Case on Yash Dayal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2025 ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} పేసర్ యష్ దయాల్ చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దయాల్ పై తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని మోసం చేశాడని ఘజియాబాద్ కి చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడి పై భారత న్యాయ సంహితలోని సెక్షన్ 69 కింద కేసు రిజిస్టర్ చేశారు.
Also Read: HBD Dhoni: ధోని క్రేజ్.. తెలుగు రాష్ట్రాల్లో 12 కటౌట్స్.. ఒక్కొక్కటి 50 అడుగులకు పైగానే
యష్ దయాల్ గత కొంతకాలంగా తనను శారీరక, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపణలు చేసింది. దీంతో ఆదివారం రోజు అర్ధరాత్రి ఇందిరాపురం పోలీస్ స్టేషన్ లో దయాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు ముఖ్యమంత్రి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ లో ఈ విషయాన్ని లేవనెత్తడంతో.. పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించిన తర్వాత ఈ ఆర్సిబి ప్లేయర్ పై చర్యలు చేపట్టారు.
దయాల్ పై 69 సెక్షన్
వివాహం, ఉద్యోగం లాంటి తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన ఘటనలలో ఈ 69 సెక్షన్ ని ఉపయోగిస్తారు. ఒకవేళ యష్ దయాల్ గనుక నేరం చేసినట్లు రుజువైతే మాత్రం అతడికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే అతడు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఓ నివేదిక ప్రకారం.. ఆ మహిళా యష్ దయాల్ తో ఐదు సంవత్సరాలుగా సంబంధం కలిగి ఉంది. ఈ ఆర్సిబి ప్లేయర్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించింది.
ప్రేమ పేరుతో మోసం చేసి.. తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తమ విషయం దయాల్ కుటుంబానికి కూడా తెలుసని.. తనని వాళ్ళ ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని చెప్పింది. దీంతో తన నమ్మకం రెట్టింపు అయిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కానీ శారీరక అవసరాలు తీర్చుకున్నాక.. పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఆ యువతీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు దయాల్ ని ఇంకా విచారించలేదు.
2019లో ఆ యువతీతో పరిచయం
త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తారని సమాచారం. అనంతరం ఆ యువతికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ యువతీతో 2019లో దయాల్ కి పరిచయం ఏర్పడిందని, సోషల్ మీడియా ద్వారా అతడిని కలిశానని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. తనని ఢిల్లీ, బెంగళూరు, ప్రయాగ్ రాజ్ సహా పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి తనతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలుగా దయాళ్ తో దిగిన ఫోటోలు, చాట్, వీడియో కాల్ రికార్డులను పోలీసులకు సమర్పించానని వెల్లడించింది.
Also Read: Virat Kohli: గజదొంగగా మారిన కోహ్లీ… బుద్ధి చెప్పిన ధోని… RCB పరువు మొత్తం పోయిందిగా!
తనతో మాత్రమే కాకుండా పలువురు ఇతర మహిళలతోనూ దయాల్ సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. న్యాయం కోసం, గౌరవం కోసం పోరాడడానికి తాను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు బాధితురాలు పేర్కొంది. తనలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇతర మహిళలకు ధైర్యాన్ని నింపడానికి బయటకు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే దయాల్ పై ఎఫ్ఐఆర్ వ్యవహారంపై అతని కుటుంబం స్పందించాల్సి ఉంది. ఇక ఐపీఎల్ 2025 18వ సీజన్ లో.. ఆర్సిబికి ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 13 వికెట్లతో ఆ జట్టు ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.