Odisha Mysterious Sound: ఒడిశాను గత కొంత కాలంగా వింత శబ్దాలు వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి ఆకాశం నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయి. జాజ్ పూర్, భద్రక్, కియోంఝర్ అనే మూడు జిల్లాల్లో ఈ భయంకరమైన శబ్దాలు వినిపించాయి. జాజ్ పూర్ జిల్లాలోని జాజ్ పూర్ రోడ్, ధర్మశాల, కియోంఝర్ జిల్లాలోని ఆనంద్ పూర్, భద్రక్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం(మార్చి 3న) మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో ఆకాశం నుంచి రహస్యమైన శబ్దాలు వచ్చాయి. తీవ్రమైన శబ్దం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా మంది భయాందోళనకు గురయ్యారు. భూకంపం వస్తుందేమోనని భయపడి ఇళ్లలో నుంచి వేగంగా బయటకు వచ్చారు.
వింత శబ్దాలపై పరిశోధకుల ఆరా
జనాలు బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఆకాశం నుంచి భారీ శబ్దం వినిపించింది. ఈ శబ్దంతో జనాలు మరింత భయపడ్డారు. ఈ శబ్దం కొద్ది నిమిషాల పాటు ప్రతిధ్వనించినప్పటికీ ఎక్కడి నుంచి వచ్చిందో కచ్చితంగా గుర్తించలేకపోయారు. ఆ వింత శబ్దాలపై ఆ రాష్ట్ర వాతావరణశాఖ అధికారులు ఢిల్లీలోని ఐఎండీ అధికారులకు సమాచారం అందించారు. ఈ శబ్దాలకు గల కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు పరిశోధకులు.
ఒడిషాలో వింత శబ్దాలు ఇదే తొలిసారి కాదు!
ఒడిశాలో ఇలాంటి వింత శబ్దాలు వినిపించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటన చాలాసార్లు జరిగాయి. జూన్ 7, 2024న బాలసోర్ జిల్లాతో పాటు భద్రక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వింత శబ్దాలు ఏర్పాడ్డాయి. జూన్ 6, 2024న కూడా మరోసారి ఇలాంటి శబ్దాలే వచ్చాయి. జూన్ 2న ఒడిశా కొరాపుట్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం పూట ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో కేవలం 7 నిమిషాల వ్యవధిలో సుమారు 15 వేల సార్లు మెరుపులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి మెరుపు చాలా అరుదుగా వస్తాయని వెల్లడించారు. భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులతో పిడుగులూ పడినట్లు తెలిపారు. అంతేకాదు, జాజ్ పూర్, భద్రక్, కియోంఝర్ లోని ఆనంద్ పూర్ ప్రాంతాల ప్రజలు నవంబర్ 24, 2022న ఆకాశం నుండి ఏదో వింత శబ్దం విన్నట్లు తెలిపారు.
Read Also: సర్కారు నౌకరీ ఉంటే చాలట.. ఈ అమ్మాయి భలే గమ్మత్ ఉందయ్యో!
వింత శబ్దాలకు అసలు కారణాలు ఏంటి?
ఒడిషాలో చాలా కాలంగా ఆకాశం నుంచి వింత శబ్దాలు వస్తున్నప్పటికీ.. అసలు కారణాలను కనుగొనలేకపోతున్నారు అధికారులు. ఇప్పటికే ఒడిషా మర్మ శబ్దాలకు సంబంధించి ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ఢిల్లీలోని ఐఎండీ అధికారులకు నివేదికలు అందించారు. ఎందుకు ఇలాంటి భారీ శబ్దాలు వస్తున్నాయో తెలపాలని కోరారు. కానీ, ఇప్పటికీ వరకు ఎలాంటి కారణాలు చెప్పలేకపోయారు అధికారులు. త్వరలోనే ఈ వింత శబ్దాలకు కారణాలు తెలిసే అవకాశం ఉన్నట్లు ఒడిషా అధికారులు వెల్లడించారు.
Read Also: బట్టతల ఉందని బాధపడుతున్నారా? అయితే, మీకు షఫీక్ గురించి తెలియాల్సిందే!