జర్మనీలోని అరాచ్ అనే నది ఒడ్డున ఒక అందమైన గ్రామం ఉండేది. దాని పేరు హెర్జోజెనౌరౌజ్. ఆ గ్రామంలోనే ఇద్దరు అన్నదమ్ములు పుట్టారు. వారిని డాస్లర్ సోదరులు అని పిలుచుకుంటారు. వారి పేర్లు రుడాల్ఫ్ డాస్లర్, అడాల్ఫ్ డాస్లర్. వీరిద్దరూ ఒకే తల్లికి జన్మించినా కూడా బద్ధ శత్రువుల్లా తయారయ్యారు.
పుట్టుకతోనే ఎవరికీ శత్రువులు మిత్రులు ఉండరు. పెద్దయ్యాక వారి ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు కలవనప్పుడే శత్రుత్వం ఏర్పడుతుంది. 1940 చివరి వరకు ఇద్దరు అన్నదమ్ములు కలిసి పని చేశారు. కానీ ఏం జరిగిందో తెలియదు… ఇద్దరి మధ్య తీవ్రమైన కోపతాపాలు ప్రారంభమయ్యాయి. ఇద్దరు సోదరులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
డాస్లర్ సోదరుల్లో అన్నయ్య రుడాల్ఫ్ 1898లో జన్మించాడు. ఇక తమ్ముడు అడాల్ఫ్ రెండేళ్ల చిన్నవాడు. అతడు 1900లో జన్మించాడు. అందరూ ఆడి అని పిలుస్తారు.
వీరి తండ్రి క్రిస్టోఫ్ డాస్లర్. ఒక షూ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. దీనితో వారికి షూ తయారీ పై మంచిపట్టు లభించింది. తండ్రి ప్రేరణతో ఇద్దరు షూ వ్యాపారంలోకి ప్రవేశించారని చెప్పుకుంటారు. అయితే వారి తండ్రి మాత్రం అన్నదమ్ముల్లో ఒకరు బేకర్, మరొకరు పోలీసుగా మారాలని కోరుకున్నాడు. కానీ అన్నదమ్ములు ఇద్దరు బూట్ల తయారీలోకే అడుగు పెట్టారు.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో సైన్యంలో చేరాడు అడాల్ఫ్. అతన్ని యూరప్ లో యుద్ధానికి పంపించారు. ఆ యుద్ధం తర్వాత ఇంటికి వచ్చిన అడాల్ఫ్ ఇంట్లోనే చిన్న షూ ఫ్యాక్టరీని స్థాపించాడు. యుద్ధం తర్వాత జర్మనీలో తీవ్ర ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. దీంతో షూ తయారీకి కావలసిన ముడి పదార్థాలు కొనలేని పరిస్థితి వచ్చింది. దాంతో గ్రామంలో పడేసిన సైనికుల హెల్మెట్లు, నీటి సంచులు, తెగిపోయిన బూట్లు ఏరి వాటితోనే తయారు చేయడం ప్రారంభించాడు.
అన్న బాటలోనే
రుడాల్ఫ్ కు కూడా అన్న చేస్తున్న పని నచ్చింది. దీంతో తమ్ముడు అడాల్ఫ్ తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. ఇద్దరూ కలిసి గేబ్రూడార్ డాస్లర్ షూ ఫ్యాబ్రిక్ అనే కంపెనీని స్థాపించారు. ఇందులో అడాల్ఫ్ షూ తయారీని చూసుకుంటే.. రుడాల్ఫ్ అమ్మకాలు, మార్కెటింగ్, ప్రమోషన్ల బాధ్యతను తీసుకున్నాడు.
ఒలింపిక్ క్రీడల్లో వీరి షూ…
అలా వీరిద్దరి వ్యాపారం పట్టాలెక్కింది. ఫుట్ బాల్ షూ షూలను కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. షూ అడుగు భాగంలో స్పైకులతో కూడిన స్టడ్ లు, ట్రాక్ షూలు కూడా తయారు చేశారు. రోజుకు 50 జతల షూలను ఉత్పత్తి చేసేవారు. 1928లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో ఎక్కువ మంది క్రీడాకారులు డాస్లర్ కంపెనీ షూ లనే వాడారు. దీంతో వారి మొదటి విజయం నమోదయింది. ఆ తర్వాత 1932లో, 1936లో జరిగిన ఒలింపిక్స్ లో కూడా ఈ అన్నదమ్ముల షూలనే వాడేందుకు ఇష్టపడ్డారు క్రీడాకారులు.
ఈ లోపు రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధానికి రుడాల్ఫ్ వెళ్ళవలసి వచ్చింది. దీంతో అడాల్ఫ్ మాత్రమే కంపెనీని నడిపించాడు. ఆ యుద్ధం ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరాయి. ఇద్దరు సోదరులు తమ భార్యలు పిల్లలతో ఒకే ఇంట్లో నివసించినా కూడా ప్రతిరోజు గొడవలు అయ్యేవి.
ఎందుకు విడిపోయారు?
కొందరు చెబుతున్న ప్రకారం యుద్ధ సమయంలో బాంబు దాడి నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు సోదరుల కుటుంబాలు ఒకే బాంబు షెల్టర్ లో ఆశ్రయం పొందాయి. ఆ సమయంలో అడాల్ఫ్ కొన్ని రకాల మాటలతో రుడాల్ఫ్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడని చెప్పుకుంటారు. దానివల్ల ఇద్దరూ విడిపోయే పరిస్థితికి వచ్చిందని అంటారు.
అడిదాస్, పుమా పుట్టాయిలా..
అన్నదమ్ముల మధ్య గొడవలు ఎక్కువ అవడంతో కంపెనీని కూడా పంచుకున్నారు. కొంతకాలం తర్వాత అడాల్ఫ్ అడిదాస్ ను స్థాపించాడు. ఆ కొత్త పేరుతోనే బూట్లను ఉత్పత్తి చేయసాగాడు. ఇక రుడాల్ఫ్ రుడా అనే కంపెనీని స్థాపించాడు. తర్వాత దాన్ని ఫ్యూమా అనే పేరు మార్చాడు. అడిదాస్, ప్యూమా… రెండు కంపెనీలు ఉన్న ప్రాంతాన్ని ఒక నది విడదీసేది. దీంతో ఆ రెండు ప్రాంతాలు ఈ ఫ్యాక్టరీల వల్ల నగరాలుగా మారిపోయాయి. ఎంతోమంది కార్మికులు సగం అడిదాస్ లో చేరితే, సగం మంది పూమాలో చేరేవారు. ఇద్దరి సోదరుల మధ్య జరిగిన గొడవలు కూడా కొంతమంది ఆసరాగా తీసుకొని వారి వద్ద చేరి అగాధాన్ని పెంచారని చెప్పుకుంటారు.
కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి?
ఇద్దరు సోదరులు జీవించి ఉండగా ఎప్పుడు రాజీ పడలేదు. ఆ ఇద్దరు సోదరుల మరణం తర్వాత మాత్రం కుటుంబాల మధ్య శత్రుత్వం చాలా వరకు తగ్గింది. ఎందుకంటే రుడాల్ఫ్ డాస్లర్ మనవడు పుమా బూట్లు ధరించేవాడు. అతడు ఇప్పుడు అడిదాస్ కంపెనీకి చీఫ్ లీగల్ కౌన్సిల్ గా కూడా పనిచేస్తున్నాడు. అతడు తన తాతల మధ్య ఉన్న శత్రుత్వం గురించి మాట్లాడుతూ ‘అది ఎన్నో ఏళ్ల క్రితం నాటిది… ఇప్పుడు అది ఒక చరిత్ర మాత్రమే’ అని చెప్పాడు
1987లో అడాల్ఫ్ కొడుకులు అడాదాస్ కంపెనీని ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త బెర్నార్డ్ టాపీకి అమ్మేశారు. అలాగే రుడాల్ఫ్ కొడుకులు పుమాలోని 72% షేర్లను స్విస్ కంపెనీకి అమ్మేశారు. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కూడా వాటి సృష్టికర్తల కుటుంబాల చేతుల్లో లేవు.