Case Against Rahul Gandhi: బీహార్ లో ఓ వింత కేసు నమోదయ్యింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మీద ఓ వ్యక్తి కేసు వేశాడు. రాహుల్ వ్యాఖ్యలతో తన చేతిలోని పాల క్యాన్ పడిపోయిందని కోర్టును ఆశ్రయించాడు. తనకు రూ. 250 నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ పై కేసు నమోదు చేయడంతో పాటు తనకు నష్టపరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం ఈ కేసు బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇదేం కేసురా బాబూ అంటూ అందరూ నవ్వుకుంటున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ నెల 15న న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి సంస్థను ఈ రెండూ కలిసి నాశనం చేశాయని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు భారతదేశంతో పోరాడుతున్నామని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ మాటలను టీవీలో విన్న తాను ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని బీహార్ లోని సోనుపూర్ కు చెందిన వ్యక్తి ముఖేష్ చౌదరీ వెల్లడించారు. ఆ షాక్ లో తన చేతిలో ఉన్న ఐదు లీటర్ల పాల క్యాన్ పడిపోయిందన్నారు. ఆయన వ్యాఖ్యలు దేశానికే తీవ్ర నష్టాన్ని కలించేలా ఉన్నాయన్నారు. అంతేకాదు, రాహుల్ వ్యాఖ్యల కారణంగా తాను రూ. 250 నష్టపోవాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలంటూ రోసెరా సబ్ డివిజన్ లోని సివిల్ కోర్టులో కేసు వేశారు. అయితే, పిటిషన్ మీద న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
రాహుల్ పై అసోం లోనూ కేసు నమోదు
అటు రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై అసోం లోనూ ఓ కేసు నమోదు అయ్యింది. ఆయన వ్యాఖ్యలు దేశంలో అశాంతిని, వేర్పాటువాద భావాలను పెంచేలా ఉన్నాయని అసోం నాయకుడు మోంజిత్ చెటియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఊరట
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన పరువు నష్టం కేసుకు సంబంధించి సుప్రీంలో కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఝార్ఖండ్ ట్రయల్ కోర్టు విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గౌరవానికి భంగం కలిగించేలా రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారంటూ బీజేపీ నాయకుడు నవీన్ ఝా పరువు నష్టం కేసు వేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణను రద్దు చేయాలంటూ రాహుల్ ఝార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ, ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
Read Also: వీడెవడో ‘మర్యాద రామన్న’ తమ్ముడిలా ఉన్నాడే.. ఇప్పుడా బోండాం నీళ్లు తాగేదెలా రా అబ్బాయ్?