SBS, SBS On Demand, అంతర్జాతీయంగా Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఇండియాలో ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. క్రైమ్, యాక్షన్ కంటే హ్యూమన్ డ్రామా, వర్క్‌ప్లేస్ కథలు ఇష్టపడేవారికి ఎయిర్‌పోర్ట్‌ను కొత్త కోణంలో చూపించే సిరీస్ ఇది. అస్సలు మిస్ అవ్వొద్దు.
Read Also: ప్రేమించిన అమ్మాయిని లాక్కుని జైలుకు… తిరిగొచ్చాక వీడి ఊచకోత చూస్తే గూస్ బంప్స్