కొంత మంది కోట్ల రూపాయలు కూడబెడతారు. తర తరాలు కూర్చొని తిన్నా కరగనంత సంపద పోగేస్తారు. కానీ, ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టేందుకు ఇష్టపడరు. కొంత మంది అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. వారికి గొప్ప దానగుణం ఉంటుంది. భావితరాల భవిష్యత్ కోసం తమ సంపదను ధార పోసేందుక ఏమాత్రం వెనుకడుగు వేయరు. అలాంటి వారిలో ఒకరు 95 ఏండ్ల సావిత్రి మాఝి. తాజాగా తన గ్రామంలో పిల్లలు ఆడుకునేందుకు సరైన మైదానం లేకపోవడంతో, 5 ఎకరాలు దానం చేసింది. అందులో క్రీడాకారులకు అవసరమైన స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
యువ అథ్లెట్లకు అండగా..
ఒడిశా నువాపాడలోని సింగఝర్ గ్రామానికి చెందిన 95 ఏళ్ల సావిత్రి మాఝి గురించి ఆ జిల్లాలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. దానగుణంలో కర్ణుడిని మించి ఉంటుంది ఈ మాతృమూర్తి. తన గ్రామంలోని విద్యార్థులు, యువకులు ఆడుకునేందుకు సరైన గ్రౌండ్ లేకపోవడంతో తన భూమిలో 5 ఎకరాలను విరాళంగా ఇచ్చింది. ఇందులో ప్రత్యేక ఆట స్థలం ఏర్పాటు చేయాలని అధికారులను కోరింది. ఆమె నిర్ణయంతో ఎంతో కాలంగా ఆట స్థలం లేక ఇబ్బంది పడుతున్న పిల్లలకు చక్కటి గ్రౌండ్ దొరికినట్లు అయ్యింది.
5 దశాబ్దాలుగా క్రీడలకు ప్రసిద్ధి
సింగఝర్ గ్రామం ఐదు దశాబ్దాలకు పైగా క్రికెట్, ఫుట్ బాల్, కబడ్డీ లాంటి క్రీడలకు కేంద్రంగా కొనసాగుతోంది. అంతర్-రాష్ట్ర బుధరాజ క్రికెట్ కప్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే, శాశ్వత క్రీడా మైదానం లేకపోవడం వల్ల స్థానికులు టోర్నమెంట్ల కోసం ఏటా ప్రైవేట్ భూములను పునరుద్ధరించాల్సి వస్తోంది. అంతేకాదు, వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. యువ అథ్లెట్లు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సరైన మైదానం లేకపోవడంతో ఇబ్బంది కలిగేది. ఈ విషయం సావిత్రమ్మకు తెలిసింది. యువ క్రీడాకారులకు ఓ దారి చూపించాలని గ్రామస్తులు కోరారు.
5 ఎకరాల భూమి విరాళం
గ్రామస్తులు ఆమెను రిక్వెస్ట్ చేయడంతో క్షణం కూడా ఆలోచించలేదు. తన భూమిలో 5 ఎకరాలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆమె నిర్ణయం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక క్రీడలకు సరిపడేలా విరాళంగా ఇచ్చిన భూమిలో స్టేడియంను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది సావిత్రమ్మ. అక్కడ స్టేడియం నిర్మిస్తే ఎంతో మంది క్రీడాకారులకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించింది.
#Brightside | 95-yr-old Sabitri Majhi donates 5 acre ancestral land in Nuapada for keeping village’s sports legacy alive | ✍️ @mayankpani_TNIE and Danis Roy | #Odisha@NewIndianXpress @santwana99@Siba_TNIE https://t.co/cIpx37uque pic.twitter.com/EgqXWHXPYm
— TNIE Odisha (@XpressOdisha) March 23, 2025
గతంలోనూ భూ దానాలు
గతంలోనూ సావిత్రమ్మ అనేక మంచి పనుల కోసం తన భూములను విరాళంగా ఇచ్చింది. ఆ ఊరిలో పాఠశాల నిర్మాణానికి, దేవాలయం నిర్మాణానికి సావిత్రమ్మ తన భూమినే దానంగా ఇచ్చింది. ఇప్పుడు స్టేడియం కోసం మరో 5 ఎకరాలు దానం చేయడంతో గ్రామస్తులు ఆమె గొప్ప మనసును అభినందిస్తున్నారు. ఊరి బాగుకోసం ఆమె చేసే మేలు ఎంతో గొప్పదని కొనియాడుతున్నారు. అటు పిల్లలు ఆడుకోవడం కోసం, ప్రయోజకులు కావడం కోసం భూమిని విరాళంగా ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని చెప్పింది సావిత్రమ్మ. ఊరి యువకులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించింది.
Read Also: అక్కడి ప్రజలకు దుస్తులు అంటే అలర్జీ.. విప్పుకుని తిరిగితేనే ఎనర్జీ అట!