ఫ్లైఓవర్ల కింద ఖాళీ స్థలాన్ని అలాగే వదిలేస్తారు ఎందుకో తెలుసా..? కొన్నిసార్లు పెద్ద పెద్ద హైవేల కింద కూడా ఖాళీ స్థలం ఉంటుంది. అలాంటి ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది కదా. హైదరాబాద్ లో ఫ్లైఓవర్ల కింద కొన్నిచోట్ల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటవుతున్నాయి. మరికొన్ని చోట్ల పచ్చని గార్డెన్ లు ఏర్పాటు చేస్తున్నారు. అసలు వాటి కింద అపార్ట్ మెంట్లు కడితే ఎలా ఉంటుంది. పోనీ అపార్ట్ మెంట్లు కట్టిన తర్వాతే వాటిపైన హైవేలు నిర్మిస్తే ఎలా ఉంటుంది. అవును స్థలం కలిసొస్తుంది, వృథాగా మిగిలిపోయే స్థలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టవుతుంది. ప్రస్తుతం చైనాలో అదే జరుగుతోంది.
Chineses morando debaixo do viaduto. Isso não existe no capitalismo.#Repost @itschina.baby
A magical construction style. There are many residential buildings under the viaduct. pic.twitter.com/bmDyoPJPrx— 🚩Marco Antonio🚩 (@macfa) April 23, 2025
స్థలం సద్వినియోగం..
చైనాలోని గుయాంగ్, గుయిజౌ ప్రావిన్స్ లలో ఫ్లైఓవర్లు, హైవేల కింద అపార్ట్ మెంట్లు ఉన్నాయి. గుయాంగ్ ప్రావిన్స్ లో 1997లో ఒక పెద్ద హైవే నిర్మించారు. ఆ తర్వాత రెండేళ్లకు 1999లో దాని కింద తక్కువ అద్దెకు అపార్ట్‌మెంట్‌లు నిర్మించారు. పెరుగుతున్న జనాభా సమస్యకు ఇది ఓ చక్కని పరిష్కారంలా కనపడింది. బ్రిడ్జి కింద ఖాళీ స్థలాన్ని అపార్ట్ మెంట్లు నిర్మించడం ద్వారా సద్వినియోగపరిచారు.
తప్పనిసరి పరిస్థితుల్లో
మరికొన్ని సందర్భాల్లో రోడ్ల విస్తరణకు అపార్ట్ మెంట్ల ఓనర్లు సహకరించకపోవడంతో ఇలా అపార్ట్ మెంట్లపైనుంచే ఫ్లైఓవర్లు, హైవేలు నిర్మితమవుతున్నాయి. నిర్వాసితులకు ఇస్తామంటున్న పరిహారం మరీ తక్కువగా ఉండటంతో వారు అక్కడినుంచి కదిలేందుకు ఇష్టపడటం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చైనాలో అపార్ట్ మెంట్ల పైనుంచే ఫ్లైఓవర్లు వేసేస్తున్నారు.
సమస్యలున్నాయా..?
స్థలం కలిసొస్తుంది సరే.. మరి ఈ ఫ్లైఓవర్లు, హైవేల వల్ల వాటి కింద నివశించేవారికి ఏమైనా సమస్యలున్నాయా అంటే ఉన్నాయని చెప్పక తప్పదు. ఫ్లైఓవర్ల కింద ఉండే అపార్ట్ మెంట్లలో గాలి వెలుతురు సమస్యలుంటాయి. వాయు కాలుష్యంతోపాటు శబ్ద కాలుష్యం కూడా అధికమే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే జీవనం గడుపుతున్నారు కొందరు. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా.. నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం నచ్చడంలేదు. అందుకే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. సో.. అలాంటి చోట్ల అపార్ట్ మెంట్లపైనుంచే రోడ్లు వేయాల్సి వస్తోంది.
న్యూయార్క్ లోని, మన్ హట్టన్‌లో కూడా బ్రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. అయితే పట్టణ స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడానికి ఇది 1960లో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్. జపాన్ లో ఎత్తైన హైవేల కింద వేర్ హౌస్ లు, గోడౌన్ల వంటి నివాసేతర నిర్మాణాలు ఉంటాయి. చైనాలో మాత్రం ఇలాంటు ఉదాహరణలు లేవు. అక్కడ కేవలం పరిహారం నచ్చక బాధితులు తమ ఇళ్లను ఖాళీ చేయడం లేదు. అదే సమయంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కొత్త రోడ్లు అనివార్యంగా మారాయి. అవి కూడా అపార్ట్ మెంట్ల పైనుంచే వెళ్తున్నాయి. అసౌకర్యంగా ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ఇలాంట్ అపార్ట్ మెంట్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. చైనాలో ఈ లోకాస్ట్ అపార్ట్ మెంట్లకు కూడా ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి చోట్ల నివాసం ఉండేవారు ఎయిర్ ప్యూరిఫైయర్‌లు లేదా వైట్ నాయిస్ మెషీన్ లను వాడుతున్నారు.