Plane Crash Victim Story| అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి విషాద గాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతీ ఒక్కరి కథ వింటే గుండె బరువెక్కిపోతుంది. తాజాగా అలాంటి మరొక బాధితురాలి కథ మీడియా కథనాల్లో వచ్చింది. అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనంపై దాని పరిసరాల్లో పడింది. ఆకాశంలో నుంచి విమానం పడడంతో కింద ఉన్న నిర్మాణాలు ఆ పేలుడుకు ధ్వంసమయ్యాయి.
ఈ క్రమంలోనే హాస్టల్ సమీపంలో ఉన్న టీ స్టాల్ పై కూడా విమాన భాగాలు పడ్డాయి. ఆ టీ స్టాల్ నడుపుతూ సీతాబెన్ అనే మహిళ, ఆమె కుటుంబం జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ టీ స్టాల్‌లో నిద్రిస్తున్న సీతాబెన్ కుమారుడు.. 14 ఏళ్ల బాలుడు ఆకాశ్ పట్నీ దుర్మరణం చెందాడు. ఆకాశ్ తల్లి సీతాబెన్ ఈ ప్రమాదంలో బతికినప్పటికీ.. కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే బీజే వైద్య కళాశాల హాస్టల్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం మంటల్లో చిక్కుకుంది. ఆకాశ్ టీ స్టాల్ వద్ద నిద్రిస్తుండగా, మంటలు మరియు శిథిలాలు అతనిని చుట్టుముట్టాయి. సీతాబెన్ తన కొడుకును కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, విఫలమైంది. ఆమెకు కాలిన గాయాలతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందుతోంది.
సీతాబెన్ మాట్లాడుతూ.. “నేను విమానాన్ని చూడలేదు, కానీ ఒక భారీ శబ్దం విన్నాను. నల్లని పొగ ఆవరించింది. మా టీ స్టాల్ వెనుక విమానం కూలిపోయింది. మంటలు ఎగిసిపడ్డాయి. ఏమీ కనిపించలేదు. నా కొడుకు షాపులో నిద్రిస్తుండగా మరణించాడు,” అని వాపోయింది.
ఆకాశ్ తండ్రి సురేష్ కుమార్ కూడా ఈ దుర్ఘటనలో బతికాడు. అతను ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. “నేను, నా కొడుకు ఇంట్లో ఉన్నాం. నా భార్య టీ స్టాల్ వద్ద ఉంది. ఆకాశ్ తన తల్లికి భోజనం ఇవ్వడానికి వెళ్లాడు. అక్కడ తన తల్లి చేతుల మీదుగా చివరిసారిగా భోజనం తిని.. షాపులో నిద్రపోయాడు. అకస్మాత్తుగా విమానం కూలిపోయి. మా షాపు సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ అగ్నీ జ్వాలలు మా షాపుని కూడా తాకాయి. ఈ ప్రమాదంలో నా భార్య బతికింది, ఆమె ఆసుపత్రిలో ఉంది. ఆకాశ్ కోసం వెతికినప్పుడు.. ఆసుపత్రి అధికారులు అతని మృతదేహం మార్చురీలో ఉందని తెలిపారు. ” అని పట్టరాని దు:ఖంతో చెప్పాడు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
ఈ విమానం.. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ 242 మందితో (230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సభ్యులు) లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరడానికి టేకాఫ్ అయింది. గురువారం మధ్యాహ్నం 1:39 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకుని, వేగంగా కిందకు దిగి బీజే వైద్య కళాశాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 265 మంది మరణించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు. ఒక భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు మాత్రమే బతికాడు, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read: విమాన ప్రమాదంలో అంతా నాశనం.. భగవద్గీత మాత్రం చెక్కుచెదరలేదు
ఈ దుర్ఘటన గత దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 2011లో వాణిజ్య సేవలు ప్రారంభించిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు ఇది మొదటి అత్యంత భయానక ప్రమాదం.
విమాన ప్రమాదం కారణాలు తెలుసుకునేందుకు.. ఇంధనం, ఇంజన్, హైడ్రాలిక్ వ్యవస్థల పర్యవేక్షణతో సహా అధునాతన తనిఖీలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశించింది.