Cops Marry Rape Victim Accused| ఒక టీనేజర్ అమ్మాయిపై ఒక యువకుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఆ కృత్యాన్ని వీడియో కూడా తీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వీడియో ఆన్ లైన్ లో పెడతానని బెదరించాడు. ఆ తరువాత కూడా పలుమార్లు ఆమెను రేప్ చేశాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. ఇది తెలిసిన ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వెళితే.. అక్కడ పోలీసులు అత్యాచార నిందితుడితో ఆమెను పెళ్లి చేయాలని సలహా ఇచ్చి పంపించేశారు. దీంతో బాధితురాలికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు ఆ రేపిస్టుతో వివాహం చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బధోహి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బధోహి జిల్లాకు చెందిన 19 ఏళ్ల రేష్మ (పేరు మార్చబడినది) అనే యువతి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. ఆమె ప్రతిరోజూ కాలేజీకి వెళ్లి చదువుకుంటోంది. ఈ క్రమంలో రేష్మ్ నివసిస్తున్న కోత్వాలి ప్రాంతంలోనే ఏడాది క్రితం సాజిద్ అలీ అనే 35 ఏళ్ల యువకుడు వచ్చాడు. వీరిద్దరికీ ఒక రోజు పరిచయం అయింది. దీంతో సాజిద్ అలీ తరుచూ రేష్మ ఇంటికి వచ్చేవాడు. మార్చి 10, 2024న రేష్మ తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో అదును చూసి రేష్మపై అత్యాచారం చేశాడు. అత్యాచారం సమయంలో తన మొబైల్ తో వీడియో తీశాడు.
అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియో బయటపెడతానని.. ఆన్ లైన్ లో అందరూ చూసే విధంగా పోస్ట్ చేస్తానని రేష్మను బెదిరించాడు. రేష్మ అతని మాటలకు భయపడి పోయి ఎవరికీ చెప్పలేదు. దీంతో సాజిద్ అలీ ఆమె భయాన్ని అవకాశంగా తీసుకొని పలుమార్లు ఆమెను రేస్ చేశాడు. ఫలితంగా రేష్మ గర్భవతి అయింది. క్రమంగా రేష్మ శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన ఆమె తల్లిదండ్రులు.. ఆమెను చితకబాదారు. దీంతో రేష్మ జరిగిన దంతా చెప్పేసింది. రేష్మ గర్భవతి అని తెలియగానే సాజిద్ అలీ ఆమెతో కలవడం మానేశాడు.
రేష్మ తల్లిదండ్రులు తమ కూతురిని తీసుకొని కోత్వాలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ రేష్మ గర్భవతి అని తెలిసి పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా రేష్మను నిందితుడు సాజిద్ అలీతో వివాహం చేయాలని సూచించారు. రేష్మ తల్లిదండ్రులు కూడా ఆమెను సాజిద్ అలీని పిలిచి అతడితో వివాహం చేశారు. కానీ వివాహం జరిగిన తరువాత సాజిద్ అలీ, తన భార్య రేష్మతో ఎక్కువ సమయం గడిపేవాడు. తరుచూ ఉద్యోగ రీత్యా మరో ఊరు వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో నవంబర్ 26 2024న రేష్మ ప్రసవించింది.
ఆ తరువాత సాజిద్ అలీ గురించి ఒక రహస్యం తెలిసింది. సాజిత్ అలీ అక్కడే సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నాడని.. అతని ఇంతకు ముందే వివాహం అయిందని తెలిసి రేష్మ షాక్ కు గురైంది. సాజిద్ అలీకి మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
రేష్మ ఈ సారి తన తల్లిదండ్రులను ఎదిరించి జిల్లా ఎస్‌పి మీనాక్షి కాత్యాయన్ ను కలిసి కేసు నమోదు చేసింది. ఎస్ పి మీనాక్షి కాత్యాయన్.. సాజిద్ అలీని త్వరలో అరెస్ట్ చేసి కోర్టు లో ప్రవేశ పెడతామని తెలిపారు.