Doctor wife maintenance case| భార్య ఉన్నత విద్యావంతురాలు. వైద్యురాలిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అయితే, వివాహ వివాదం కారణంగా ఉద్యోగం కోల్పోయానని, భర్త నుంచి భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వృత్తిపరమైన అర్హతలు, గత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయించింది.
ఈ కేసులో భార్య గైనకాలజీలో ఎండీ పూర్తి చేసిన వైద్యురాలు. ఆమె భర్త న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి వ్యక్తిగత వివరాలను కోర్టు గోప్యంగా ఉంచింది. భార్య ఆదాయపు పన్ను రిటర్నుల ప్రకారం.. గతంలో ఆమె ఏడాదికి రూ.31 లక్షలకు పైగా సంపాదించేవారు. భార్యాభర్తల మధ్య వివాదం ప్రారంభమైన తర్వాత తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె పేర్కొన్నారు.
తనకు, పిల్లలకు భరణం ఇవ్వాలని కోరుతూ ఆమె ప్రయాగ్‌రాజ్ ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు. అయితే, 2025 ఏప్రిల్ 7న ఫ్యామిలీ కోర్టు ఆమె వ్యక్తిగత భరణం అభ్యర్థనను తిరస్కరించింది. అదే సమయంలో ముగ్గురు పిల్లల కోసం నెలకు రూ.60,000 చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఆయన ఆ ఆదేశాన్ని పాటిస్తూ పిల్లల ఖర్చుల కోసం డబ్బు చెల్లిస్తున్నారు.
ఉద్యోగం నుంచి తొలగించడంతో ప్రస్తుతం తన క్లయింట్‌కు ఆదాయం లేదని భార్య తరఫు న్యాయవాది వాదించారు. విడిపోకముందు ఉన్న జీవన ప్రమాణాలను కొనసాగించేందుకు భర్త నుంచి ఆర్థిక సహాయం అవసరమని తెలిపారు. అయితే, భర్త తరఫు న్యాయవాది ఈ వాదనను వ్యతిరేకించారు. భార్యకు గైనకాలజిస్టుగా ఉన్నత అర్హతలు, మంచి ఆదాయం సంపాదించే సామర్థ్యం ఉన్నాయని పేర్కొన్నారు. ఆమె స్వతహాగా ఉద్యోగం చేయడం లేదని చెప్పారు. పిల్లల కోసం భర్త క్రమం తప్పకుండా నెలకు రూ.60,000 చెల్లిస్తున్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: భర్త సంపాదన నెలకు రూ.11 వేలు.. విడాకుల తరువాత భార్యకు నెలవారీ రూ.25000 చెల్లించాలన్న కోర్టు
2026 ఏప్రిల్ 21న అలహాబాద్ హైకోర్టు భర్తకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భార్య వైద్య విద్యార్హతలు, గత ఆదాయాన్ని పరిశీలించింది.
తగిన అర్హతలు ఉండి, తన నైపుణ్యాలతో మంచి ఆదాయం సంపాదించగల వ్యక్తి.. ఉద్యోగం చేయకుండా కావాలనే ఖాళీగా ఉంటూ భర్తపై భారం మోపాలని ప్రయత్నిస్తే, హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం భరణాన్ని నిరాకరించవచ్చని కోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన
ఉత్తర్వుల్లో తప్పు కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో భార్య దాఖలు చేసిన అప్పీల్ కొట్టివేసింది.
Also Read: తండ్రిపై కోర్టుకెక్కిన కూతురు.. పీపీఎఫ్ డబ్బులు తీసుకున్నారని కేసు.. తీర్పు ఇదే
ఈ తీర్పు ప్రకారం.. భరణం కేసుల్లో విద్యార్హతలు, సంపాదించే సామర్థ్యం, గత ఆదాయం వంటి అంశాలు కోర్టు పరిశీలించింది. అయితే, ప్రతి కేసులోని పరిస్థితులను బట్టి న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటాయి.
ఉద్యోగం లేని ప్రతి విద్యావంతురాలైన భార్యకు భరణం నిరాకరిస్తారని ఈ తీర్పు వర్తించదు. ఈ కేసులో పిల్లలకు నెలకు రూ.60,000 చెల్లించాలన్న ఆదేశం కొనసాగుతోంది.