Nithya Menen: కేవలం టాలెంట్‌తోనే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తానేంటో నిరూపించుకున్న హీరోయిన్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. ఆన్ స్క్రీన్ నిత్యా మీనన్ (Nithya Menen) యాక్టింగ్‌లో డిఫెక్ట్స్ ఉండవని తన ఫ్యాన్స్ అంటుంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం ఈ ముద్దుగుమ్మ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వదు. తనకు నచ్చినట్టు ఉంటుంది, నచ్చిందే మాట్లాడుతుంది, ప్రవర్తన కూడా అంతే. అయినా కూడా తనను ఇష్టపడే వాళ్లు ఉంటారు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘కాదలిక్క నేరమిల్లై’ ఆడియో లాంచ్‌లో ఈవెంట్ ఆర్గనైజర్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల నిత్యా గురించి హాట్ టాపిక్ మొదలయ్యింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తను చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.
నచ్చే ప్రొఫెషనే కాదు
‘‘సినిమాల్లోకి నేను ఇష్టపడి ఎంచుకొని రాలేదు. నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాతే దేవుడిని నమ్మడం మొదలుపెట్టాను. మా నాన్న దేవుడిని నమ్మేవారు కాదు. నేను కూడా అలాగే పెరిగాను. నా ప్రమేయం లేకుండా ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు నాకు తెలియకుండానే ఏదో బలమైన శక్తి నన్ను నడిపిస్తుందని నమ్మడం మొదలుపెట్టాను. దాన్ని నేను కంట్రోల్ చేయలేనని కూడా అర్థమయ్యింది. నాకు అసలు ఇది నచ్చే ప్రొఫెషనే కాదు. నాకు ఇప్పటికీ ఛాన్స్ ఉన్నా నేను వెళ్లిపోయేదాన్ని’’ అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది నిత్యా మీనన్. దీంతో మంచి సినిమాలతో, అంతకు మించిన మంచి పాత్రలతో అందరినీ ఆకట్టుకున్న నిత్యా.. ఇలా మాట్లాడుతుంది ఏంటి అంటూ అందరూ షాకయ్యారు.
Also Read: భర్తను పొగడ్తలతో ముంచేస్తున్న ఉపాసన.. ‘గేమ్ ఛేంజర్’పై భార్య రివ్యూ
పైలెట్ అవ్వాలనుకున్నాను
‘‘నేను కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నానని అనిపించవచ్చు. కానీ ఈ ప్రొఫెషన్ అనేది నా పర్సనాలిటీకి అస్సలు సెట్ అవ్వదు. నేను చాలా మామూలు జీవితం గడపాలని అనుకుంటున్నాను. నాకు ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి పైలెట్ అవ్వాలని అనుకున్నాను. మామూలుగా పార్క్‌కు వెళ్లి సరదాగా గడపడం నాకు ఇష్టం. కానీ నేను యాక్టర్ అయితే మాత్రం ఇవన్నీ నేను వదులుకోవాలి. ఒక్కొక్కసారి ఇవన్నీ వదులుకోవడం కరెక్టా కాదా అని నన్ను నేను అడుగుతుంటాను. నేనే నిర్ణయం తీసుకున్న నా తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదు. నేను ఇప్పటికీ సినిమాలు మానేసి, సింపుల్ లైఫ్ గడపాలని అనుకుంటున్నానని వారికి చెప్తుంటాను’’ అని చెప్పుకొచ్చింది నీత్యా మీనన్.
దేవుడు లంచం ఇచ్చాడు
‘‘నేను నేషనల్ అవార్డ్ అందుకోకముందు నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసి సైలెంట్‌గా సినిమాల్లో నుండి తప్పుకోవాలని అనుకున్నాను. అసలు నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాను. కానీ నాకు తిరుచిత్రంబలం సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. దేవుడు నాకు అలా లంచం ఇచ్చి సినిమాలు వదలకుండా చేశాడు’’ అని బయటపెట్టింది నిత్యా మీనన్. దీన్ని బట్టి చూస్తే నిత్యాకు అసలు సినిమాల్లో ఉండడమే ఇష్టం లేదేమో అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. మరి అంత ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండడం ఎందుకో అన్నట్టుగా విమర్శలు కూడా కురిపిస్తున్నారు.