రైళ్లలో ప్రయాణీకులు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని అధికారులు పదే పదే చెప్తూనే ఉంటారు. తరచుగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ప్రయాణ సమయంలో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, ఇతరులకు ఇబ్బంది కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తారు. అయినప్పటికీ, కొంత మంది తమ తీరు మార్చుకోవడం లేదు. కొన్నిసార్లు తోటి ప్రయాణీకులతో గొడవ పడటం మొదలు కొని, రైల్వే సిబ్బంది పైనా దౌర్జన్యం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ మహిళ ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణిస్తూ, ఎదురుగా వచ్చే లోకల్ రైలు లోకో పైలెట్ మీద రాయి విసిరిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తాజాగా వెలుగు చూసిన ఈ వీడియోలో ఓ మహిళ ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తుంది. ఆమె ముందుగానే తనతో పాటు ఓ రాయి తెచ్చుకుంది. చేతిలో పట్టుకుంది. ప్రయాణ సమయంలో ఎదరుగా వస్తున్న లోకల్ రైలు మీదికి తన చేతిలోని రాయిని బలంగా విసిరింది. ఆ రాయి తగిలి లోకల్ రైలు అద్దం పగిలినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా సదరు మహిళ కోపంతో ఆ రైలు వైపు చేచి చూపిస్తూ హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన ఎంఎంటీఎస్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also: ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాలు బంద్, ఎందుకంటే?
ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు పాల్పడిన మహిళపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది ఆమెను సీరియస్ గా పనిష్ చేయాలంటుంటే, మరికొంత మంది ఆమె మానసిక పరిస్థితి బాగా లేక అలా చేసినట్లు అర్థం అవుతోందని కామెంట్స్ చేశారు. “ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఆమె మహిళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఆమె చేసిన పని కారణంగా రైల్లో ప్రయాణించే వందలాది మంది ప్రయాణీకుల భద్రత మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రాయి లోకో పైలెట్ కు నేరుగా తగిలితే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు” అన్నారు. “ఆమె దాడి చేయాలనే ఉద్దేశంతోనే రాయి తెచ్చుకుంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఆమె మానసిక పరిస్థితి బాగాలేనట్లు అర్థం అవుతుంది” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఇన్సిడెంట్ ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది.
Read Also: విజయవాడ రైల్వే స్టేషన్, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు.. శుభ్రత పాటించనివారికి జరిమానాలు!