Weightloss Luxury car| సాధారణంగా బిజినెస్ పెంచుకోవడానికి చాలా కంపెనీలు ప్రమోషన్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వాటిలో కొన్ని విచిత్రంగా ఉంటే మరి కొన్ని ఊహకందని షాకింగ్ ఆఫర్లుంటాయి. ఇలాంటి ఒక అనూహ్య బహుమతి ప్రకటించాడు ఒక జిమ్ ఓనర్. తన జిమ్ లో చేరిన వారు బాగా బరువు తగ్గితే వారికి రూ.1.3 కోట్లు విలువ చేసే లగ్జరీ కారు ఇస్తానని ప్రకటించాడు.
చైనా షాండాంగ్ ప్రావిన్స్‌లోని బింజౌ నగరంలో ఒక జిమ్ లో షాకింగ్ వెయిట్ లాస్ చాలెంజ్ ఆఫర్ ప్రకటన వెలువడింది. మూడు నెలల్లో 50 కిలోల బరువు తగ్గితే ఒక పోర్ష్ కారు బహుమతిగా ఇస్తామని చెప్పింది. ఆన్‌లైన్‌లో ఇటీవలే ఈ ప్రకటన వచ్చింది. విజేతకు పోర్ష్ పనామెరా కారు ఇస్తామని ఆ ప్రకటనలో వివరాలు ఉన్నాయి. చైనాలో దీని ధర సుమారు 11 లక్షల యువాన్‌లు (అంటే భారత్ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్లు).
ఈ పోటీలో పాల్గొనాలంటే.. ముందుగా రిజిస్ట్రేషన్‌కు 10,000 యువాన్‌లు (రూ. 1.2 లక్షలు) ఫీజు కట్టాలి. పోటీదారులకు భోజనం, షేర్డ్ గదులు ఉన్న ట్రైనింగ్ క్యాంప్ సౌకర్యం ఉంటుంది. వారంతా అక్కడే 3 నెలలు ఉండాలి. జిమ్ కోచ్ వాంగ్ అనే వ్యక్తి చెప్పినట్టు, 30 మంది మాత్రమే ఈ పోటీలో చేరవచ్చు. ఇప్పటికే 7-8 మంది రిజిస్టర్ అయ్యారు. బహుమతి కారు కొత్తది కాదు, 2020 మోడల్ యూజ్డ్ కారు. జిమ్ ఓనర్ సొంతం.
మరోవైపు ఈ పోటీ షరతుల గురించి తెలిసి డాక్టర్లు ఈ చాలెంజ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా బరువు తగ్గడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కండరాలు పోవడం, శరీరంలో పోషకాల కొరత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, గాల్‌స్టోన్స్, గుండెపై ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయని చెప్పారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీబోలో 35 లక్షల ఫాలోవర్స్ ఉన్న హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ “డాక్టర్ జెంగ్” అభిప్రాయం ప్రకారం.. పోటీ షరతుల్లో 50 కేజీలు 3 నెలల సమయంలో తగ్గాలి అని ఉంది. అంటే.. సగటున రోజుకు 0.5 కిలోలు తగ్గాలి. ఇది చాలా వేగంగా బరువు తగ్గినట్లు అవుతుంది. ఇలా చేస్తే.. సాధారణంగా కొవ్వు కాకుండా కండరాలు పోతాయి. హార్మోన్ల అసమతుల్యత, జుట్టు రాలడం, మహిళల్లో మెన్స్ట్రువల్ సమస్యలు వస్తాయి. సురక్షితంగా వారానికి 0.5 కిలోలు మాత్రమే తగ్గాలని సలహా ఇచ్చారు.
మరో డాక్టర్ పు యాన్‌సాంగ్ (షాంక్సీ ప్రావిన్స్ ఆస్పత్రి గ్యాస్ట్రో సర్జన్) చెప్పినట్టు.. ఇంత వేగంగా బరువు తగ్గితే అవయవాలపై ఒత్తిడి పడుతుంది. ప్రాణాంతకం కూడా కావచ్చు. శాస్త్రీయంగా నెమ్మదిగా తగ్గాలి. మెదడు, కొవ్వు, కండరాలు, అవయవాలు కొత్త ఎనర్జీ బ్యాలెన్స్‌కు అలవాటు పడేలా చూడాలి.
చైనా నెటిజన్లు ఈ చాలెంజ్‌పై తీవ్రస్థాయిలో డిబేట్ చేస్తున్నారు. అందులో ఒకరు జోక్ చేస్తూ.. “50 కిలోలు తగ్గితే నాకు 5 కిలోలు మిగులుతాయి. బతికే ఉంటానా?” మరొకరు చెప్పారు: “ఎవరూ సాధించలేరు. మూడు నెలల్లో 50 కిలోలు? బరువు తగ్గడం కాదు.. అసలు ఆ వ్యక్తి పోతాడు. 10,000 యువాన్ ఫీజుతో ఓనర్ కొత్త కారు కొనుగోలు చేస్తాడు. అతని పాత కారు కూడా ఎవరూ గెలవలేరు. అంటే లాభమంతా అతనిదే.. అబ్బ స్మార్ట్ మార్కెటింగ్!” అని చమత్కరిస్తూ.. నిజం వెల్లడించాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్ వైరల్ అవుతోంది. ఆకర్షణీయంగా కనిపించినా, ఆరోగ్యం ప్రమాదం ఎక్కువ. నిపుణులు నెమ్మదిగా, సురక్షితంగా బరువు తగ్గాలని సలహా ఇస్తున్నారు.
Also Read: జేబులో సరిపోయే ఫొటో ప్రింటర్.. షావోమీ కొత్త గాడ్జెట్ గురించి తెలుసా