Germany Sick Leave Detectives| ఆర్థికరంగంలో నెలకున్న సవాళ్లతో సతమతమవుతున్న జర్మనీ కంపెనీలు.. ఉద్యోగుల ఉత్పాదకతపై దృష్టిసారించాయి. లేని అనారోగ్యం సాకుగా చూపి సెలవులు పెడుతున్న ఉద్యోగులపై ఉక్కుపాదం మోపేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు కోసం కొన్ని సంస్థలు ఏకంగా ప్రైవేటు డిటెక్టివ్‌లను (గూఢాచారులను) ఆశ్రయిస్తున్నాయి.
జర్మనీ కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2021లో ఉద్యోగులు సగటున 11.1 సెలవులను అనారోగ్యాల పేరిట తీసుకునే వారు. 2023 కల్లా ఇది 15.1కి చేరింది. ఉద్యోగులు సెలవులు ఎక్కువగా తీసుకుంటుండటంతో జీడీపీ 0.8 శాతం మేర కుంచించుకు పోయినట్టు ఓ అంచనా.
ఇక జర్మనీలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ గణాంకాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తమ పాలసీదారులు 2024లో తొలి తొమ్మిది నెలల్లోనే సగటున 14.13 సిక్ లీవులు తీసుకున్నారని సంస్థ పేర్కొంది. ఉద్యోగాలకు ఇలా ఎగనామం పెట్టే వారి సంఖ్య జర్మనీలో ఎక్కువగా ఉందని కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి వారు స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ కంటే జర్మనీలోనే ఎక్కువగా ఉన్నారట. కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రవేశపెట్టి కొన్ని నిబంధనల కారణంగా అనారోగ్యం సెలవులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు
ఓ మోస్తరు రోగ లక్షణాలు ఉన్నా ఫోన్ ద్వారా కార్యాలయాలకు సమాచారం అందించి సెలవులు పొందే సదుపాయం అప్పట్లో కల్పించారు. కానీ ఈ రూల్స్ ప్రస్తుతం దుర్వినియోగానికి కారణమవుతున్నాయట. ఇక అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ గణాంకాల ప్రకారం, 2023లో జర్మనీ ఉద్యోగులు సెలవుల కారణంగా 6.8 శాతం పనిగంటలు కోల్పోయారు. ఇతర ఈయూ దేశాలకంటే జర్మనీలో పనిగంటల నష్టం ఎక్కువని ఓఈసీడీ తేల్చింది.
జర్మనీ నిబంధనల ప్రకారం, అనారోగ్యం కోసం సెలవులు తీసుకునే వారికి కంపెనీలు గరిష్ఠంగా ఆరు వారాల వరకూ జీతంతో కూడిన లీవ్స్ మంజూరు చేయాలి. ఇది కంపెనీలకు ఆర్థికంగా భారంగా మారుతోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు సంస్థలు ప్రస్తుతం ప్రైవేటు డిటెక్టివ్‌లను ఆశ్రయిస్తున్నాయి. తాము ప్రస్తుతం ఏటా 1200 కేసుల్ని హ్యాండిల్ చేస్తున్నామని లెంట్జ్ గ్రూప్ అనే ప్రైవేటు డిటెక్టివ్ సంస్థ పేర్కొంది. గతంలో కేసుల సంఖ్య ఇందులో సగం మాత్రమే ఉండేదని చెప్పుకొచ్చింది. ఇక ప్రైవేటు డిటెక్టివ్‌ల తనిఖీల్లో పలు ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి. అనారోగ్యం పేరిట సెలవు తీసుకునే అనేక మంది ఉద్యోగులు తమ సొంత వ్యాపారాలపై నా లేదా ఇళ్లకు మరమ్మతులు చేసుకునేందుకు వెచ్చిస్తున్నారట. ఇలాంటి తుంటరి పనిచేసిన ఓ ఇటలీ బస్ డ్రైవర్ మొదట ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చివరకు కంపెనీ దయతలచడంతో మళ్లీ జాబ్‌లో చేరాడు.
ఉద్యోగులు ఆఫీసుకు అధికంగా డుమ్మా కొట్టడానికి గల కారణాలపై దృష్టి పెట్టాలని పరిశీలకులు చెబుతున్నారు. పని ప్రదేశాల్లో ఒత్తిడి, మానసిక సమస్యలతో కూడా ఇతర శారీరక అనారోగ్యాలు కూడా జనాలకు ఉద్యోగ బాధ్యతపై విముఖత ఏర్పడేలా చేస్తున్నాయట.