ఆధ్యాత్మికతతో నిండిన జీవితానికి భారతదేశం ఉత్తమ ప్రదేశం గానే చెప్పుకోవాలి. ప్రపంచం నలుమూలల నుండి ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. మనదేశం ఉత్తరాన మంచుతో కప్పిన శిఖరాల నుండి దక్షిణాన సముద్రాల వరకు మన దేశంలో ఎన్నో పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. విశాఖపట్నంలో నివసిస్తున్న వారు కూడా అద్భుతమైన హిందూ తీర్థయాత్ర చేయాలనుకుంటే అందుకోసం ఎంతో దూరాలను ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. వైజాగ్ నుంచి కేవలం మూడు గంటల్లోనే కొన్ని ఆలయాలకు వెళ్ళవచ్చు. ఈ ఆలయాలన్నీ స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందినవి. విశాఖపట్నం చుట్టూ తీర్థయాత్ర స్థలాలు, ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారి అయినా సందర్శించుకోవాలి.
శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం
వైజాగ్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాశీపట్నం. ఈ కాశీపట్నంలో 400 పురాతనమైన మర్రిచెట్టులో శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయం ఉంది. మర్రిచెట్టు ఆలయం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. స్థానిక కథనాలు చెబుతున్న ప్రకారం విజయనగర సామ్రాజ్యం పాలించిన రాజులు ఈ ఆలయాన్ని పోషించే వారని చెబుతారు. శతాబ్దాలుగా ఈ గుడిని ఎంతోమంది మరచిపోయారు. 1930లలో మళ్లీ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. నాగుల చవితి, కార్తీకమాసం, మహాశివరాత్రి వస్తే ఈ ఆలయాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులు వస్తారు.
శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం
విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాంత గ్రామ దేవతగా ఆమెను చెప్పుకుంటారు. స్థానిక పురాణాల ప్రకారం విజయనగర సామ్రాజ్య రాజు సొంత సోదరి ఈ పైడితల్లమ్మ అంటారు. యుద్ధంలో తన అన్న మరణించిన వార్త విని ఆమె చెరువులో పడి మరణించిందని చెబుతారు. ఆమె ఆత్మ ఒక విగ్రహంలో చేరుకుందని అంటారు. చనిపోయే ముందే ఆ విగ్రహం ఎక్కడ ఉందో కూడా చెప్పి ఆమె మరణించిందని అంటారు. విజయ దశమి తర్వాత వచ్చిన మొదటి మంగళవారం ఆ విగ్రహం బయటపడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా అదే రోజు పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించారు.
కుమిలి
వైజాగ్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుమిలి ప్రాంతం. అదే విజయనగరం నుండి అయితే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అందంగా చిక్కిన దేవాలయాలు 13 ఒకే చోట ఉంటాయి. దీనిపై అద్భుతమైన గోడ చిత్రాలు, శిల్పాలు, విగ్రహాలు కనిపిస్తాయి. విజయనగర రాజ్యకాలం నాటి మట్టి కోటల అవశేషాలు కూడా కనిపిస్తాయి. ఆధ్యాత్మిక చారిత్రక సంపదలను చూడాలనుకుంటే మీరు ఈ ప్రాంతాన్ని దర్శించాల్సిందే.
రామ తీర్థాలు
వైజాగ్ నుండి 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రామతీర్థం. ఈ రామతీర్థం పై ఉన్న ఆలయం 1000 సంవత్సరాల నాటిదని చెప్పుకుంటారు. పూర్తిగా రాతితో చెక్కబడినది జైన బౌద్ధ అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. దక్షిణ కొండా అని పిలిచే రాతిపై రామాలయం ఉండగా.. దుర్గ కొండ అని పిలిచే ఉత్తర కొండపై దుర్గాదేవి గుహ మందిరం ఉంటుంది. అలాగే ఇక్కడ 19 అడుగుల ఎత్తు 65 మీటర్ల వ్యాసం కలిగిన భారీ బౌద్ధ మహాస్తూపం శిథిలాలు కూడా కనిపిస్తాయి. ఒకప్పుడు బౌద్ధులు ఈ ప్రాంతంలో నివసించారని చెప్పడానికి ఇదే పెద్ద సాక్ష్యాలు.