పీరియడ్స్ అనేవి యువతులలో తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. స్కూల్ విద్యార్థుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కడుపునొప్పితో విలవిలాడిపోతారు. ఆ బాధ తోటి మహిళలకే తెలుస్తుంది. తాజాగా పీరియడ్స్ తో బాధపడుతున్న ఓ యువతి పట్ల స్కూల్ ప్రిన్స్ పల్ వ్యవహరించిన తీరు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. ప్రస్తుతం ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ మొదలు పెట్టారు.
శానిటరీ ప్యాడ్ అడిగిందని అమ్మాయికి శిక్ష
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో 11వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. బరేలీలోని ఓ పాఠశాలలో 11 తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్ష రాయడానికి వచ్చింది. ఎగ్జామ్ కు వస్తున్న సమయంలోనే ఆమెకు పీరియడ్స్ మొదలయ్యాయి. అయితే, అప్పటికే ఎగ్జామ్ టైమ్ దగ్గర పడటంతో అలాగే స్కూల్ కు వచ్చింది. స్కూల్ కు వచ్చిన అమ్మాయి ఎగ్జామ్ హాల్ లో కూర్చుంది. అయితే, బ్లీడింగ్ కావడంతో శానిటరీ ప్యాడ్ ఇప్పించాలని ప్రిన్సిపాల్ ను అడిగింది. సాధారణం ఆ పరిస్థితి ఎవరు ఉన్నా, తప్పకుండా సాయం చేస్తారు. కానీ, సదరు ప్రిన్సిపల్ ఆ అమ్మాయి మీద తన ప్రతాపం చూపించారు. దాదాపు రెండు గంటల పాటు బయట నిల్చోబెట్టారు.
బాధతో విలవిలలాడిన విద్యార్థి
ఓవైపు పీరయిడ్స్, మరో వైపు కాళ్లు, నడుము నొప్పితో అమ్మాయి విలవిల లాడింది. బ్లీడింగ్ మరకలు ఎక్కడ యూనిఫామ్ కు అంటుతాయోనని భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. తాను చేయని తప్పుకు రెండు గంటల పాటు బయట నిలబెట్టడంతో ఎంతో వేదన అనుభవించింది. ఈ ఘటన జనవరి 25న జరిగింది.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి
అటు తన కుమార్తె పట్ల కర్కశంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ మీద విద్యార్థి తండ్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పీరియడ్స్ తో బాధపడుతున్న తన కూతురు పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. తన కూతురు మానసికంగా ఎంతగా కుమిలిపోయి ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రిన్సిపాల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి ఉన్నతాధికారులను కోరారు. అటు జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), మహిళా సంక్షేమ శాఖ, రాష్ట్ర మహిళా కమిషన్ కు సైతం విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనసై స్పందించిన జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్‌కి నందన్.. ప్రస్తుతం ఈఘటనపై దర్యాప్తు జరుగుతుందన్నారు. విచారణ తర్వాత సదరు ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న విద్యాశాఖ
అటు గత సంవత్సరం.. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల సమయంలో బాలికలకు అవసరమైన రెస్ట్ రూమ్ బ్రేక్ ఇవ్వాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది. అన్ని పరీక్షా కేంద్రాలలో ఉచిత శానిటరీ న్యాప్ కిన్లను అందుబాటులో ఉంచాలన్నది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని పాఠశాలలతో పాటు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), నవోదయ విద్యాలయ సమితి (NVS), కేంద్రీయ విద్యాలయ సంగథన్ (KVS) పాఠశాలలకు ఈ గైడ్ లైన్స్ వర్తిస్తాయని వెల్లడించింది.
Read Also: ఇష్టం లేని పెళ్లి.. వరుడికి చుక్కలు చూపించిన వధువు, నెట్టింట వీడియో వైరల్!