Kissik Talks:భావన లాస్య..మల్లి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఈ అందాల భామ తాజాగా బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో ఈ వారం గెస్ట్ గా పలకరించింది .ఈ సందర్భంగా ప్రేమ పై, అమ్మాయిల ఆర్ధిక స్వాతంత్ర్యం పై,అలాగే తన తల్లిదండ్రుల గురించి ఇలా ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది.
ప్రేమ విషయంలో లాస్య ఆలోచనలు
ప్రేమ, రిలేషన్షిప్స్ గురించి కూడా లాస్య తన అభిప్రాయాలను పంచుకుంది.ఒక అమ్మాయి తనకు నచ్చిన కెరీర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టింది. ప్రేమ పేరుతో కెరీర్ విషయంలో ఆంక్షలు పెట్టే అబ్బాయిలను ఎంత మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు అంటూ స్పష్టం చేసింది.
ఒక అమ్మాయి ఏ రంగంలో ఎదగాలనుకున్నా ఆమెకు అండగా నిలబడి ప్రోత్సహించే వ్యక్తి ఉండాలని అభిప్రాయపడింది. అమ్మాయి తనకంటే ఎక్కువగా ఎదుగుతుందనే భయంతో కొంతమంది అబ్బాయిలు ఇన్ సెక్యూర్ గా అవుతుంటారని అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం ఏ మాత్రం సరైనది కాదని తెలిపింది.
ప్రతి అమ్మాయి ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని, తన కాళ్లపై తాను నిలబడాలని సూచించింది.మనం సంపాదించే డబ్బు వల్ల మనకు ఒక గుర్తింపు, మన మాటకు విలువ వస్తాయని తన ఆలోచనని పంచుకుంది. చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటున్నారనే దానికంటే మన లక్ష్యంపై దృష్టి పెట్టాలని, మిగతా విషయాలను నాయిస్లా పక్కన పెట్టాలని వివరించింది ఈ ముద్దుగుమ్మ.
నాన్న ఆరోగ్యంగా ఉండాలి.. అదే నా కోరిక!
ఇక తన జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉందా అని అడగ్గా.. తండ్రి ఆరోగ్యం బాగుండాలని, ఆయనకు మంచి ఆయుష్షు ఉండాలని కోరుకుంటానని చెప్పింది లాస్య. తాను ఎక్కడైనా దేవాలయానికి వెళ్లినా తనకు ఇది కావాలి, అది కావాలి అని ప్రత్యేకంగా అడగనని తెలిపారు. తనకు, తన కుటుంబానికి ఎప్పుడూ మంచే జరగాలని దేవుడిని కోరుకుంటానని వెల్లడించింది.
అలాగే తండ్రి ప్రేమకు దూరంగా ఉన్న అమ్మాయిల గురించి కూడా మాట్లాడుతూ అలాంటి వారు తమకు అండగా నిలిచే మంచి వ్యక్తులను నమ్మాలని, తమ మనసులోని విషయాలను వారితో పంచుకోవాలని సూచించింది.
నాకు నచ్చిన గుణం అదే..
తనలో తనకు బాగా నచ్చే లక్షణం ఏంటని అడిగగా .. తన దయగల మనస్తత్వం అని ఎవరైనా సహాయం అడిగితే వీలైనంత వరకు వెనకడుగు వేయకుండా సాయం చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. ఈ ప్రపంచంలో ఇప్పటికే చాలామంది ఎన్నో సమస్యలు, బాధలు ఎదుర్కొంటున్నారని.. అలాంటప్పుడు మనం కనీసం ఐదు నిమిషాలైనా ఇతరులతో ప్రేమగా మాట్లాడాలని చెప్పింది.
షాప్‌లో పనిచేసే వ్యక్తి దగ్గర నుంచి మనకు సహాయం చేసే వారి వరకు అందరితో మర్యాదగా మాట్లాడాలని మనం ఇతరుల పట్ల ఎంత దయగా ఉంటామో, అంతే ప్రేమ తిరిగి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొన్నిసార్లు సహాయం చేసినా మోసపోయే పరిస్థితులు వస్తాయని, కానీ ఎదుటివారి స్వభావాన్ని మనం మార్చలేమని.. మన మంచితనాన్ని మాత్రం వదులుకోకూడదని హితవు పలికింది.
అమ్మానాన్నలకు సమయం కేటాయించలేకపోతున్నా!
ఇక తన తల్లిదండ్రులకు ఒక విషయం చెప్పాలంటే క్షమాపణ చెబుతానని ఎమోషనల్ అయిపొయింది.పని కారణంగా వారితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని, షూటింగ్స్ కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో దీపావళి, సంక్రాంతి వంటి పండుగలను కూడా కొన్నిసార్లు కుటుంబంతో కలిసి జరుపుకోలేకపోతున్నానని వాపోయింది.
ముఖ్యంగా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేని సమయంలో వారి పక్కన ఉండాలని అనుకున్నా షూటింగ్స్‌లో ఉండటం వల్ల కొన్నిసార్లు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి వస్తుందని బాధపడిపోయింది. అలాంటి సందర్భాల్లో అమ్మానాన్నలకు తోడుగాఉండలేకపోతున్నందుకు బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.
రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక థ్యాంక్స్!
ఇక తన కెరీర్లో మంచి అవకాశాలు రావడానికి ఎంతోమంది సహకరించారని ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో రెండు ప్రాజెక్టులు చేసినట్లు చెప్పింది. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, తనను ఎంతో ఆప్యాయంగా చిక్కీ అని పిలుస్తారని గుర్తు చేసుకుంది. ఆయనతో పనిచేసిన తర్వాత తనకు మరిన్ని మంచి ప్రాజెక్టుల నుంచి అవకాశాలు రావడం మొదలైందని చెప్పింది.
అలాగే ఒక ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చినంత మాత్రాన ముందుగానే సంతోషపడకూడదని, ఆ ప్రాజెక్ట్ విడుదలైన తర్వాతే నిజమైన ఆనందాన్ని పొందాలని తన కెరీర్ అనుభవాల ద్వారా తెలుసుకున్నట్లు వివరించింది లాస్య. కొన్నిసార్లు మనం డేట్స్ బ్లాక్ చేసిన తర్వాత కూడా ఆ పాత్రకు మరొకరు సరిపోతారని భావించి వేరే ఆర్టిస్టులకు అవకాశం ఇస్తారని చెప్పారు. అందుకే ముందుగానే ఏదీ ఖరారైందని భావించకూడదని తెలిపింది.
రూ.50 లక్షలు వస్తే ఏం చేస్తానంటే
ఒకవేళ తనకు రూ.50 లక్షలు వస్తే ఏం చేస్తారని అడగ్గా.. ముందుగా అమ్మానాన్నలకు ఒక కారు కొనిస్తానని తన సంతోషం కంటే కుటుంబం ఆనందంగా ఉండటమే తనకు ముఖ్యమని తెలిపింది.
ఇక భూమి మొత్తం ఇంకో గంటలో అంతమవుతుందని తెలిస్తే ఏం చేస్తారని అడిగిన ప్రశ్నకు.. చివరి గంటను కుటుంబంతో గడుపుతానని, అందరితో కలిసి హాయిగా తింటూ పార్టీ చేసుకుంటానని సరదాగా సమాధానం ఇచ్చింది.