Pet Dog’s Birthday Party: కుక్కలు అంటే చాలా మందికి ఎంతో ప్రేమ. వాటిని చిన్న పిల్లల్లా పెంచుకుంటారు. కుంటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటారు. కుక్కలు కూడా తమ యజమానుల పట్ల ఎంతో ప్రేమను చూపిస్తాయి. తోకను ఆడిస్తూ విశ్వాసం చూపిస్తాయి. ఇతర జంతువులతో పోల్చితే కుక్కలు.. మనుషులతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాయి. తమకు నచ్చిన కుక్కల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే వారిని కూడా చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా రూ. 50 కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇప్పుడు ఓ మహిళ తన పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమతో అట్టహాసంగా బర్త్ డే పార్టీ నిర్వహించి వార్తల్లోకి ఎక్కింది.
రూ. 5 లక్షలతో పెంపుడు కుక్క బర్త్ డే వేడుకలు
జార్ఖండ్ కు చెందిన ఓ మహిళ తన పెంపుడు కుక్కకు కనీవినీ ఎరుగని రీతిలో బర్త్ డే వేడుకలు నిర్వహించింది. ఈ పార్టీ కోసం ఏకంగా రూ. 5 లక్షలు ఖర్చు చేసింది. 300 మంది గెస్టులను పిలిచి అట్టహాసంగా బర్త్ డే పార్టీ ఇచ్చింది. ఈ కుక్క బర్త్ డేకు సంబంధించి కుటుంబ సభ్యులు ఆహ్వాన పత్రికలు కూడా ప్రింట్ చేయించారు. పార్టీకి రావాలని అందరికీ పంపిణీ చేశారు. తమకు ఎంతో ఇష్టమైన కుక్క కోసం ఏకంగా రూ. 40 వేలు విలువ చేసే స్పెషల్ కేక్ ను రెడీ చేయించారు. చక్కటి డ్రెస్ కుట్టించారు. ఇక ఇంటిని అద్భుతంగా అలంకరించారు. కళ్లు చెదిరే విద్యుత్ కాంతుల్లో బర్త్ డే నిర్వహించారు. ఈ పార్టీకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు పరిసర గ్రామాల ప్రజలను కూడా ఆహ్వానించారు.
కుక్క కోసం విలువైన బహుమతులు!
ఇక ఈ పార్టీకి వచ్చిన వాళ్లు కుక్క కోసం విలువైన చాక్లెట్లు, బిస్కెట్లు గిఫ్టులుగా తీసుకొచ్చారు. కొంత మంది మరింత విలువైన బహుమతులు తీసుకొచ్చారు. బంగారు చైన్లు, లాకెట్లు చేయించుకొచ్చి మెడలో వేశారు. విందు అనంతరం వెళ్లిపోయే సమయంలో పార్టీకి వచ్చిన వాళ్లందరికీ రిటర్న్ గిఫ్ట్ లు కూడా అందజేశారు. ప్రస్తుతం జార్ఖండ్ లో ఎవరి నోట విన్నా ఈ కుక్క బర్త్ డే పార్టీ గురించే చర్చ జరుగుతోంది.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ప్రస్తుతం ఈ కుక్క బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది తమ పేదరికాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. “వీళ్ల ఇంట్లో కుక్కగా పుట్టినా బాగుండేది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. పేద కుటుంబంలో మనిషిలా పుట్టడం కంటే డబ్బు ఉన్న వాళ్ల ఇంట్లో కుక్కలా పుట్టడం బెటర్ అంటున్నారు. డబ్బులు ఏం చేయాలో తెలియని వాళ్లు చేసే పనులు ఇలాగే ఉంటాయని మరికొంత మంది విమర్శిస్తున్నారు. పెంపుడు కుక్క అంటే ఎంత ఇష్టమో ఈ పార్టీ ద్వారా ఆ కుటుంబ సభ్యులు చెప్పే ప్రయత్నం చేశారని మరికొంత మంది అంటున్నారు.
Read Also: ఆస్తులు ఉండగానే సరిపోదు, సావిత్రమ్మ లాంటి దానగుణం ఉండాలి!