Bigg Boss Jhansi:ఝాన్సీ..అగ్నిపరీక్షద్వారా నెగ్గి బిగ్ బాస్ 10 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన జానపద గాయని ఝాన్సీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం మరియు కుటుంబం గురించి చెప్పిన పలు విషయాలు ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
తాను ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగానని చెప్పిన ఝాన్సీ, పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల శ్రమ మరియు రైతులు ఎదుర్కొనే కష్టాలు తనకు చిన్నతనం నుంచే దగ్గరగా తెలుసని తెలిపింది. సంగీతాన్ని ఎక్కడా ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా చిన్న వయసు నుంచే సహజంగా పాటలు పాడటం అలవాటైందని, పల్లెల్లో జరిగే రకరకాల కార్యక్రమాలు, జానపద పాటలు తనకు సంగీతం నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించింది.ముఖ్యంగా తను రైతు బిడ్డ కావడం వల్ల చిన్నప్పటి నుండే పొలాలలో పాటలు పాడటం వల్ల పాడటం అనేది బాగా అలవాటు అయిందని తెలిపింది.
ఒక్కరి సంపాదనపైనే మొత్తం కుటుంబం
ఇక తన కుటుంబ విషయాలు చెబుతూ ఎమోషనల్ అయింది ఝాన్సీ. తన తండ్రి ఇప్పటికీ ఎంతో కష్టపడుతుంటాడని ఒకవైపు పొలంలో వ్యవసాయం చేస్తూనే మరొకవైపు కేబుల్ ఆపరేటర్‌గా కూడా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని చెప్పుకొచ్చింది.
రైతు కుటుంబాలలో ఒక్కరి సంపాదనపైనే మొత్తం కుటుంబం ఆధారపడి జీవించాల్సి వస్తుందని, అందువల్ల ప్రతి రూపాయి వెనుక ఎంతో కష్టం ఉంటుందని మనసులోని మాటని బయటపెట్టింది.
ఇక ప్రస్తుతం తన చదువు పూర్తయిందని, ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని తెలిపింది. అయితే, ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధపడటం అంత తేలికైన విషయం కాదని, రోజుకు గంటల తరబడి చదవాల్సి రావడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతుంటానని చెప్పింది. ఇంట్లోనే ఉండి చదువుకోవడం వల్ల కొంత ఇబ్బందిగా అనిపిస్తుందని, బయటకు వచ్చి కొంత సమయం గడిపితేనే మళ్లీ ఉత్సాహం వస్తుందని తెలిపింది.
డబ్బు కోసం తమకు నచ్చిన పనులు
ఇక ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పాటను మాత్రం తన జీవితం నుంచి వేరు చేయలేనని ఝాన్సీ స్పష్టం చేసింది. పాట తనకి కేవలం గుర్తింపు తెచ్చుకోవడానికి లేదా డబ్బు సంపాదించడానికి సాధనం కాదని, అది తన జీవితంలో ఒక భాగమని తెలిపింది. చాలామంది పేరు లేదా డబ్బు కోసం తమకు నచ్చిన పనులు చేస్తుంటారని, కానీ తాను పాట పాడినప్పుడు లభించే ఆనందం మరియు తృప్తి దేనితోనూ పోల్చలేనని చెప్పుకొచ్చింది.
ఇక వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఒక పంటను పండించడం వెనుక రైతు పడే కష్టం అంతా ఇంతా కాదని, విత్తనాలు సిద్ధం చేయడం, పొలాన్ని దున్నడం, నీరు అందించడం, ఎరువులు వేయడం మరియు తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవడం వరకు అన్ని రకాలుగా పంటని కాపాడుకోవడంలో ప్రతీ రోజు రైతు కష్టపడాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఎంతో మందికి స్పూర్తిదాయకం
ఇక వానలు సరిగ్గా పడకపోతే రైతుల బాధ అంతా ఇంతా కాదని,వానలు ఎక్కువ పడ్డా, తక్కువ పడ్డా నష్టపోయేది రైతేనని, పెట్టుబడి పెట్టడమే కాని అది లాభం వస్తుందా, లేక నష్టం వస్తుందా తెలీని పరిస్థితులలో రైతు ఉన్నాడని తన బాధని వ్యక్తం చేసింది.ఎన్ని కష్టాలు పడైనా దేశానికి రైతే అన్నం పెడతాడని సగర్వంగా చెప్పింది.ఇక వ్యవసాయం అంటే కేవలం మగవారు మాత్రమే కాదని,ఆడవారు కూడా చేయగలరని తేల్చి చెప్పింది.ఎన్ని పనులు ఉన్నా పొలానికి పోకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందని ,ఒకరకంగా వ్యవసాయం అంటే వ్యసనం అని తెలిపింది.
ALSO READ:ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ స్టోరీ ఇదేనా?
మొత్తానికి బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని గెలిచిన జానపద గాయని ఝాన్సీ జర్నీ ఇపుడు ఎంతో మందికి స్పూర్తిదాయకం అవుతుంది.