Godavari River: ఉదయం వస్తాడు.. రాత్రి 11 గంటల వరకు అస్సలు కదలడు. అటువైపు ఎవరైనా వెళ్లారో చూస్తూ ఉంటాడు.. అలా చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఇంతకు ఇతనెవరు? ఇతనేం చేస్తాడు? ఎందుకిలా తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
పొద్దున్నే నుంచి రాత్రి 11 గంటల వరకు.. ఒకే చోట నిలబడి, చెత్తను నదిలో పడేయకుండా నిరోధించడం అంటే మాటలు కాదు. ఇది నాశిక్ నగరానికి చెందిన చంద్రకిషోర్ పాటిల్ అనే వ్యక్తి చేస్తున్న అసాధారణ సేవ. ఇందిరానగర్‌లో గోదావరి నదితీరంలో రోజూ అతను ఈ పని చేస్తున్నాడు.. అది ఎలాంటి జీతం లేకుండా, ఎవరూ చెప్పకుండా, కేవలం మనసులో నదిపై ఉన్న ప్రేమతో ఇలా చేయడం విశేషం.
ఎక్కడైనా చెత్త పడితే మనం ముఖం తిప్పేసి వెళ్లిపోతాం. ఎవరైనా చెత్త వేసినా, ఇది మన పని కాదని ముందుకెళ్లిపోతాం. కానీ నాసిక్‌లో ఓ వ్యక్తి మాత్రం అలా అనలేదు. చెత్తను చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కాలుష్యాన్ని చూసి చేతులు కదిపాడు. నది పట్ల ఉన్న ప్రేమను చేతల్లో చూపిస్తున్నాడు. ఆయన పేరు చంద్రకిషోర్ పాటిల్.
నాసిక్ నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో గోదావరి నదీ తీరాన ఉదయం నుంచే ఓ వ్యక్తి కనిపిస్తుంటాడు. చేతిలో ఓ బీప్ వాయించే విసిల్, ముఖంలో గంభీరత, మనసులో నదిపై ప్రేమ. ఉదయం 6 గంటల నుంచే అక్కడకు వచ్చేస్తాడు. ఆ తర్వాత రాత్రి 11 గంటల వరకూ అక్కడే ఉంటాడు. పనేమంటే.. ఎవ్వరైనా గోదావరిలో చెత్త వేయాలంటే వారిని అడ్డుకోవడం. చేతిలో పోలీసు లాఠీ లేదు. పదవీ బలమేమీ లేదు. ఉన్నదల్లా.. ఒక్కటే.. సమాజపట్ల ఉన్న బాధ్యత.
ఎవరు ఎవరైనా.. నదిని మురికిగా మారనివ్వడు
చంద్రకిషోర్ పాటిల్ ఒక ప్రభుత్వ ఉద్యోగి కాదు. ఎవరైనా ఎంపీ, కార్పొరేటర్ కూడా కాదు. కానీ గోదావరి కోసం ఆయన చేస్తున్న పని పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు చేయలేనిది. ఎవరైనా నదిలో చెత్త వేస్తే వెంటనే విజిల్ ఊదుతూ వారిని అడ్డుకుంటాడు. కొంతమంది ఆయనను గౌరవంగా వినిపించుకుంటారు.
కానీ కొంతమంది తిడతారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు. అయినా ఆయన నోరుమూసే వాడు కాదు. వారిని కేవలం వాదించడమే కాదు.. ఓ బాటిల్ నదీ నీటిని తీసి చూపిస్తాడు. తాగండి ఈ నీరని అడుగుతాడు. వారు తాగలేరని చెప్పినప్పుడు.. ఎందుకు తాగలేరు? మీరు వేసిన చెత్త వల్లే ఇది మురికిగా మారిందని వారిని నిజం చూపిస్తూ చైతన్యం కలిగిస్తాడు.
అతని పనితీరును చూస్తే ఒక్క మనిషి వల్ల ఎంత మార్పు తీసుకురావచ్చేమో అర్థమవుతుంది. చుట్టుపక్కల వారు కూడా ఈ బాధ్యతను గుర్తించటం మొదలెట్టారు. కొన్ని స్కూల్ పిల్లలు ఆయనను చూసి నదిలో కాగితాలు, ప్లాస్టిక్ వేయడాన్ని మానేశారు. కొంతమంది యువకులు ఆయనకు సహకారం అందించేందుకు ముందుకొస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆయనపై పలు ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఆయన మాత్రం ప్రశంసల కోసం కాదు. నదికి చేకూరే చెత్త నిలిపే ప్రయత్నంలో తప్ప మరేమీ ఆశించడు.
Also Read: Case on Yash Dayal: పీకల్లోతు కష్టాల్లో RCB బౌలర్ దయాల్… ఏ క్షణమైనా అరెస్ట్..?
మన దేశంలో పుణ్య నదులు అనగానే గోదావరి పేరు తప్పకుండా వస్తుంది. కానీ మనమే నదిని మురికిగా మార్చేస్తున్నాం. పూజల పేరుతో పూలు, ప్లాస్టిక్, విగ్రహాలు.. అన్నింటినీ నదిలో వదుల్తున్నాం. మన చేతుల్తో గంగలను పాడుచేస్తున్నాం. అప్పుడు చంద్రకిషోర్ పాటిల్ లాంటి వారు మనకు అద్దంపట్టినట్లుంటారు. మన తప్పులు మన ముఖాలపై చూపిస్తారు.
గోదావరి కోసం నిలబడిన ఈ వ్యక్తిని చూసి మనమూ మారాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇంట్లో చెత్త వేరుచేసి వేయాలి. నదుల దగ్గర చెత్త వేయడం మానేయాలి. అవసరమైతే మనూ ముందుకు వెళ్లాలి. ఇలా ఒక్కొక్కరూ మారితేనే గోదావరి లాంటి పవిత్ర నదులు తిరిగి తమ స్వచ్ఛతను పొందగలవు.
చంద్రకిషోర్ పాటిల్ ఏమీ పెద్దవాళ్లు కారు. కానీ గొప్పవాళ్లేగా! ఎందుకంటే ఆయన చేస్తున్న పని ఒక నిజమైన దేశభక్తుడు మాత్రమే చేయగలడు. తన సమయం, శక్తి, ఆరోగ్యాన్ని త్యాగం చేస్తూ.. నదిని కాపాడుతున్నాడు. ఇది కేవలం ఒక మంచి పని కాదు. ఇది దేశ సేవ. పర్యావరణ పరిరక్షణ. భవిష్యత్తు తరాలకు ఓ ఆరోగ్యకరమైన భూమిని అందించే గొప్ప ప్రయత్నం. మనందరం కలిసి చంద్రకిషోర్ పాటిల్ కి ఒక పెద్ద సెల్యూట్ చేస్తూ.. మనచుట్టూ ఉన్న చెత్తను, కాలుష్యాన్ని, నిర్లక్ష్యాన్ని తగ్గించటంలో భాగస్వాములవుదాం.