Mumbai-Ahmedabad Bullet Train Corridor: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ లో ముఖ్యంగా మహారాష్ట్ర భాగంలో నిర్మాణం కీలక దశకు చేరుకుంది. ఈ మెగా ప్రాజెక్టులో ఇప్పటికే 100 కిలోమీటర్లకు పైగా పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సొరంగాలు, వంతెనలు, ఎలివేటెడ్ మార్గాల నిర్మాణం ఒకేసారి కొనసాగుతున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న షిల్ ఫాటా నుంచి గుజరాత్ సరిహద్దుకు సమీపంలోని జరోలి గ్రామం వరకు సుమారు 135.45 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ విభాగం థానే, పాల్ఘర్ జిల్లాల మీదుగా సాగుతుంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివరాల ప్రకారం.. ఈ మార్గంలో 100 కిలోమీటర్లకు పైగా పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. వీటిలో సుమారు 74 కిలోమీటర్ల మేర పిల్లర్లు వయాడక్ట్ గర్డర్లను అమర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఈ భాగంలో మొత్తం 124.027 కిలోమీటర్ల మేర వయాడక్ట్ లు, వంతెనలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో థానే, విరార్, బోయిసార్ ప్రాంతాల్లో మూడు ఎలివేటెడ్ బుల్లెట్ రైలు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ప్రతి స్టేషన్ లో స్థానిక పరిస్థితులు, పర్యావరణ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ప్రత్యేకంగా థానే ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనది కావడంతో సమీపంలోని మడ అడవులపై ప్రభావం తగ్గించేలా స్టేషన్‌ను రూపొందించారు. థానే బుల్లెట్ రైలు స్టేషన్ కాన్‌కోర్స్ స్థాయి భూమికి సుమారు 12 మీటర్ల ఎత్తులో ఉండేలా నిర్మిస్తున్నారు.
బుల్లెట్ రైలు మార్గంలో సొరంగాల నిర్మాణం కూడా కీలక భాగం. మహారాష్ట్రలో మొత్తం ఏడు పర్వత సొరంగాలను నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. వీటిలో ఇప్పటికే మూడు సొరంగాల్లో తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి.
తవ్వకం పూర్తయిన ప్రాంతాల్లో డ్రైనేజీ, వాటర్ ప్రూఫింగ్, టన్నెల్ లైనింగ్ లాంటి పనులు కొనసాగుతున్నాయి. కొండలు, అడవులు, నదులు వంటి భౌగోళిక పరిస్థితుల మధ్య ఈ పనులు సవాలుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో అనేక నదులపై భారీ వంతెనలు కూడా నిర్మిస్తున్నారు. ఉల్హాస్ నదిపై 460 మీటర్ల వంతెన, వైతర్న నదిపై 2.32 కిలోమీటర్ల పొడవైన వంతెన, జగని నదిపై 510 మీటర్ల వంతెన నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా ఈ మార్గంలో 36 వంతెనలు, క్రాసింగ్‌లు ఉండనున్నాయి. ప్రధాన రైల్వే మార్గాలు, రహదారులు, నదులపై 12 వంతెనలను నిర్మించనున్నారు.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు మొత్తం 508 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2027లో గుజరాత్‌లోని తొలి ఆపరేషనల్ విభాగాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గతంలో వెల్లడించింది.
Read Also: ప్రకృతి అందాల నడుమ వందేభారత్ ప్రయాణం.. ఈ 6 రూట్స్ అస్సలు మిస్ అవ్వకండి!