Plane Crash Tragedy: అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్ ఇండియా AI-171 విమానం లండన్ గాట్విక్‌కు బయలుదేరుతోంది. కుటుంబాల కలలు, ప్రయాణీకుల నవ్వులు, సెల్ఫీలు, విడిపోవడంలో చిరునవ్వులు.. ఇవన్నీ క్షణాల్లో ఆవిరయ్యాయి. గగనమార్గం ఎన్నోజీవితాలను మింగేసింది. ఇదే రీతిలో తన కుమార్తెను ఎయిర్‌పోర్ట్ వద్దకు తీసుకెళ్లిన తండ్రి, ఆమెకు ఆశీర్వాదంగా ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. బంగారం లండన్ వెళ్తోంది.. దేవుడెప్పుడూ నీతో ఉండాలని. కానీ కొన్ని గంటల్లో ఆ తండ్రి పెట్టిన స్టేటస్ తారుమారైంది.
పూర్తి వివరాలలోకి వెళితే..
ఆమె పేరు ఖుష్బూ రాజ్‌పురోహిత్. చదువు కోసం లండన్ బయలుదేరిన యువతి ఈమె. తన జీవితంలో తొలి అంతర్జాతీయ ప్రయాణం. కానీ అది చివరి ప్రయాణంగా మారిపోతుందని ఎవరు ఊహించగలరు? విమానం టేకాఫ్ అయిన 3 నిమిషాలకే మేఘానీనగర్ ప్రాంతంలో భూమిని తాకింది. భయంకరమైన మంటలు, పొగ, అరుపులు.. ఎందరో ప్రాణాలు విడిచారు. అందులో ఖుష్బూ కూడా ఒకరు.
విమానం ప్రమాదం ఎప్పుడైనా వార్తల్లో వస్తే ఆ సంఖ్యలే ముందు కనబడతాయి. 242 మంది ప్రయాణికులు, 30 మంది మరణాలు.. దీనితో ఆ కుటుంబాల్లో ఉన్న విషాదం ఎవరూ మిగల్చలేరు. ఇలాగే ఖుష్బూ కథ అలాంటి దానిలో ఒకటి. ఆమె తండ్రి స్టేటస్ ఆశీర్వాదంగా పెట్టిన మెసేజ్ ఇప్పుడు వాట్సాప్ లో స్క్రీన్‌షాట్‌గా వైరల్ అవుతోంది.
ఈ ఘటనతో విమాన ప్రయాణ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే కేవలం సాంకేతిక లోపం, మానవ తప్పిదం, వాతావరణం అనే కోణాల్లో కాకుండా, మన జీవితాల్లో ఎప్పుడైనా జరిగే సాధారణ వీడ్కోలు ఎంత విలువైనదో కూడా ఈ కథ చెబుతోంది. తండ్రి బిడ్డకు వీడ్కోలు పలికి బంగారం అంటూ, నడుచుకుంటూ టర్మినల్‌లోకి వెళ్లిన క్షణం.. అవి ఇప్పుడు ఒక కుటుంబానికి చివరి జ్ఞాపకాలుగా నిలిచాయని చెప్పవచ్చు.
Also Read: Flight Safety Tips: విమానం కూలిపోయే ముందు ఇలా చేస్తే.. ప్రాణం సేఫ్!
సోషల్ మీడియాలో వైరల్..
ఖుష్బూకు వీడ్కోలు పలుకుతూ.. తండ్రి పెట్టిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ కాగా, నెటిజన్స్ బంగారం కు తండ్రి చివరి వీడ్కోలు పలికారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
AI-171 విమాన ప్రమాదానికి సంబంధించిన సమాచారం ప్రకారం, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్ ఫెయిల్యూర్, సాంకేతిక లోపం వల్ల కూలిపోయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకొని AAIB విచారణ చేస్తున్నా, పునరావృతం కానివిధంగా భద్రత ప్రమాణాలు పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయం. మొత్తం మీద ఈ ప్రమాదం ఊహించని రీతిలో జరగగా, కేంద్రంతో సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మృతులకు నివాళులు అర్పించాయి. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.