University Job: పోటీ ప్రపంచంలో మంచి కంపెనీలో ఉద్యోగం కావాలంటే అందుకు అర్హతలు ఉండాలి. దానికి తగినట్టుగా వ్యక్తిగత టాలెంట్ చాలా అవసరం. క్యాంటీన్ మేనేజర్ పోస్టుకు అర్హత పీహెచ్‌డీ ఉండాలంటోంది ఆ యూనివర్సిటీ. అంతేకాదు పార్టీ సభ్యత్వం ఉంటే అదనపు ప్రయోజంగా పరిగణిస్తామంటోంది. ఇంతకీ ఎక్కడో తెలుసా?
చైనాలోని నాన్జింగ్‌లోని ఓ విశ్వవిద్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన ఇచ్చింది. దానికి కావాల్సిన అర్హతలు అందులో ప్రస్తావించింది. ఇంతకీ ఉద్యోగం ఏంటో తెలుసా? క్యాంటీన్ మేనేజర్ జాబ్. దానికి క్వాలిఫికేషన్ పీహెచ్‌డీ ఉండాలంటోంది. అందులో ఉద్యోగంలో చేయాల్సినవాటిని ప్రధానంగా ప్రస్తావించింది.
ఆహార తయారీని నిర్వహించడం, క్యాంటీన్ కాంట్రాక్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పరిపాలనా పని నిర్వహించడం, ఆహార భద్రతను నిర్ధారించడం, సాధారణ కార్యకలాపాలను పర్యవేక్షించడం అందులో కీలకమైనవి. దీనికితోడు అభ్యర్థులకు కచ్చితంగా ఇంగ్లీష్ భాష అవసరం. ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌లలో ప్రావీణ్యం ఉండాలి.
ఆహారం-పోషకాహారంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. అంతకుమించి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం ఉంటే అదనపు ప్రయోజనం కూడా. ఏడాదికి జీతం ఎంతో తెలుసా అక్షరాలా 1,80 వేల యువాన్లు. ఇండియన్ కరెన్సీలో దాదాపు 20 లక్షలన్నమాట. అంటే నెలకు లక్షన్నర పైమాటే. ఈ పోస్టుపై చైనా యువత విపరీతంగా చర్చించుకుంటోంది.
ALSO READ: సోషల్ మీడియాలో డస్టింగ్ ఛాలెంజ్.. ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి, అదెలా?
ఆ ఉద్యోగం ప్రకటనపై ఆన్‌లైన్‌లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. ఉద్యోగ ప్రొఫైల్ కాదు.. కేవలం దానికి సంబంధించిన అర్హతలపైనే. చైనా యువకులు రకరకాలు ప్రశ్నించారు. కేవలం క్యాంటీన్ ఉద్యోగానికి పీహెచ్‌డీ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చివరకు ఆ యూనివర్సిటీ ఒక మెట్టు దిగింది.
విమర్శలకు ప్రతిస్పందనగా అభ్యర్థి వంట చేయకూడదని విశ్వవిద్యాలయం చెప్పినట్టు స్థానిక పత్రిక తెలిపింది. పాక శాస్త్ర కళలు, పోషకాహారంలో విద్యా నేపథ్యాలకు సంబంధించిన ధృవపత్రాలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొంది. ఇంటర్నెట్ అర్హతల గురించి చర్చించినప్పటికీ ఈ పాత్రను పోషించడానికి కేవలం వంట గది అనుభవం కంటే ఎక్కువ అవసరం కావచ్చని స్పష్టం చేసింది.