ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మిట్స్ నేచురా లిమిటెడ్ ఫార్మా కంపెనీ అధినేత MK భాటియా వార్తల్లో నిలిచారు. హర్యానాలోని పంచకులా బేస్ గా నడుస్తున్న తన కంపెనీకి చెందిన ఉద్యోగులకు దీపావళి కానుకగా లగ్జరీ కార్లు అందించారు. ఈసారి ఏకంగా 51 మందికి కార్లు గిఫ్ట్ గా ఇచ్చారు. గత రెండేళ్లుగా దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు కార్లు అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగింది. ఆ కార్లతో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎప్పటి లాగానే ఈసారి కూడా తన కంపెనీ ఉద్యోగులకు లగ్జరీ కార్లు అందించారు. కియా, టాటా, మహీంద్రా సహా పలు లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చారు. ఈ కార్లకు సంబంధించిన కీలను స్వయంగా అందజేశారు. ఈసారి కార్ల సంఖ్య హాఫ్ సెంచరీ దాటినట్లు భాటియా వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగులకు ఇంత ఖరీదైన బహుమతులు ఎందుకు ఇస్తారని భాటియాను మీడియా అడగ్గా, ఆసక్తికర సమాధానం చెప్పారు. ఉద్యోగుల కష్టం, నిజాయితీ కారణంగానే తన కంపెనీ ఈ స్థాయిలో నిలిచిందన్నారు. వారి నిబద్ధతను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే వారికి చక్కటి కార్లను బహుమతిగా అందిస్తున్నట్లు తెలిపారు. “నా కంపెనీలో పని చేసేవారిని ఉద్యోగులుగా కాకుండా సహచరులుగా చూసుకుంటున్నారు. వారే నా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వెన్నెముక. వారి కృషి, నిజాయితీ, అంకితభావం మా విజయానికి పునాది. వారి శ్రమను, కష్టాన్ని గుర్తించడం, వారిని మరింత ప్రోత్సహించడం నా ఏకైక లక్ష్యం. నా కంపెనీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనేదే నా ఉద్దేశం” అన్నారు భాటియా.
ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే కంపెనీ అభివృద్ధి చెందుతుందన్నారు భాటియా. ఉద్యోగులు అసంతృప్తితో ఉంటే ఏ సంస్థ అయిన అచిరకాలంలోనే పతనం చెందడం ఖాయం అన్నారు. “నేను తీసుకున్న ఈ నిర్ణయం టీమ్ స్పిరిట్ ను మరింత పెంచుతుందని భావిస్తున్నాను. టీమ్ సంతోషంగా ఉన్నప్పడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది” అని భాటియా చెప్పుకొచ్చారు.
ఇక తాజాగా భాటియా తన ఉద్యోగులకు కార్లు బహుమతిగా ఇస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు భాటియా ఉద్యోగుల పట్ల కనబరిచే దాతృత్వం పట్ల ప్రశంసలు కురిఇపస్తున్నారు. లాభాలు పరమావధిగా ముందుకు సాగే కార్పొరేట్ సంస్థలు భాటియాను చూసి నేర్చుకోవాలంటున్నారు. భాటియా లాంటి యుమానులు ఉంటే ఉద్యోగులకు మరింత కష్టపడి పని చేయాలనే ఆలోచన కలుగుతుందంటున్నారు.
Read Also: