Dusting Challenge Death| అమెరికాలోని అరిజోనాకు చెందిన 19 ఏళ్ల యువతి రెన్నా ఓ’రోర్క్ ఆదివారం ఒక ప్రమాదకర సోషల్ మీడియా ట్రెండ్ అయిన “డస్టింగ్”లో పాల్గొని మరణించింది. ఈ ట్రెండ్‌లో యువత ఆన్‌లైన్‌లో వ్యూస్ కోసం గృహ క్లీనర్‌లను పీల్చడం ద్వారా హై ఫీలింగ్ పొందుతారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన రెన్నా తన ప్రియుడితో కలిసి తల్లిదండ్రులకు తెలియకుండా కీబోర్డ్ క్లీనర్ ఆర్డర్ చేసింది. దీన్ని పీల్చిన తర్వాత ఆమెకు గుండెపోటు వచ్చి, నాలుగు రోజులు ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆమె మెదడు పనిచేయడం ఆగిపోయింది.
రెన్నా తండ్రి ఆరోన్ ఓ’రోర్క్ తన కూతురి మరణం గురించి మీడియాతో మాట్లాడారు. “నీవు చూస్తూ ఉండు నాన్న, నేను ఫేమస్ అయిపోతాను. మరి పేరు సంపాదిస్తాను,” అని రెన్నా ఎప్పుడూ చెప్పేది. కానీ ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఆమె పేరు అందరికీ తెలియడం చాలా బాధాకరం. “డస్టింగ్” లేదా “క్రోమింగ్” అనేది ఒక విషపూరిత ట్రెండ్. ఇందులో గృహ క్లీనర్‌లను పీల్చడం వల్ల తాత్కాలిక ఆనందం లభిస్తుంది కానీ గుండెపోటు వంటి ప్రమాదకర ఫలితాలు వస్తాయని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తెలిపింది.
రెన్నా తల్లి డానా ఓ’రోర్క్ ప్రకారం.. ఈ క్లీనర్‌లకు గుర్తింపు కార్డు అవసరం లేదు, వాసన ఉండదు. ఇవి యువతకు సులభంగా బయట అందుబాటులో ఉంది. డ్రగ్ టెస్ట్‌లో కూడా ఇవి కనిపించవు. రెన్నా మరణం తర్వాత కూడా.. ఆమె తల్లిదండ్రులు ఆమెను “ఉత్సాహంగా, ఉల్లాసంగా, బాగా ఫోకస్, టాలెంట్ ” ఉన్న అమ్మాయిగా వర్ణించారు. ఆమె పాటలు పాడటం, తన నవ్వుతో అందరినీ ఆకర్షించడం ఇష్టపడేదని గుర్తుచేసుకున్నారు.
ఓ’రోర్క్ కుటుంబం ఇప్పుడు రెన్నా జ్ఞాపకార్థం ఈ ట్రెండ్ ప్రమాదాల గురించి యువతకు.. తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. “మీ పిల్లల గదులను సోదా చేయండి, గుడ్డిగా వారిని నమ్మకండి. ఇలా చేయడం ద్వారా వారి జీవితాన్ని కాపాడవచ్చు,” అని రెన్నా తల్లి సూచించింది. అంత్యక్రియలు, వైద్య ఖర్చులు, థెరపీ ఖర్చుల కోసం వారు గోఫండ్‌మీ పేజీని కూడా ప్రారంభించారు. ఈ డబ్బును డస్టింగ్ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి కూడా ఉపయోగిస్తామని రెన్నా తండ్రి చెప్పారు.
ఈ ట్రెండ్ కొత్తది కాదు. 2024 మార్చిలో.. యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో చూసిన వీడియోలను అనుకరించి, విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12-17 ఏళ్ల వయస్సు గల యువతలో ఈ ట్రెండ్‌లో పాల్గొన్న వారి సంఖ్య 6,84,000 నుండి 5,54,000కి తగ్గినప్పటికీ, ఈ ట్రెండ్ వల్ల ప్రమాదం ఇంకా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: గుండె పోటు వస్తే వెంటనే సిపిఆర్ చేయాలి.. ఎలా చేయాలో తెలుసా?
యువత, తల్లిదండ్రులకు ఈ ట్రెండ్ ఒక హెచ్చరిక. సోషల్ మీడియా ట్రెండ్‌లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, అవి ప్రాణాంతకం కావచ్చు. అవగాహన, జాగ్రత్తలు మాత్రమే ఇలాంటి విషాదాలను నివారించగలవు.