Maharashtra News : కడుపులని బిడ్డకు ఆరోగ్యంగా ఉందా?, ఎదుగుదల ఎలా ఉంది అనేది తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు షాకింగ్ వార్త తెలిసింది. తన కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కడుపులో మరో బిడ్డ ఉందని తెలిసి నివ్వెరపోయింది. అవును మీరు వింటుంది నిజమే.. మహారాష్ట్రలో (Maharashtra) జరిగిన ఈ ఘటన తెలిసిన వాళ్లంతా మీలా నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అని ఆశ్చర్య పడుతున్నారు. కానీ.. ఇది నిజమే అని వైద్యులు నిర్ధరించడంతో.. అంతా ఈ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ (32) మరికొన్ని వారాల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. తన కడుపులో ఉన్న బిడ్డ.. మరికొద్ది రోజుల్లోనే ఒడిలోకి వస్తుందని మురిసిపోతుంది. ఆ ఆనందంతోనే బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యుల సలహా కోసం మహారాష్ట్రలోని బుల్ధానా(Buldhana district ) జిల్లా ఆసుపత్రికి వెళ్లింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమె కడుపులోని శిశువులో మరో బిడ్డ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బయటకు రావడంతో.. ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది.
మహిళకు బుల్ధానా జిల్లా ఆసుపత్రిలో సోనోగ్రఫీ పరీక్ష నిర్వహించారు. అందులో ఈ అరుదైన జన్యు సంబంధ విషయం వెలుగు చూసింది. ఈ విషయమై ఆసుపత్రిలోని ప్రసూతి, స్త్రీ జననేంద్రియ నిపుణుడు డా. ప్రసాద్ అగర్వాల్ స్పందించారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని తెలిపిన ఆయన.. దీనిని ‘ఫిట్ ఇన్ ఫీటూ’ (fetus in fetu)గా పిలుస్తారని, ఐదు లక్షల మందిలో ఒకరికి ఇలాంటి జన్యు సంబంధమైన మార్పుల కారణంగా పిండంలో మరో పెరుగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా కేవలం 200 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. వాటిలోనూ చాలా వరకు ప్రసవం తర్వాతే గుర్తించినట్లు తెలిపారు. భారత్ లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు 10-15 లోపే నమోదయ్యాయని అన్నారు.
Also Read : రాష్ట్రానికి రెండో రాజధానిని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. పరిపాలన ఎక్కడి నుంచంటే..
ఈ కేసులో తాము ముందుగానే పిండం అభివృద్ధిలోని అసాధారణ పరిస్థితిని గమనించినట్లు తెలిపారు. మహిళ ప్రస్తుతం 35 వారాల గర్భవతి అని, మరో వారం, రెండు వారాల్లోనే డెలివరీకి అవకాశం ఉందని వెల్లడించారు. గర్భస్థ శిశువు పొత్తికడుపులో మరో పిండం తాలుకు ఎముకల పెరుగుదల కనిపిస్తుందని అన్నారు.
అయితే ప్రస్తుతానికి ఆమెకు, ఆమె గర్భంలోని శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపిన వైద్యులు.. సురక్షిత ప్రసవం కోసం అత్యాధునిక వైద్య సౌకర్యాలున్న ఛత్రపతి శంభాజీనగర్(Chhatrapati Sambhajinagar) లోని వైద్యశాలకు రిఫర్ చేశారు.