Boycott Pushpa 2 : దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ ఇప్పుడు తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ట్రెండింగ్ లో బాయ్ కాట్ ‘పుష్ప 2 (Pushpa 2)’ కనిపించడం అల్లు అభిమానులకు షాకింగ్ గా మారింది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ మూవీ టికెట్లు రేట్లతో సంబంధం లేకుండా హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్పరాజ్ కు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మరోవైపు బెనిఫిట్ షోలు తీసుకోవడానికి మెగా అభిమానులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ చాలావన్నట్టు ఇప్పుడు తాజాగా ట్రెండింగ్లో ‘బాయ్ కాట్ పుష్ప 2’ కనిపించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ నేపథ్యంలోనే ఇలా ‘పుష్ప 2’ను బ్యాన్ చేయాలనే డిమాండ్ కు కారణం ఇతర హీరోల అభిమానులా? లేదా టికెట్ ధరలా ? అనే చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయంలోకి వెళ్తే… గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ (Allu Arjun) కు పడట్లేదు అనే రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల కాలంలో జరిగిన పరిస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మెగా అభిమానులు ‘పుష్ప 2’ మూవీకి సపోర్ట్ చేయడం మానేసి, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కనీసం ఈ సినిమా టికెట్స్ కొనడానికి కూడా మెగా ఫ్యాన్స్ ఆసక్తిని చూపించట్లేదు అని తెలుస్తోంది. అల్లు అర్జున్ పట్ల మెగా ఫ్యాన్స్ ఎంత కోపంగా ఉన్నారో ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది.
అయితే మెగా ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి ఇప్పటికే ‘పుష్ప 2’ (Pushpa 2) మేకర్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ తో చర్చలు జరిపారని టాక్ నడిచింది. కానీ అవేమీ ఫలించలేదని గుసగుసలు విన్పిస్తున్నాయి. ఏదేమైనా సరే ‘ పుష్ప 2’కి సపోర్ట్ చేసేది లేదంటూ మెగా ఫ్యాన్స్ తేల్చి చెప్పారని అంటున్నారు. ఒక్క చిరంజీవి తప్ప ఎవరు చెప్పినా వినేలా లేదట సిచువేషన్. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ నిర్మాతలు ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని కలిసి, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆహ్వానించబోతున్నారు. ఓవైపు చిరంజీవి ఒప్పుకుంటారా? అనే ఆసక్తి నెలకొన్న తరుణంలో, మరోవైపు ఇలా ‘బాయ్ కాట్ పుష్ప 2’ ట్రెండింగ్ లోకి రావడం చర్చకు దారి తీసింది.
ఇక ఈ సినిమా టికెట్ రేట్ల విషయానికి వస్తే… డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల టైంలో బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షోకు అనుమతులు వచ్చేసాయి. అంతేకాకుండా బెనిఫిట్ షో టికెట్ రేట్లు సింగిల్ స్క్రీన్ లో 1000 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 1200 పైగా ఉండడంతో అభిమానులపై భారం పడింది.