Guinness Record Oldest Weds| ప్రేమకు డబ్బు, అందం, వయసుతో పనిలేదని.. ప్రపంచంలో అప్పడప్పుడూ కొంతమంది ఉదాహరణగా నిలుస్తుంటారు. తాజాగా ఒక అత్యంత వృద్ధ ప్రేమకుల జంట పెళ్లిచేసుకుంది. ఇద్దరూ సెంచరీ దాటేశారు. పైగా గత 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఈ లేటు వయసు జంటకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు కూడా దక్కింది. 100 ఏళ్ల వయసున్న బర్నీ లిట్‌మ్యాన్ అనే వృద్ధ ప్రేమికుడు తన కంటే 2 ఏళ్ల పెద్ద అయిన మర్జొరీ ఫిటర్‌మ్యాన్‌ని (102) కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే డిసెంబర్ 3, 2024న ప్రపంచంలోనే అత్యంత వృద్ధ నవదంపతులుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వారు వీరిద్దరినీ అధికారికంగా గుర్తించారు.
9 ఏళ్లుగా రొమాన్స్ చేసుకున్న ప్రేమికులు
అమెరికాలోని ఫిలడెల్ఫియా రాష్ట్రానికి చెందిన బర్నీ లిట్‌మ్యాన్, మర్జొరీ ఫిటర్‌మ్యాన్.. ఇద్దరూ 9 ఏళ్ల క్రితం కలుసుకున్నారు. వీరిద్దరూ ఫిలడెల్ఫియాలోని ఒక వృద్ధాశ్రమంలో 2015లో మొదటిసారి కలుసుకున్నారు. అయితే తొలిచూపులోనే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారట. అప్పటి నుంచి కళ్ల ద్వారానే ప్రేమించుకుంటూ ఎంజాయ్ చేసేవారు. చివరికి 2024 సంవత్సరంలో మళ్లీ 9 ఏళ్ల క్రితం ఏ రోజు అయితే కలుసుకున్నారో అదే రోజు అంటే మే 19న అదే వృద్ధాశ్రమంలో ఘనంగా పెళ్లిచేసుకున్నారు. మే 19న వీరిద్దరిలో ఒకరి ముని మనవరాలి పుట్టినరోజు కావడంతో 9 ఏళ్ల క్రితం ఇద్దరూ ఆ బర్త్‌డే పార్టీలో కలుసుకున్నారు. అందుకే అదే రోజున తిరిగి పెళ్లిచేసుకున్నారు.
ఇద్దరూ గతంలో మంచి జీవితం అనుభవించనవారే
మర్జొరీ ఫిటర్‌మ్యాన్, బర్నీ లిట్‌మ్యాన్ ఇద్దరూ గతంలో తమ తమ జీవితాలు బాగా ఎంజాయ్ చేసినవారే. వారిద్దరూ దాదాపు 60 సంవత్సరాల పాటు వైవాహితక జీవితం అనుభవించారు. కానీ ఇప్పుడు బర్నీ లిట్‌మ్యాన్ భార్య గానీ, మర్జొరీ ఫిటర్‌మ్యాన్ భర్త గానీ జీవించిలేరు. ఈ వృద్ధ దంపతులకు సంబంధించి ఒక ఆసక్తి కర స్టోరీ కూడా ఉంది. వీరిద్దరూ ఒకరినొకరు తెలుసుకోలేకపోయినా.. ఇద్దరూ ఒకేసారి యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో తాము యవ్వనంలో ఉన్నప్పుడు చదువుకున్నారు. మర్జొరీ ఫిటర్‌మ్యాన్ టీచర్ కోర్సు చదువుకోగా.. బర్నీ లిట్‌మ్యాన్ మాత్రం ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
కానీ విధి వల్ల ఇద్దరూ కలుసుకోలేకపోయారు. బహుశా ఇన్నేళ్ల తరువాత ఇద్దరికీ ఒక తోడు అవసరమనే విధి వారిని కలిపింది.
Also Read: 73 corpse Thailand: పురాతన గుడి లోపల 73 శవాలు.. 600 మొసళ్లు.. అడవి మధ్యలో పూజలు!
పెన్సిల్వేనియా వృద్ధశ్రమంలో ఘనంగా వివాహం..
పెన్సిల్వేనియా వృద్ధశ్రమంలో మర్జొరీ ఫిటర్‌మ్యాన్, బర్నీ లిట్‌మ్యాన్ ఇద్దరూ యూదుల సంప్రదాయం ప్రకారం..రబ్బై (యూదుల పురోహితుడు) ఆడం వోల్ బర్గ్ చేతుల మీదుగా వివాహం చేసుకున్నారు. ఈ శుభసందర్భంలో రబ్బై ఆడం వోల్‌బర్గ్ మాట్లాడుతూ.. “నేను ఈ రోజుల్లో చాలా పెళ్లిళ్లు జరిపించాను. వారిలో చాలామంది ఏదో ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నవారే. కానీ నాకు ఈ పద్దతి కన్నా పాత సంప్రదాయలే ముఖ్యం. బయట అపరిచితులుగా కలుసుకోవడం.. వారితో స్నేహం చేయడం.. ఆ తరువాత ప్రేమలో పడడం. ఇదే సూపర్ గా ఉంటుంది.” అని అన్నారు.
ఈ వృద్ధ ప్రేమికుల పెళ్లికి వారిద్దరి కుటుంబాలకు చెందిన నాలుగు తరాల పిల్లలు విచ్చేశారు. ఈ వేడుకకు ఇద్దరు ముసలి ప్రేమికులు వీర్ చైర్ లో వచ్చారు. యూద సంప్రదాయం ప్రకారం.. ఒకరికి మరొకరు తోడుగా ఉంటామని చెప్పి ప్రమాణాలు చేస్తూ తమ జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
బర్నీ, మర్జోరీల ప్రేమకథ ద్వారా ప్రేమకు వయసు, సమయంతో పనిలేదని తెలుస్తోంది. ఇద్దరూ సాహసంగా ఈ లేటువయసులో పెళ్లి చేసుకొని ఈ కాలంలో ప్రేమ కోసం తపించే మనుషులకు ఒక ఆశాకిరణంలా నిలబడ్డారు.