CM Himanta Biswa : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని గౌహతిలో కాకుండా దిబ్రూఘర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి సాధారణంగా గౌహతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతుంటారు. కానీ ఈసారి తూర్పు అస్సాంలోని దిబ్రూఘర్‌లోని ఖనికర్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే.. అస్సాం ప్రజలకు రాష్ట్ర రాజధాని విషయమై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అస్సాంలోని కీలక నగరమైన దిబ్రూఘర్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే రెండో రాజధానిగా మార్చేందుకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టినట్లు వెల్లడించిన అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మ.. వచ్చే మూడేళ్లలో దిబ్రూఘర్ అస్సాం రెండో రాజధానిగా మారుతుందని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసగిస్తూ.. “అసోం రెండో రాజధానిగా అవతరించే దిబ్రూఘర్ ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ చారిత్రక నగరంలో తొలిసారిగా రాష్ట్ర వేడుకలు జరుగుతున్నాయి. దిబ్రూగఢ్‌లో ఓవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలు, మరోవైపు నూతన రాజధాని ప్రకటనతో ప్రత్యేకత సంతరించుకుంది” అని అన్నారు.
రాజధాని ఏర్పాటుకు కావాల్సిన చర్యలు చేపట్టినట్లు తెలిపిన అస్సాం సీఎం.. 2027 నాటికి దిబ్రూగఢ్ లో అసెంబ్లీ కాంప్లెక్స్ సిద్ధమవుతుందని ప్రకటించారు. అప్పటి నుంచి ఏటా కనీసం ఒకసారైనా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్కడ నుంచే జరుగుతాయన్నారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి అస్సాం అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని.. రానున్న మూడేళ్లలో దిబ్రూఘర్ భారత్ లోనే ఒక ముఖ్యమైన నగరంగా అవతరించనుందని ప్రకటించారు.
Our announcement to upgrade Dibrugarh as a full fledged city and transform it as Assam's second capital is backed by solid ground work to ensure Ease of Living and connectivity.
Laid foundation stones of 4 flyovers spanning 4.4km worth ₹377cr in the city a while back. pic.twitter.com/5ctUsK5VIf
— Himanta Biswa Sarma (@himantabiswa) January 26, 2025
అంతకు ముందు ట్విటర్ లో రిపబ్లిక్ డే వేడుకల చిత్రాలను షేర్ చేస్తూ దిబ్రూఘర్‌లో రిపబ్లిక్‌డే వేడుకలను విజయవంతంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అస్సాం ఇప్పుడు పెట్టుబడిదారులకు, పర్యాటకులు, సందర్శకులు, పౌరులకు సురక్షితమైన రాష్ట్రమని ప్రకటించారు. దిబ్రూఘర్, తేజ్‌పూర్, సిల్చార్‌లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్న సీఎం హిమంత బిస్వా శర్మ.. ఈ మూడు పట్టణాలను రాష్ట్ర ప్రభుత్వం నగరాలుగా అభివృద్ధి చేస్తుందని అన్నారు.
రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా తేజ్‌పూర్‌ను అభివృద్ధి చేస్తామని, చారిత్రాత్మక పట్టణంలో రాజ్‌భవన్‌ను నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. అంతే కాకుండా.. బరాక్ వ్యాలీ పట్టణం సిల్చార్‌లో మినీ సెక్రటేరియట్ & చీఫ్ సెక్రటరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దిబ్రూఘర్ మొట్టమొదటిసారిగా సెంట్రల్ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడానికి సిద్ధంగా ఉందని, గణతంత్ర స్ఫూర్తిని జరుపుకోవడానికి పట్టణం అంతా త్రివర్ణాలతో అలంకరణ అయ్యిందన్నారు. మిలిటెన్సీ ప్రభావం నుంచి ఇప్పుడు పూర్తి స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం వరకు, అస్సాం శాంతి విషయంలో చాలా మెరుగైందని అన్నారు.
Also Read : జనవరి 26, ఆగష్ట్ 15 మధ్య తేడాలు తెలుసా.. ఏడాదికి రెండు సార్లు జెండా పండుగ ఎందుకు..
దిబ్రూగఢ్‌లో ఇప్పటికే ముఖ్యమంత్రి సచివాలయం ఏర్పాటు చేయగా, తూర్పు అస్సాం పట్టణంలోని కార్యాలయంలో ప్రతి నెలా 4 రోజులు గడుపుతానని సీఎం ప్రకటించారు. ఈ నిర్ణయం దిబ్రూఘర్ చుట్టుపక్కల ఉన్న 9 జిల్లాల ప్రజలు సౌకర్యవంతంగా, ఉన్నత పరిపాలనను అందుకునేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు. కాగా.. గణతంత్ర వేడుకలకు నెల రోజుల ముందుగానే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు.