Shobhita Passes Away: ప్రముఖ కన్నడ నటి శోభిత శివన్న (Shobhita Shivanna) నిన్న హైదరాబాదులోని గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలనీలోని సి బ్లాక్ లో తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన జరిగి ఒక రోజు అవుతున్నా.. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇకపోతే కూతురు మరణ వార్త విన్న కుటుంబ సభ్యుల హుటాహుటిన హైదరాబాద్ కి చేరుకున్నట్లు వార్తలు రాగా.. ఆమె మృతదేహాన్ని హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారట. అనంతరం బెంగళూరుకి తీసుకొచ్చారని సమాచారం. ఇకపోతే 2023లో వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన శోభిత, సడన్గా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కన్నడ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం.
ఇదిలా ఉండగా తాజాగా ఆమె నివాసంలో ఒక సూసైడ్ నోట్ లభ్యం అయింది. ఆమె మృతదేహాన్ని హ్యాండోవర్ చేసుకున్న తర్వాత, ఆమె నివాసంలో తనిఖీ చేయగా వారికక్కడ సూసైడ్ నోట్ లభ్యం అయినట్లు తెలిసింది. ఇక ఆ నోట్ ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే ఆ సూసైడ్ నోట్ లో ఏముంది అనే విషయానికి వస్తే..” ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే చేసుకో” అని మాత్రమే రాసి ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇది ఎవరిని ఉద్దేశించి శోభిత ఈ సూసైడ్ నోట్ లో ఈ లైన్ రాసింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే..?
ఇదిలా ఉండగా.. గచ్చిబౌలి పోలీసులు ఆమె భర్త సుధీర్ రెడ్డి (Sudheer Reddy) వాంగ్మూలంతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈమె భర్త సుదీర్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. సుధీర్ తన వాంగ్మూలంలో..సూసైడ్ చేసుకునే ముందు రాత్రి ఏం జరిగిందనే విషయం గురించి మాట్లాడుతూ.. శనివారం రాత్రి నేను, శోభిత కలిసి భోజనం చేశాము. శోభిత ఒక బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయిది. నేను నా ఆఫీసు వర్క్ కారణంగా ఇంకో బెడ్ రూమ్ లోకి వెళ్లి పనిచేసుకొని, అలాగే నిద్రపోయాను. అయితే ఆదివారం ఉదయం పనిమనిషి వచ్చి డోర్ కొట్టినా శోభిత తీయకపోవడంతో అనుమానం వచ్చి నేను బెడ్ రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ శోభిత ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని కనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యారు సుధీర్ రెడ్డి.
ఆత్మహత్యకు గల కారణం ఏంటి..?
శోభిత ఆత్మహత్య చేసుకోవడానికి స్పష్టమైన కారణాన్ని ఆమె భర్తతో పాటు పోలీసులు కూడా చెప్పలేకపోతున్నారు. పలు కన్నడ సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించిన శోభిత కి ఏడాదిన్నర క్రితమే మ్యాట్రిమోనీ ద్వారా సుదీర్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు ఇష్టపడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇక సంతోషంగా జీవిస్తున్న వీరిద్దరి జీవితంలో అనూహ్య పరిణామాలు ఏవైనా చోటు చేసుకున్నాయా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.