అత్యవసర సమయాల్లో డబ్బులు కావాల్సిన వాళ్లు క్రెడిట్ కార్డుల మీద ఆధారపడుతున్నారు. ఇతరులను అడిగి ఇబ్బంది పడటం కంటే క్రెడిట్ కార్డును ఉపయోగించుకుకోవడం బెస్ట్ అనుకుంటున్నారు. అందుకే, చాలా మంది క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. కొంత మంది ఒకటి రెండు క్రెడిట్ కార్డులు తీసుకుంటే, మరికొంత మంది రెండుకు మించి కూడా తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ప్రపంచంలోనే అత్యధిక క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నాడు. ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫర్ రికార్డ్స్ లో ప్లేస్ కూడా సంపాదించేశాడు. ఇంతకీ ఆయన ఎవరంటే..
ప్రపంచంలోనే అత్యధిక క్రెడిట్ కార్డులు ఉన్న వ్యక్తిగా హైదరాబాద్ కు చెందిన మనీష్ ధమేజా గుర్తింపు తెచ్చుకున్నాడు. గిన్నీస్ రికార్డు కూడా సాధించాడు. ఆయన దగ్గర ఏకంగా 1,638 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అవన్నీ చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులే కావడం విశేషం. మనీష్, క్రెడిట్ కార్డులను తీసుకోవడం డబ్బుల కోసం కాకుండా, ఒక హాబీగా మలుచుకున్నాడు. క్రెడిట్ కార్డులు లేకపోతే తన జీవితంలో ఏదో వెలితిగా అనిపిస్తుందంటున్నాడు మనీష్. క్రెడిట్ కార్డుల నుంచి లభించే గిఫ్ట్స్, ప్రయోజనాలు పొందడం చాలా సరదాగా అనిపిస్తుందన్నారు.
క్రెడిట్ కార్డుల పెర్క్స్ మనీష్‌కు మంచి ఆనందాన్ని తెచ్చిపెట్టాయి. “నేను క్రెడిట్ కార్డుల ద్వారా కాంప్లిమెంటరీ ట్రావెల్ పొందుతాను. రైల్వే విమానాశ్రయ లాంజ్ లకు యాక్సెస్ పొందుతాను. ఫుడ్, స్పా సేవలు తీసుకుంటాను. హోటల్ వోచర్లు, దేశీయ విమాన టిక్కెట్లు, షాపింగ్ వోచర్లు, సినిమా టిక్కెట్లు, గోల్ఫ్ సెషన్లు, ఫ్యూయెల్ కూడా పొందుతాను. రివార్డ్ పాయింట్లు, ఎయిర్ మైల్స్, క్యాష్ బ్యాక్ పొందుతాను” అంటాడు మనీష్.
మనీష్ కు క్రెడిట్ కార్డుల మీద ఇంట్రెస్ట్ పెరగడానికి ఓ కారణం ఉంది. నవంబర్ 8, 2016న ప్రధాని మోడీ రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశం అంతటా భయాందోళననలు వ్యక్తం అయ్యాయి. కొత్త కరెన్సీ కోసం ప్రజలు బ్యాంకులకు పోటెత్తారు. బ్యాంకుల బయట పొడవైన క్యూలు కనిపించాయి. ఈ సమయంలో, క్రెడిట్ కార్డులు మనీష్ జీవితంలో కీలక పాత్ర పోషించాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేశాడు. పెద్దనోట్లు రద్దు అయినా ఎలాంటి ఇబ్బంది పడలేదు.
క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు అవసరం ఉన్న సమయంలో బ్యాంకుల దగ్గరికి పరిగెత్తకుండా, మనీష్ తన రోజువారీ కార్యకలాపాలను సులభంగా కొనసాగించగలిగాడు. ఎటువంటి ఆందోళన లేకుండా క్రెడిట్ కార్డుల సౌలభ్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. అతడికి, క్రెడిట్ కార్డులు ఆర్థిక స్వేచ్ఛను మాత్రమే కాకుండా అద్భుతమైన బహుమతులు పొందే అవకాశం కల్పించాయి. ప్రత్యేక ప్రయోజనాలను పొందడంలో సాయపడుతున్నాయి. అందుకే, మనీష్ ఇప్పటికీ, కొత్త క్రెడిట్ కార్డులను పొందే ప్రయత్నం చేస్తున్నాడు.
Read Also: రాత్రయితే నాగినిగా మారి కాటేస్తున్న భార్య.. కలెక్టర్ కు భర్త ఫిర్యాదు!